మన రోడ్లపై వాహనాలు ప్రమాదానికి గురవడం తరుచూ చూస్తుంటాం. ప్రమాదంలో గాయపడిన వారిని సకాలంలో ఆసుపత్రికి తరలించలేకపోవడంతో అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం 108 సర్వీసులను పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. అయినప్పటికీ ఈ ప్రమాదాలు జరిగినప్పుడు సకాలంలో బాధితులను ఆసుపత్రులకు తీసుకెళ్లలేకపోవడంతో ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి. ముఖ్యంగా పల్లెటూర్ల సమీపంలో జరిగిన ప్రమాదాల సమయంలో ఈ జాప్యం మరీ ఎక్కువగా ఉంటుంది.
ఇటువంటి పరిస్థితుల్లోనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. గతంలో బైక్ అంబులెన్స్‌లను కొండప్రాంతాల్లో ప్రభుత్వమే ప్రారంభించింది. సరైన రోడ్డు మార్గంలేని కొండ కోనల్లో రోగులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించడమే లక్ష్యంగా ఈబైక్ అంబులెన్స్‌లు తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ ఈ బైక్ అంబులెన్స్‌లు వచ్చాయి. దీర్ఘాయుష్మాన్ భవ ట్రస్ట్ ఆధ్వర్యంలో బైట్ అంబులెన్స్‌ను పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రారంభించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రథమ చికిత్స అవసరం ఎంతో ఉందని సరైన సమయంలో ప్రధమ చికిత్స అందిస్తే రోగులను ప్రాణాలు కాపాడవచ్చాని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బైక్ అంబులెన్స్‌పై డాక్టర్, నర్స్ ఇద్దరూ ఘటనా స్థలానికి వెళ్లి ప్రథమ చికిత్స అందిస్తారు. అంబులెన్స్ వచ్చే లోపే ఈ చికిత్స అందుతుంది. ఈ క్రమంలోనే ఆక్సిజన్ అవసరమైన వారికి అక్సిజన్ అందిస్తారు. ఆక్సిజన్‌తో పాటు మందులు కూడా బైక్ అంబులెన్స్‌లో తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇరవై నాలుగు గంటల పాటు ఈ బైక్ అంబులెన్స్ సర్వీస్ అందుబాటులో ఉంటుందని ఎస్పీ చెప్పారు.
బైక్ అంబులెన్స్ కోసం 8340000108, 8186000108 నంబర్లకు ఫోన్ చేయవచ్చని చెప్పారు. నర్సరావుపేటతో పాటు గుంటూరులో కూడా ఈ బైక్ అంబులెన్స్‌లు అందుబాటులో ఉంటాయని ఎస్పీ తెలిపారు. బైక్ అంబులెన్స్‌లను అందించిన దీర్ఘాయుస్మాన్ హెల్త్ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజర్ శ్రీకాంత్‌ను డాక్టర్ చింతా క్రష్ణ చైతన్యను ఎస్పీ అభినందించారు.