ఆమె పేరు షేక్ మల్లిక… గుంటూరులో నివాసం ఉండే మల్లిక సొంతూరు పెదకాకాని మండలం నంబూరు.. పదేళ్ళ క్రితం అదే గ్రామానికే చెందిన అక్బర్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరూ సంతానం. ఆ తర్వాత గ్రామానికే చెందిన ప్రేమ్ కుమార్‌తో మల్లిక వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం అక్బర్‌కు తెలియడంతో అతనితో విడాకులు తీసుకొని పిల్లలను వదిలేసి ప్రేమ్ కుమార్‌తో గుంటూరు వచ్చేసింది. ప్రేమ్ కుమార్‌ను వివాహం చేసుకొని గుంటూరులో కాపురం పెట్టింది. కొద్దీ రోజుల తర్వాత బంగారు షాపు యజమాని రెహమాన్‌తో పరిచయం అయింది. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలోనే రెహమాన్ మల్లికా కోరిక మేరకు ఐదు లక్షలు ఖర్చుపెట్టి ఒక పాపను దత్తత తీసుకొని ఆమెకు ఇచ్చాడు.
కొద్దీ కాలం తర్వాత మల్లిక, ప్రేమ్ కుమార్ గుంటూరు నుండి నంబూరూకు మకాం మార్చారు. అయితే అక్కడ మల్లిక మరొక వ్యక్తితో సంబంధం పెట్టుకొని రెహమాన్‌ను దూరం పెట్టడం ప్రారంభించింది. మల్లికా దూరం పెట్టడాన్ని రెహమాన్ జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ఆమెను వశం చేసుకునేందుకు వశీకరణ విద్య తెలిసిన వారికి కోసం రెహమాన్ గాలించాడు.
ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన జనాబ్ అహ్మద్‌కు వశీకరణ విద్యలో పట్టుందని రెహమాన్‌కు తెలిసింది. దీంతో అతనికి మూడు లక్షల రూపాయల డబ్బులిచ్చి గుంటూరు పిలిపించాడు. గత రెండు నెలల నుండి అహ్మద్ వశీకరణ పేరుతో క్షుద్ర పూజలు చేయడం మొదలు పెట్టాడు. మల్లికా జుట్టు, బట్టలు సేకరించి అహ్మద్‌కు ఇచ్చారు. రెండు మట్టి బొమ్మలు చేసిన అహ్మద్ వాటిపై మల్లిక జుట్టు, బట్టలుంచి తుమ్మ ముల్లు గుచ్చి ఏదేదో పూజలు చేశాడు. అయితే రెండు నెలలు గడిచినా మల్లిక ప్రవర్తనలో ఎటువంటి మార్పు రాలేదు. మల్లికా ఇంకా తనకు దక్కదని నిర్ణయించుకున్న రెహమాన్ ఆమెను చంపేయాలనుకున్నాడు. ఇందు కోసం తన స్నేహితులైన స్వప్న, రసూల్ సాయం తీసుకున్నాడు. నాలుగు రోజుల క్రితం స్వప్న బైక్‌పై ముసుగులు ధరించిన రెహమాన్, రసూలు మల్లికా ఇంటికి వచ్చారు. మల్లికా ఇంటిలో ఒక్కతే ఉండటంతో ఆమె గొంతు నులిమి చంపేశారు. ఆ తర్వాత వచ్చిన దారినే వెళ్ళిపోయారు. మల్లికా మృతిపై హత్య కేసు నమోదు చేసిన పెదకాకాని సీఐ నారాయణ స్వామి దర్యాప్తులో వెలుగు చూసిన ఆధారాలతో నలుగురిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి