Vishakhapatnam: ఆశలు ఆవిరి.. “విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదు”.. తేల్చి చెప్పేసిన కేంద్రం

|

Sep 28, 2022 | 7:11 AM

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో..

Vishakhapatnam: ఆశలు ఆవిరి.. విశాఖ రైల్వే జోన్ సాధ్యం కాదు.. తేల్చి చెప్పేసిన కేంద్రం
Vizag Railway Station
Follow us on

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ విషయంపై స్పష్టతనిచ్చారు. కొత్త జోన్‌ ఏర్పాటు లాభదాయకం కాదని చెప్పడం కొసమెరుపు. లాభాలు వస్తే ఏ చట్టంతోనూ అవసరం లేకుండా జోన్ ను రైల్వే శాఖ ఏర్పాటు చేసేదని వివరించారు. ఈ విషయాన్ని కేబినెట్‌ ముందుకు తీసుకువెళ్తానని, ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని ఆయన సూచించారు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ ఏర్పాటు చేస్తున్నట్లు 2019 లో రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన చేశారు. దీనికి దక్షిణ కోస్తా జోన్‌గా పేరు పెట్టారు. విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కొత్త జోన్‌ పరిధిలో ఉండేలా డీపీఆర్ సిద్ధం చేశారు. వాల్తేరు డివిజన్‌ను విజయవాడ డివిజన్‌లో కలిపారు. అప్పటి నుంచి తర్వాతి నిర్ణయం కోసం రైల్వే అధికారులు ఎదురు చూస్తున్నారు. ఈ ప్రక్రియ త్వరలో మొదలవుతుందని అందరూ ఎదురు చూస్తున్న సమయంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయలేమని రైల్వే బోర్డు చెప్పడం రాష్ట్ర ప్రజల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

కాగా.. రాష్ట్రం విడిపోయిన తర్వాత విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేసినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ గతంలో తెలిపారు. జోన్‌ ఏర్పాటుకు నిధులు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. వైసీపీ సభ్యులు విజయసాయిరెడ్డి ఆడిగిన ప్రశ్నకు రైల్వే మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో భాగంగా విశాఖ కేంద్రంగా ప్రకటించిన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటును వేగవంతం చేయాలని విజయసాయిరెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు లేదని, దీంతో ఉద్యోగార్ధులు రైల్వే పరీక్షల కోసం పక్క రాష్ట్రంలోని సికింద్రాబాద్ కు వెళ్లాల్సి వస్తుందని చెప్పారు.

మరోవైపు.. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు ఎలాంటి నిర్దుష్టమైన కాలవ్యవధి లేదని రైల్వే బోర్డు గతంలో చెప్పిన విషయం తెలిసిందే. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ప్రణాళికలు, ముందస్తు కార్యాచరణ కోసం ప్రత్యేకంగా ఓ అధికారిని ఇప్పటికే నియమించినట్లు, విశాఖ రైల్వే స్టేషన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. సౌత్ కోస్టల్ రైల్వే జోన్, రాయగడ డివిజన్ ఏర్పాటు కోసం డీపీఆర్​ల రూపకల్పన ఇంకా అధ్యయనంలో ఉన్నట్టు వెల్లడించింది. కాగా.. ముందు నుంచి రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పి, ఇప్పుడు రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కుండబద్ధలు కొట్టడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం చూడండి..