AP News: మరోసారి రెచ్చిపోయిన ఏనుగులు.. రైతును వేటాడి వెంటాడి చంపిన గజరాజులు

| Edited By: Ravi Kiran

Oct 26, 2024 | 9:23 PM

పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లాలో ఏనుగుల గుంపు స్వైర విహారం చూసి జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత ఐదేళ్లుగా ఏనుగులు గుంపు దాడిలో ఇప్పటివరకు పదకొండు మంది వరకు మృత్యువాత పడగా, సుమారు నలభై మంది వరకు గాయాల పాలయ్యారు.

AP News: మరోసారి రెచ్చిపోయిన ఏనుగులు.. రైతును వేటాడి వెంటాడి చంపిన గజరాజులు
Elephants Attack On Farmer
Follow us on

పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు మరోసారి భీభత్సం సృష్టించింది. పార్వతీపురం రూరల్ మండలం పెద్ద బొండపల్లిలో పట్టపగలే ఏనుగులు గుంపు పొలంలో పనిచేస్తున్న రైతుల పై దాడికి తెగబడింది. ఏనుగుల గుంపును గమనించిన రైతులు భయాందోళనలతో పరుగులు తీశారు. అయినా వెనక్కి తగ్గని ఏనుగులు గుంపు రైతులను వెంబడించింది. అయితే ఏనుగుల గుంపు మెరుపు వేగంతో నడుస్తూ దేవాభత్తుల యాకోబు అనే రైతు పై దాడి చేసింది. ఏనుగుల గుంపు నుండి తప్పించుకునేందుకు యాకోబు తీవ్ర ప్రయత్నం చేశాడు. అయినా సరే ఏనుగు యాకోబును పట్టుకొని తన తొండంతో పదేపదే నేలకేసి కొట్టి, తరువాత తొక్కి తీవ్రంగా గాయపరిచింది. అనంతరం పరిస్థితి గమనించిన గ్రామస్తులు పెద్ద పెద్ద శబ్దాలు చేయటంతో ఏనుగులు గుంపు వెనుతిరిగింది.

అప్పటికే రైతు యాకోబు తీవ్ర గాయాలు పాలై అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే రైతులు గాయపడిన యాకోబును పార్వతీపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. అయినా ప్రయోజనం దక్కలేదు. చివరికి తీవ్ర గాయాలతో యాకోబు మృత్యువాత పడ్డాడు. వందలాది ఎకరాల్లో పంటలు ధ్వంసం అయ్యాయి. స్థానిక రైతుల ఆస్తులు పెద్దఎత్తున దెబ్బతున్నాయి. అనేక పశువులు ఏనుగుల దాడిలో మరణించాయి. ఏనుగుల గుంపు ఎటు వైపు నుండి వచ్చి ఎవరిపై దాడి చేస్తుందో తెలియని భయానక వాతావరణం జిల్లాలో నెలకొంది. కుంకీ ఏనుగుల సహాయంతో ఏనుగుల గుంపును తరలించాలని ఇప్పటికే పవన్ కళ్యాణ్ ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు రైతు యాకోబు మృతి అందరినీ కలచివేసింది. ఇప్పటికైనా త్వరితగతిన ఏనుగుల గుంపును జిల్లా నుండి తరలించాలని జిల్లా వాసులు కోరుతున్నారు.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి