AP News: వెయ్యేళ్ల నాటి విగ్రహం.. బయటపడిన సంచలన నిజాలు

| Edited By: Velpula Bharath Rao

Oct 20, 2024 | 3:33 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడులో వెయ్యేళ్ల నాటి విగ్రహం ఒకటి బయటపడింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని బుగ్గవాగు రిజర్వాయర్ ప్రాంతంలో వీరగల్లు శిల్పం ఒకటి బయటపడింది. విగ్రహం కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో డోలు, చెవులకు పెద్ద కుండలాలు, మెడలో రుద్రాక్షలు ఉండి శత్రువుతో పోరాడుతున్నట్లు ఉందని స్థానికులు చెబుతున్నారు.

AP News: వెయ్యేళ్ల నాటి విగ్రహం.. బయటపడిన సంచలన నిజాలు
Historic Momuments
Follow us on

పల్నాడులో తరుచుగా చారిత్రిక ఆనవాళ్లు బయటపడుతున్నాయి. రాతి యుగం నాటి సమాధులు వెలుగు చూసిన కొద్దీ కాలానికే వెయ్యేళ్ల నాటి విగ్రహం ఒకటి బయటపడింది. స్థానిక చరిత్రకారులు సతీష్, రమేష్ విగ్రహాన్ని పరిశీలించి దాన్ని భద్రపరచాలని స్థానికులకు సూచించారు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలంలోని బుగ్గవాగు రిజర్వాయర్ ప్రాంతంలో శిల్పం ఏదో ఉందని స్థానికులు సతీష్ బాబుకు సమాచారం అందించారు. వెంటనే సతీష్ బాబు రాతి శిల్పం వద్దకు మిత్రుడు రమేష్, కిరణ్‌లతో కలిసి వెళ్లారు. రాతి విగ్రహాన్ని పరిశీలించి దాన్ని వీరగల్లు విగ్రహంగా తేల్చారు. విగ్రహం కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో డోలు, చెవులకు పెద్ద కుండలాలు, మెడలో రుద్రాక్షలు ఉండి శత్రువుతో పోరాడుతున్నట్లు ఉందని సతీష్ బాబు తెలిపారు.

పూర్వ కాలంలో దోపిడిదారుల నుండి,క్రూర మృగాల నుండి గ్రామాలను రక్షించే సమయంలో వీరోచితంగా పోరాడి చనిపోయిన వారి స్మృతి చిహ్నంగా విగ్రహాలను చెక్కి ప్రతిష్టించేవారిని ఆయన తెలిపారు. ఈ విగ్రహాం వెయ్యేళ్లనాటిదన్నారు. ఇటువంటి విగ్రహాలను అందరికి కనిపించేలా చెరువులు, బావులు, గ్రామ పొలిమేరలు, దేవాలయాల వద్ద ప్రతిష్టించేవారని చెప్పారు. ఇలా ప్రతిష్టించే విగ్రహాలనే వీరగల్లు శిల్పాలంటారని పేర్కొన్నారు. శిథిలావస్థలో ఉన్న విగ్రహాన్ని కాపాడుకోవాలని ఆయన స్థానికులకు సూచించారు. చారిత్రిక నేపథ్యం ఉన్న శిల్పాలను పరిరక్షించుకోవటానికి స్థానికులు నడుం కట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి విగ్రహాల ద్వారా ఆయా గ్రామాల చరిత్ర, పూర్వ వైభవం, పాలన కాలం వంటి అంశాలు తెలుస్తాయని సతీష్ బాబు చెప్పుకొచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..