Andhra Pradesh: కోర్టునే మోసం చేయాలనుకున్నాడు.. కట్‌చేస్తే.. జడ్జి గుర్తుపట్టడంతో ముచ్చెమటలు.. చివరకు..

| Edited By: Shaik Madar Saheb

Oct 20, 2024 | 3:37 PM

మామూలోడు.. కాదు.. అతను ఓ కేసులో నిందితుడు. అయినా.. కోర్టుకు హాజరవ్వకుండా విదేశాలకు వెళ్లాడు.. అతని ప్లేసులో మరో వ్యక్తిని కోర్టుకు పంపించాడు.. ఇలా కోర్టునే మోసం చేయాలని అడ్డంగా దొరికిపోయాడు ఓ నిందితుడు.. అయితే.. నిందితుడి ప్లేసులో హాజరైన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేశారు.

Andhra Pradesh: కోర్టునే మోసం చేయాలనుకున్నాడు.. కట్‌చేస్తే.. జడ్జి గుర్తుపట్టడంతో ముచ్చెమటలు.. చివరకు..
Guntur District Court
Follow us on

అది అమరావతి రాజధానిలోని ఉద్దండ్రాయిని పాలెం గ్రామం.. 2020 డిసెంబర్‌లో గ్రామంలోని అప్పటి ఎంపి నందిగాం సురేష్ సోదరుడు వెంకట్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. వెంకట్ ఫిర్యాదుతో పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. మొత్తం 21 మందిపై అట్రాసిటీ కేసు నమోదు చేయడమే కాకుండా విచారణ పూర్తి చేసి అప్పటి డిఎస్పీ పోతురాజు ఛార్జి షీట్ కూడా వేశారు. అప్పటి నుండి కేసు గుంటూరు ప్రత్యేక స్థానంలో విచారణ జరుగుతుంది. అయితే కేసులో ముఖ్యమైన నిందితుల్లో ఒకరు జొన్నలగడ్డ వెంకటేశ్వరావు అలియాస్ బాబు.. గతంలో కోర్టుకు హాజరయ్యారు. అయితే ఈ మధ్య కాలంలో ఆయన అమెరికా వెళ్లాల్సి వచ్చింది. అతనిపై కేసు ఉండటంతో కోర్టు అనుమతితోనే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇదంతా ఎందుకు అనుకొని ఆయన ఎటువంటి అనుమతి లేకుండానే అమెరికా వెళ్లారు. ఆయన అక్కడ ఉన్న సమయంలోనే కోర్టులో కేసును విచారణకు వచ్చింది. విచారణకు నిందితులు హాజరు కావాల్సి ఉంది. మొత్తం 21 మంది ఉండటంతో వెంకటేశ్వరావు తన స్థానంలో మరొకరిని కోర్టు విచారణకు పంపించారు. అయితే ఈ విషయాన్ని స్థానికంగా ఉన్న కొంతమంది జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు గురించి పసిగట్ట లేకపోవడంతో నిన్న యధావిధిగా కేసు విచారణకు వెంకటేశ్వరావు స్థానంలో కోర్టులో కోడె సునీల్ హాజరయ్యాడు.

అయితే, ఈ సమాచారం ముందస్తుగా అందుకున్న ప్రత్యేక న్యాయస్తానం జడ్జి శరత్ బాబు నిందితుల్లో సునీల్ ఉండటాన్ని గమనించి ప్రశ్నించడం జరిగింది. నిందితుల్లో అతని పేరు లేకపోయిన ఎందుకు కోర్టు వచ్చావంటూ జడ్జి ప్రశ్నించడంతో సునీల్ కంగారు పడ్డాడు. ఈ క్రమంలోనే.. వెంకటేశ్వరావు స్థానంలో తాను కోర్టుకు హాజరైనట్లు సునీల్ చెప్పాడు. వెంటనే జడ్జి ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు నమోదు చేయాలంటూ స్థానిక పోలీసులను ఆదేశించారు. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి సునీల్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ ప్రారంభించారు.

నిందితుడు స్థానంలో మరొకరు హాజరవ్వడం నేరమని అటు న్యాయస్థానం, ఇటు పోలీసులు పేర్కొంటున్నారు. కాగా.. ఇలా నిందితుడు స్థానంలో మరొకరు హాజరవ్వడం కలకలం రేపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..