Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకానికి బాలిక మృతి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2024 | 9:03 PM

నమ్మించాడు.. మాట్లాడుదామని పిలిచాడు.. తీరా వస్తే అడవిలోకి తీసుకెళ్లాడు. అంతటితో ఆగలేదు చచ్చేదాకా కొట్టాడు.. ఆ తర్వాత ఆమె చావడానికి నిప్పంటించాడు. ప్రేమ పేరుతో మైనర్ బాలికను పిలిచి దారుణంగా కొట్టి.. ఆమెకు నిప్పంటించి.. తిరిగిరాని లోకాలకు పంపించిన ఓ ఆగంతుకుడి క్రూరత్వం.. సంచలనంగా మారింది..

Andhra Pradesh: ప్రేమోన్మాది ఘాతుకానికి బాలిక మృతి.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
Crime News
Follow us on

కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని పట్టణంలో జరిగిన ఓ దుర్ఘటన అందర్నీ కలచివేసింది.. ఇది రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.. ప్రేమించిన అమ్మాయిని మాట్లాడదామని పిలిచి.. అడవిలోకి తీసుకువెళ్లి ఒంటికి నిప్పంటించాడు దుర్మార్గుడు.. పూర్తి వివరాలలోకి వెళితే.. శనివారం ఉదయం ఏడు గంటలకు బద్వేల్ లోని ఓ ప్రైవేటు కళాశాలకు బయలుదేరింది బాధిత మైనర్ బాలిక (16).. ఇంతలో ఆమెకి ఒక కాల్ వచ్చింది. మనిద్దరం కలుద్దాము.. నీతో మాట్లాడాలని ఫోన్ చేశాడు విగ్నేష్ అనే ఆగంతకుడు.. దీంతో తెలిసిన వ్యక్తే కదా.. గతంలో ప్రేమించిన అబ్బాయే.. అనుకుంటూ వెళ్ళింది ఆ బాలిక.. అదే తనకి శాపంగా మారింది.. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయింది.

విఘ్నేష్ మాట్లాడదామని పిలిచి.. బాలికను ఆటోలో ఎక్కించుకొని బద్వేలు శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు.. ఇద్దరూ సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమకు ఎదురుగా ఉన్న అటవీ ప్రాంతంలోనికి వెళ్లారు. ఇంతవరకు బాగానే ఉంది.. మాట్లాడుకొని గొడవపడి బయటకు వచ్చేస్తే బాగుండేదేమో కానీ.. అతను మాత్రం పక్కా ప్లాన్ ప్రకారమే ఆమెను తీసుకెళ్లాడు..వెళుతూ వెళుతూ తనతో పాటు పెట్రోల్ కూడా తీసుకువెళ్లాడు. ఏది ఏమైనా ఆ మైనర్ బాలికను చంపాలనే ఉద్దేశంతోనే అక్కడకు తీసుకు వెళ్లినట్టు తెలుస్తోంది..

వాస్తవానికి.. విగ్నేష్ అనే వ్యక్తికి గతంలోనే వివాహం అయింది. అది కూడా ప్రేమ వివాహమే.. అయితే, ఆమెతో సంసారం చేస్తూనే ఈ మైనర్ బాలికతో పరిచయాన్ని కొనసాగిస్తున్నాడు. పెళ్లైన విషయం తెలిసిన మైనర్ బాలిక విఘ్నేష్ ను వదిలేసింది. కానీ, మనసులో ఏదో పెట్టుకున్న విగ్నేష్ తనతో మాట్లాడాలి.. రమ్మని పిలిచి అడవి ప్రాంతంలోనికి తీసుకువెళ్లి నిలువునా తనపై పెట్రోల్ పోసి నిప్పంటించి ఆ బాలిక మృతికి కారణమయ్యాడు. కనీసం ఆమెను కాపాడే ప్రయత్నం కూడా చేయలేదు. నిప్పంటించి అక్కడ నుంచి పరారయ్యాడు.. మంటలలో కాలుకుంటూ అటవీ ప్రాంతంలో నుంచి బోరున ఏడుస్తూ.. అరుస్తూ కాపాడండి అంటూ మైనర్ బాలిక రోడ్డుపైకి పరిగెత్తుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందిచారు.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను వెంటనే బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 80% ఒంటినిండా కాలిన గాయాలతో ఉన్న ఆ బాలిక ప్రాణాలతో పోరాడి.. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల 40 నిమిషాలకు తుది శ్వాస విడిచింది.

అయితే, నిందితుడి కోసం నాలుగు బృందాలుగా ఏర్పడిన పోలీసులు గాలించి అతడిని శనివారం సాయంత్రమే పట్టుకున్నట్టు తెలుస్తుంది. సీన్ రీ కన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని జిల్లా ఎస్పీ సమక్షంలో సంఘటనా స్థలానికి తీసుకు వెళ్లినట్టు సమాచారం.. ఇదే విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అలాగే హోం మంత్రి కూడా స్పందించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని ప్రకటించారు. నిందితుడిని వదిలే ప్రసక్తే లేదని ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది అనేదానిపై కూడా విచారణ చేపడతామని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు.

ఇదే అంశంపై మైనర్ బాలిక కు సంబంధించిన కుల సంఘం నేతలు నిరసన వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని.. అలాగే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..