వర్షాకాలం ప్రారంభమైంది. దోమల దండ యాత్ర మొదలైంది. దోమల వ్యాప్తితో మొదలయ్యే అనేక రోగాలు పట్టణ, పల్లె ప్రాంతాలను గడగడలాడిస్తన్నాయి. డెంగ్యూ, మలేరియా వ్యాధులతో మంచం పట్టే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే స్థానిక సంస్థల అధికారులు, సిబ్బంది దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
అయితే అన్ని రంగాల్లోకి అడుగుపెడుతున్న అధునాతన యంత్రం.. డ్రోన్. ప్రస్తుతం వ్యవసాయం, రక్షణ, లాజిస్టిక్స్ రంగాల్లో డ్రోన్ల వినియోగం పెరిగిపోతుంటే మరొకవైపు సరికొత్త రంగాల్లో వీటి వినయోగంపై ప్రయోగాలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల్లోని సిబ్బంది దోమల బెడద తొలగించుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కొంటున్నారు. ఇందులో భాగంగానే తెనాలి మున్సిపాలిటిలో దోమల మందు పిచికారికి డ్రోన్లు వినియోగిస్తున్నారు.
సైడ్ కాల్వలు, మురికి గుంటల వద్ద ఫైరోసిన్ ఆయిల్, బిటీఐ ద్రావణాన్ని తెనాలి మున్సిపాలిటీలో పిచికారీ చేయిస్తున్నారు. మరోవైపు ఖాళీ స్థలాల సంఖ్య ఎక్కువుగా ఉన్నాయి. వాటిల్లో చెట్లు, చేమ పెరిగిపోయి దోమల మందు చల్లడానికి ఇబ్బందిగా ఉంది. దీంతో తెనాలి కమీషనర్ బండి శేషన్న డ్రోన్‌ను ఉపయోగించాలని నిర్ణయించారు. హైదరాబాద్ నుండి డ్రోన్ నిర్వాహకుడిని పిలిపించి ముందుగా పదిహేను ఎకరాల్లో డ్రోన్ సాయంతో బిటిఐ ద్రావణాన్ని చల్లించారు. కొద్దీ రోజుల తర్వాత అక్కడ దోమల లార్వాలు తగ్గుముఖం పట్టినట్లు గుర్తించారు. వర్షాలు కురిసి ఖాళీ స్థలాల్లో మురికి నిలిచినప్పుడు దోమల బెడద తగ్గించడానికి డ్రోన్ ఎంతగానో ఉపయోగపడుతున్నట్లు తేల్చారు.
తెనాలి మున్సిపాలిటీలో విజయవంతంగా డ్రోన్ ప్రయోగించడంతో మంగళగిరి మున్సిపాలిటీలోనూ డ్రోన్ ను దోమల మందు పిచికారీ చేయించడానికి ఉపయోగిస్తున్నారు. మంగళగిరి మున్సిపల్ కమీషనర్ అలీమ్ బాషా టిడ్కో గ్రుహ సముదాయం వద్ద దోమల మందు చల్లించారు. అదే విధంగా తాడేపల్లి పరిధిలోని మురుగు కాల్వలు, రాజీవ్ గ్రుహకల్ప వద్ద నుండి డ్రోన్ తో దోమల నివారణ మందు చల్లించేందుకు సిద్దమయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..