Chandrababu Naidu: “పద్ధతి మార్చుకోకుంటే ఇంట్లో కూర్చోవాల్సిందే”.. పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

|

Sep 24, 2022 | 11:24 AM

తెలుగు దేశం నేతలపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఇన్ ఛార్జీలతో వరస సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు...

Chandrababu Naidu: పద్ధతి మార్చుకోకుంటే ఇంట్లో కూర్చోవాల్సిందే.. పార్టీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
Chandrababu
Follow us on

తెలుగు దేశం నేతలపై ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరోసారి ఫైర్ అయ్యారు. ఇన్ ఛార్జీలతో వరస సమీక్షలు నిర్వహిస్తున్న ఆయన.. క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. పలు చోట్ల పనితీరు బాగానే ఉన్నా మరికొన్ని చోట్ల వారి పని తీరుపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనని వారు పని తీరు మార్చులకోవాలని వార్ని్ంగ్ ఇచ్చారు. ఇన్ ఛార్జీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వారు పార్టీలోని ప్రతి కార్యకర్తతోనూ కలుపుగోలుగా ఉండాలని, వారిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. అంతే గానీ.. ఏకపక్షంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికలకు సిద్దంగా ఉన్నారా లేక ప్రత్యామ్నాయాలు చూసుకోవాలా అని ప్రశ్నించారు. అంతర్గత నివేదికల ఆధారంగా ఇన్ ఛార్జ్ నేతల పనితీరును చంద్రబాబు విశ్లేషిస్తున్నారు. బాగా పని చేస్తున్న వారిని అభినందించారు. గతంలో ఏ ప్రభుత్వంపై లేనంత వ్యతిరేకత జగన్‌ ప్రభుత్వంపై ఉందని చంద్రబాబు వెల్లడించారు. అలా అని ఇంట్లో కూర్చుంటామంటే కుదరదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నేతలు పద్ధతి మార్చుకోవాలని, లేదంటే పరిస్థితులు చేజారిపోతాయని స్పష్టం చేశారు.

పార్టీ విషయాల్లో రాజీ పడేది లేదు. గ్రామస్థాయి వరకు కమిటీలు పూర్తి చేయాలి. ఓటర్లు వెరిఫికేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నేతలు సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకోవాలి. వాటిని ఉపయోగించి ప్రజల్లో ముందుకు వెళ్లాలి. రాష్ట్రంలో టీడీపీ నేతలు బయటకు వస్తే కేసులు పెడుతున్నారు. జగన్‌కు నిద్రలో కూడా టీడీపీ నేతలే గుర్తుకు వస్తున్నారు. కేసులు, దాడులపై న్యాయ పరంగా రాజకీయంగా పోరాడదాం. జగన్ అక్రమాలకు అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. అవినీతి బురద మనకూ అంటించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ఇంకా 18 నెలల సమయం ఉంది.

– నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. రాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరుతోంది. విజయవాడలోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్చడంపై ప్రభుత్వ తీరును పలువురు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శాసనసభలో జగన్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిస్తూ.. ఏధైర్యంతో ఎన్టీఆర్ పేరును మార్చే నిర్ణయం తీసుకున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్టీఆర్ తో పోలిస్తే రాజశేఖర్ రెడ్డి ఏ విషయంలో గొప్ప అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎంతో మహోన్నతమైన వ్యక్తి ఎన్టీఆర్ పేరును తీసేసి రాజశేఖర్ రెడ్డి పేరు ఎలా పెడతారని జగన్ పై మండిపడ్డారు. అంతగా పేరు పెట్టాలనుకుంటే కొత్తగా వైద్య కళాశాలలు కట్టి.. వాటికి మీ తండ్రి పేరు పెట్టుకోవాలని సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..