విజయవాడకు సీఎం విజయ్.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కీలక భేటీ.. పూర్తి షెడ్యూల్ ఇదిగో..
తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం విజయవాడలో పర్యటించనున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ, అలాగే దుర్గాదేవి అమ్మవారి దర్శనం, , విజయవాడ ఉత్సవ్ 2.0లో పాల్గొననున్నారు. సీఎంల భేటీలో తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా తమిళనాడుకు కృష్ణా జలాల సరఫరా, నీటి కేటాయింపులు, గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం వంటి అంశాలపై చర్చించనున్నారు. అయితే.. సీఎంలు చంద్రబాబు, విజయ్ భేటీలో తీసుకునే నిర్ణయాలపై ఆసక్తి నెలకొంది.

ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య జల సంబంధిత అంశాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇదే అంశంపై సీఎం చంద్రబాబుతో చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇవాలళ విజయవాడకు రానున్నారు. ప్రధానంగా తెలుగు గంగ ప్రాజెక్టు నుంచి తమిళనాడుకు అందాల్సిన కృష్ణా జలాల వాటా, నీటి సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. అదే సమయంలో గోదావరి–కృష్ణా–కావేరి నదుల అనుసంధానం అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. ఏపీ నిర్మించతలపెట్టిన డ్యామ్‌ల అంశంపైనా మాట్లాడే ఛాన్స్ ఉంది. అంతేకాదు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విజయ్ కూడా కలిసే అవకాశం కనిపిస్తోంది.
అమ్మవారి దర్శనం.. విజయవాడ ఉత్సవ్‌లో సందడి..
భేటీ అనంతరం విజయ్ ఇంద్రకీలాద్రికి చేరుకుని అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఆ తర్వాత విజయవాడలో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ 2.0లో విజయ్, చంద్రబాబు పాల్గొంటారు. విజయవాడ ఉత్సవ్ లో భాగంగా.. సీఎం చంద్రబాబు, తమిళనాడు సీఎం విజయ్ పున్నమి ఘాట్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించనున్నారు. కాగా.. తమిళనాడు సీఎం విజయ్ చెన్నై నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడకు చేరుకుంటారు. ఆ తర్వాత.. సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్తారు.. చర్చల తర్వాత.. అమ్మవారి దర్శనం, విజయవాడ ఉత్సవ్ లో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం చెన్నైకి పయనమవుతారు.
కాగా.. దసరా సంబరాలు అంబరాన్నంటేలా.. విజయవాడ ఉత్సవ్ 2.0 దుమ్మురేపుతోంది.. జానపద గేయాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, స్పెషల్ ఆర్ట్ లతో.. మన సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా చేస్తున్నారు. బసవ పున్నయ్య స్టేడియంతో పాటు.. పున్నమి ఘాట్ లో లైవ్ మ్యూజిక్ తో యువత చిందులేస్తున్నారు. పున్నమి ఘాట్‌లో గోల్డెన్ గర్ల్స్ టీమ్ విఘ్నేశ్వరుడి సాంగ్‌కు చేసిన యాక్ట్ అందరినీ ఆకట్టుకుంది.
మొత్తంగా… సీఎం హోదాలో విజయ్ తొలిసారి ఏపీకి వస్తుండటంతో పర్యటనపై ఆసక్తి నెలకొంది. మరి నీటి కేటాయింపులు, జలాశయాల్లో నీటి నిల్వలు, సరఫరాలో ఎదురవుతున్న సమస్యలపై ఇరువురి చర్చలు ఎలా ఉండబోతున్నయన్నది చూడాలి.
