AP News: నగదును తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన రైతులు… అసలేం జరిగిందంటే…

| Edited By: Velpula Bharath Rao

Oct 18, 2024 | 6:23 PM

రైతులకు తెలియకుండానే వారి ఖాతాల్లో ప్రభుత్వం నగదు జమ చేసింది. తిరిగి ప్రభుత్వానికి రైతులు ఆ నగదును చెల్లించారు. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు ఏం జరిగింది? అనేది మీరే చూడండి..

AP News: నగదును  తిరిగి ప్రభుత్వానికి చెల్లించిన రైతులు... అసలేం జరిగిందంటే...
Farmers Who Returned Money
Follow us on

గత నెలలో కురిసిన భారీ వర్షాలకు గుంటూరు జిల్లాలో పంట నష్టం జరిగింది. పలు ప్రాంతాల్లో పంటలు వరద నీటిలో మునిగిపోయి రైతులు నష్టపోయారు. దీంతో ప్రభుత్వం నష్టపరిహారం అంచనా వేసి రైతులను ఆదుకునేందుకు ఏ పంటకు ఎంత మేర చెల్లిస్తుందో ప్రకటించింది. ఆ తర్వాత కొద్దీ కాలానికే రైతులకు నష్టపరిహారం అందింది. అయితే దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. మేడికొండూరు మండలంలో పెద్ద ఎత్తున నష్టపరిహారంలో అవకతవకలు జరిగాయంటూ విమర్శలు రావడంతో తాడికొండ ఎమ్మల్యే శ్రావణ్ కుమార్ విచారణ చేయాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే వరద నీరు రాకుండానే వచ్చినట్లు అంచనా వేసి లక్షలాది రూపాయలను అధికారులు దారి మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.

మేడికొండూరు మండలంలో 104 మంది రైతులకు రూ.18 లక్షలు నష్టపరిహారం చెల్లించినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. అయితే వ్యవసాయ శాఖాధికారులు రంగంలోకి దిగడంతోనే రైతులు తమ ఖాతాల్లో డబ్బులు ఎందుకు పడ్డాయో తెలియదంటూ వాటిని తిరిగి ఇచ్చేందుకు సిద్దమయ్యారు. ఇందుకు యలవర్తి పాడు ఎంపీఈవో బాధ్యత వహిస్తూ 4.25 లక్షల రూపాయలను ఇప్పటికే తిరిగి ప్రభుత్వానికి చెల్లించారు. దీంతో రూ.6.39 లక్షల నగదును తిరిగి ప్రభుత్వానికి జమ అయ్యాయి. అయితే ఈ తరహా మోసాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని రైతులు, రైతు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. వరదల కారణంగా నష్టపోయిన వారిని ఆదుకోవాలని ప్రభుత్వం భావిస్తే వాటిల్లో చేతివాటం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి