తమ భార్యలను కాపురానికి పంపలేదంటూ ఓ మామ తీరుకు నిరసనగా అల్లుళ్లు రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. అంతేకాకుండా.. పెళ్లైన తర్వాత కూడా కూతుర్లను కాపురాలకి పంపకుండా ఇంట్లోనే ఉంచుకుని తమని వేధిస్తున్నారని, మామపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.. ఈ ఘటన ఏలూరులో సంచలనంగా మారింది. అసలు ఆ అల్లుళ్లు ఎవరు..? ఎందుకు ఆ మామ కూతుళ్లను కాపురానికి పంపడం లేదు..? అల్లుళ్ళను ఏ విధంగా హింసిస్తున్నారు.. ఇలా అన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం… ఆడ పిల్లలను కన్న ఏ తల్లిదండ్రులైన తమ కుమార్తెకు యుక్తవయస్సు రాగానే పెళ్లి చేసి సంతోషంగా తన భర్తతో ఎప్పుడు కలిసి ఉండాలని దీవిస్తూ.. వారిని ఆనందంగా కాపురానికి పంపుతారు. కానీ ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా తమ కుమార్తెలకు పెళ్లయిన తర్వాత భర్తల వద్దకు కాపురానికి కన్న తండ్రి పంపటంలేదని స్వయంగా అల్లుళ్లు దీక్షలకు దిగారు. కాపురానికి పంపమంటే న్యాయవాది అయిన మామ తమపై తిరిగి కేసులుపెడుతున్నాడని వారు వాపోతున్నారు. దీంతో ఈ వ్యవహారం ఏలూరు జిల్లాలోనే కాదు.. టోటల్ ఏపీలో కూడా హాట్ టాపిక్‌గా మారింది. తనకున్న ఇద్దరి కుమార్తెల వ్యవహారంలో ఆ మామ ప్రవర్తన.. హింసించిన తీరుతో విసిగిపోయిన ఇద్దరు అల్లుళ్ళు చివరికి తమకు న్యాయం చేయాలని టెంటూ వేసి నిరాహార దీక్షకు కూర్చున్నారు.
ఏలూరుకు చెందిన శ్రీనివాస రామానుజ అయ్యంగార్ అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురికి పవన్ అనే వ్యక్తితో 2015 వివాహం జరిగింది. వీరికి ఓ బిడ్డ కూడా ఉంది. అయితే పెళ్లి చేసిన రెండేళ్లకు పెద్ద కూతురిని శ్రీనివాస రామానుజ అయ్యంగార్ ఇంటికి తీసుకువచ్చేశారు. అప్పటి నుంచి పెద్ద కుమార్తెను భర్త వద్దకు కాపురానికి పంపలేదు. ఇదిలా ఉంటే తన రెండో కుమార్తెకు ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయవాడకు చెందిన శేషసాయి అనే వ్యక్తితో పెళ్లి చేశాడు శ్రీనివాస రామానుజ అయ్యంగార్.. అయితే రెండో కుమార్తె విషయంలోనూ రామానుజ అయ్యంగార్ తీరు మారలేదు. రెండో కుమార్తెకు వివాహం జరిగిన కొన్ని రోజులకే ఆమెను కూడా పుట్టింటికి తీసుకువచ్చేశారు. దాంతో ఇద్దరి అల్లుళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.. తమ భార్యలను కాపురానికి పంపాలంటూ అల్లుళ్లు ఇద్దరూ మామను ఎంత కోరినా రామానుజ అయ్యంగార్ పట్టించుకోలేదు.. తీరా తిరిగి అల్లుళ్ళపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని, తమ మామకు పోలీసులతో మంచి సంబంధాలు ఉన్నాయని, అందుకే తమకు న్యాయం జరగడం లేదని ఇద్దరు అల్లుళ్ళు ఆరోపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్‌ను కలిసి ఇద్దరు అల్లుళ్లు తమ గోడు వెళ్లబోసుకున్నారు. కూతుర్లను కాపురానికి పంపించకుండా తమ మామ శ్రీనివాస రామానుజ అయ్యంగార్ వేధిస్తున్నారని.. తప్పుడు కేసులు పెట్టారంటూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. తమపై పెట్టిన కేసులు రద్దు చేయాలని.. తమ మామ మీద చర్యలు తీసుకోవాలంటూ ఏలూరు కలెక్టర్‌కు వినతి పత్రం కూడా అందించారు. అయితే తమ విజ్ఞప్తిపై అధికారులలో ఎలాంటి స్పందన లేదని ఇద్దరు అల్లుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఏలూరు కలెక్టరేట్ ముందు టెంటు వేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతూ ఇద్దరు అల్లుళ్ళు రిలే నిరాహార దీక్షలకు దిగారు.
అల్లుళ్ల మాట ఇలా ఉంటే.. మరోవైపు ఇద్దరు అల్లుళ్లు తన కుమార్తెలను వేధిస్తున్నారని అయ్యంగార్ చెబుతున్నారు. ఈ విషయంలో నిజమైన బాధితులు అయ్యంగార్ కుమార్తెలు మాత్రం మీడియా ముందుకు రాలేదు. మొత్తంగా అల్లుళ్ల రిలే దీక్షలు హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..