విజయనగరం జిల్లాలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న ఆశావహులకు కంటి మీద కునుకు ఉండటం లేదు. సర్వేల మీద సర్వేలు, సమీకరణాల పైన సమీకరణాలు అసలేం జరుగుతుందో తెలియక అయోమయంలో పడుతున్నారు ఇన్చార్జిలు. ఇప్పటికే జనసేన పొత్తుతో భాగంగా ఎవరికి ఎసురొస్తుందో తెలియక ఆందోళనలో ఉంటే, ఇప్పుడు సర్వేలు, ఐవిఆర్ఎస్ సర్వేలతో మరింత టెన్షన్ పడుతున్నారు నేతలు. అందులో భాగంగా ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో వస్తున్న ఐవిఆర్ఎస్ కాల్స్ సర్వే అటు ఇన్చార్జిల్లో, ఇటు ఆశావహుల్లో గుబులురేపుతుంది. టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వాయిస్ తో మీ ప్రాంతంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరైతే బాగుంటుంది అని వస్తున్న ఫోన్ కాల్స్ ఆ పార్టీలో ఒకింత అలజడి రేపాయి. దశాబ్దాలుగా నియోజకవర్గానికి పరిమితమై కార్యకర్తలతో సత్సంబంధాలు నెరుపుతున్న ప్రస్తుత ఇంచార్జిలకి సైతం ఈ సర్వే కాల్స్ దడ పుట్టిస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల జరిగిన కురుపాం, సాలూరు, విజయనగరం, నెల్లిమర్ల, ఎస్ కోట నియోజకవర్గాల్లో జరిగిన ఐవిఆర్ ఎస్ కాల్స్ సర్వే సాధారణ ఎన్నికలను తలపించేలా మారింది. కురుపాంలో జరిగిన ఐవిఆర్ ఎస్ సర్వేలో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న తోయక జగదీశ్వరి పేరు లేకుండానే కొత్తగా మరో ఐదుగురు పేర్లతో సర్వే కాల్స్ రావటం అందరినీ ఆశ్చర్యానికి గు. దీంతో కురుపాం ఇన్చార్జి జగదీశ్వరి తన పరిస్థితి ఏంటో తెలియక అయోమయంలో ఆందోళనలో పడ్డారట. తమకే సీటు దక్కుతుందని లక్షల రూపాయల అప్పు చేసి మరీ రాజకీయాలు చేస్తే ఇలా జరుగుతుంది ఏంటి అని మధనపడ్డారట.
ఇక మరో నియోజకవర్గం సాలూరు. ఇక్కడ ప్రస్తుత ఇంచార్జిగా ఉన్న గుమ్మడి సంధ్యారాణి తో పాటు నియోజకవర్గానికి సంబంధం లేని మరో మహిళ పేరును కూడా సర్వేలో జరిపారంట. ఆ కాల్స్ నియోజకవర్గంలో ఉన్న పార్టీ శ్రేణులకు, ఇతర కేడర్ కి రావడంతో చర్చకు దారి తీసిందట. సంధ్యారాణి ప్రస్తుతం రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యురాలిగా ఉండటంతో పాటు 2009 నుండి నియోజకవర్గంలోనే ఉంటూ రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయి మరీ రాజకీయాలు చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా మరో మహిళను తెరపైకి తీసుకురావటం, ఇద్దరిలో ఒకరికి ఓటేయాలంటూ క్యాడర్ ను కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం పార్టీ హార్డ్ కోర్ క్యాడర్ ఒకింత అసహనానికి గురయ్యారట. ఇక చీపురుపల్లి నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షుడు కిమిడి నాగార్జున ఇన్చార్జిగా ఉండగా ఇక్కడ నాగార్జున తో పాటు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా ఐవీఆర్ఎస్ కాల్ సర్వే చేయడం చేసింది పార్టీ అధిష్టానం. దీంతో ఇక్కడ కేడర్ కూడా ఏమి జరుగుతుందో తెలియక డైలమాలో పడ్డారట. ఇక ఎస్ కోటలో కూడా ప్రస్తుత ఇంచార్జ్ లలిత, ఎన్ఆర్ఐ గొంప కృష్ణ పేర్లు సర్వే చేశారు. ఇక్కడ ఐవిఆర్ ఎస్ సర్వేలో తమ పేరే బలపరచాలని గొంప కృష్ణ ఒక వీడియోని కూడా విడుదల చేయటం మరింత ఆసక్తిని రేపింది.
ప్రస్తుతం పార్టీ చేస్తున్న ఐవిఆర్ ఎస్ సర్వేలో తమనే బలపరచాలని అటు ఇన్చార్జిల్లో, ఇటు ఆశావహుల్లో మరో జనరల్ ఎలక్షన్స్ తలపించేలా మారింది. పోటీపడి మరి తమకే మద్దతు ఇవ్వాలని ప్రచారం చేసుకోవడం చూస్తుంటే ఆశ్చర్యానికి గురవ్వక తప్పదనే చెప్పాలి. అభ్యర్థులకు ఎన్నికల వేళ అందరినీ సమన్వయపరచుకొని రాజకీయాలు చేసుకోవటం ఒక లెక్కైతే, సర్వేలతో పాటు అధిష్టానంను మెప్పించడం మరో లెక్కవుతుందని నేతలు కుమిలిపోతున్నారు. మరోవైపు ఇన్చార్జిలను మార్చి, తామే టికెట్లు దక్కించుకునేందుకు ఆశావహులు పడుతున్న పాటలు పాట్లు కూడా అన్ని ఇన్ని కాదు. ఏదైనా అటు సర్వేలు, ఇటు ఆశావహుల వెన్నుపోట్లు, అధిష్టానంను సంతృప్తి పరచడం, మరో వైపు ప్రత్యర్థి పార్టీల ఎత్తులు… ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక విధాల నలిగిపోవాల్సి వస్తుందని తమ అనుచరుల వద్ద బయటపడి ఒకింత అసహనానికి గురవుతున్నారు ఇంచార్జిలు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…