Cockfights: బుల్లెట్లు, థార్ కార్లు.. ఈసారి రేంజే వేరప్పా..! ‘పందెంకోడి’ సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే..

|

Jan 15, 2025 | 9:44 PM

సంక్రాంతి పండగ, సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని, కోడిపందేలకు మాత్రం పర్మిషన్‌ లేదు. బెట్టింగులు పెట్టి మరీ ఆడతామంటే చట్టం ఒప్పుకోదు. కాని, సంక్రాంతి సమయంలో ఇవేమీ చట్టానికి కనిపించవు. ప్రతి రాజకీయ పార్టీ కోడిపందేలను ప్రోత్సహించడమే కారణం. అందుకే, ఏటా వందల కోట్ల రూపాయల కోడిపందేలు జరుగుతాయి.

Cockfights: బుల్లెట్లు, థార్ కార్లు.. ఈసారి రేంజే వేరప్పా..! పందెంకోడి సంస్కృతిలో ఎప్పుడు భాగమైందంటే..
Cockfights in Andhra Pradesh
Follow us on

అసలు.. కోడి ఎక్కడ పుట్టింది? కోడి అంటూ ఒకటి ఉంటే కదూ.. నేడు ఇలా కోళ్లపందేలు జరిగేది..! ఎక్కడో పుట్టిన కోడిని, ఎక్కడెక్కడో పెరుగుతున్న కోడిని.. మనిషి ఎలా చేరదీశాడు? వాటిని పందెంకోళ్లుగా ఎలా మార్చాడు? గుడ్డు ముందా కోడి ముందా అనే ప్రశ్నకు అందరికీ ఆమోదయోగ్యమైన సమాధానం దొరకలేదు గానీ.. ఈ కోడి ఎక్కడ పుట్టింది అనే ప్రశ్నకు మాత్రం సమాధానం ఉంది. అంతేకాదు.. పందెంకోళ్లుగా ఎప్పుడు మారాయో చెప్పడానికి కూడా చరిత్రలో కొన్ని ఆధారాలున్నాయి. ఆ సమాధానాలు విన్నాక.. తొడకొట్టేంత ఉత్సాహం వస్తుంది మనందరికీ. అద్గదీ.. అందుకు కాదూ కోడిపందేలు మన సంస్కృతి, సంప్రదాయం అన్నదీ.. అని మనకు మనమే సమాధానపరుచుకుంటాం. సో.. ఆ డీటైల్స్‌ అన్నీ వార్తలో తెలుసుకుందాం..

అఖండ భారతం అంటే ఏంటి అని అడిగితే.. నైరుతి దిక్కున ఉన్న ఆనాటి పర్షియా నుంచి ఆగ్నేయాన కాంబోడియా వరకు అని చెప్పాల్సి ఉంటుంది. ఒకప్పుడు హైందవరాజులు పాలించిన ప్రాంతాలు అవన్నీ. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాలి అంటే.. కోడి చరిత్రకు, కోడి పందేల చరిత్రకూ లింక్‌ ఉంది కాబట్టి. ఈ భూమ్మీద జంతువుల నుంచి మనుషుల వరకు ఏది ఎప్పుడు ఎలా పుట్టిందనే దానిపై చార్లెస్ డార్విన్‌ ఓ జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దాని ప్రకారం.. కోడి మూలాలు ఆగ్నేయాసియాలోనే ఉన్నాయి. అంటే.. మయన్మార్‌, థాయిలాండ్‌, కాంబోడియా దేశాల్లో అన్నమాట. ఇంకా పిన్‌పాయింట్‌గా చెప్పాలంటే భారత ఉపఖండంలోనే పుట్టాయనే దానికి ఆధారాలు ఉన్నాయి. దాదాపు 10వేల సంవత్సరాల క్రితమే మనుషులకు కోళ్లు మచ్చిక అయినట్టు చరిత్రకారులకు ఆధారాలు లభించాయి. సింధూ నాగరికతలో మొహంజదారో నగరంలో కోడి బొమ్మలు ఉన్న శాసనాలు, ముద్రికలు కనిపించాయి. సరే.. కోడి చరిత్ర బాగుంది. మరి కోడి పందేలు ఎలా మొదలయ్యాయి? అక్కడికే వస్తున్నాం. చరిత్ర పుటల్లో మనకు దొరికిన ఆధారాల ప్రకారం 6వేల ఏళ్ల క్రితమే కోడిపందేలు జరిగాయి. ఎక్కడ? పర్షియాలో. పర్షియా అంటే ఇప్పటి ఇరాన్. ఇందాక అఖండ భారతం అని చెప్పుకున్నాం కదా.. నైరుతిలో ఉన్న పర్షియా వరకు మన రాజులు పాలించిన ప్రాంతాలే అని. ఆ పర్షియాలో కోడిపందేలు జరిగినట్టు ప్రూఫ్స్‌ దొరికాయి. అంటే.. భరతఖండంలోనే కోడిపందేలు మొదలయ్యాయి. ఈ కోడిపందేలు పర్షియా వరకు పాకాయంటే.. ఇప్పటి మన భూభాగంలో మొదలయ్యే ఉంటాయిగా. ఎస్.. దానికి కూడా కొన్ని ఆధారాలు ఉన్నాయి. కోడి పందేలు అనగానే.. మనకు చరిత్రలోని కొన్ని చరిత్రలు కళ్లముందు కనిపిస్తాయి. అందులో పల్నాటి యుద్ధం, బొబ్బిలి యుద్ధం. ఈ రెండూ జరగడానికి కారణం కోడిపందేలే. అంటే.. డెఫినెట్‌గా భారత ఉపఖండం నుంచే పర్షియా వరకు ఈ కోడిపందేలు పాకి ఉంటాయనేది కొందరు చరిత్రకారులు చేస్తున్న ఓ వాదన. మరీ ముఖ్యంగా తెలుగు నేలపైనే ఈ కోడి పందేలు ఎక్కువగా జరిగాయన్న దానికి కొన్ని సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. రానురాను అవే మన సంస్కృతిలో భాగంగా ఇమిడిపోయి.. పండగల సమయాల్లో ఓ సంప్రదాయంగా మారిపోయాయి. ఓవరాల్‌గా కోడిపందేలు అనేవి తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ఓ చిహ్నంగా మారాయి. ఒకప్పుడు గ్రీకులు, సిరియన్లు, పర్షియన్లు ఆడిన కోడిపందేలకు మూలం మనదగ్గరివే. సో, తొడగొట్టి మరీ చెప్పుకునే సమాధానం ఏంటంటే.. కోడిపందేలు మన సంస్కృతి, సంప్రదాయాలకు చిహ్నాలు. అలాగని.. కోట్లు పోగొట్టుకునే పందేలు కావు. ఈ విషయం బాగా గుర్తు పెట్టుకోవాలి.

కోడిపందేలు అంటే కోట్ల రూపాయలు చేతులు మారడం, లక్షలకు లక్షలు పోగొట్టుకోవడం అనేది నేటి మాట. కాని, ఇవే కోడిపందేలు ఒకప్పుడు యుద్ధాలను ఆపాయంటే నమ్మగలరా? కచ్చితంగా నమ్మాల్సిందే. యుద్ధంలో గెలవడం అంటే అర్థం.. తన రాజ్యంలోని వేలమంది సైనికులను చంపుకోవడమే. ఏ రాజు గెలిచాడు, రాజ్యాన్ని ఏ రాజు పాలించాలో చెప్పడానికి.. మధ్యలో లక్షల మంది ఎందుకు చనిపోవాలి అనే ప్రశ్న వచ్చింది. రాజుల పౌరుషాలకు సామాన్యులు ఎందుకు బలి అవ్వాలని ఒకానొక సందర్భంలో ప్రశ్నించుకున్నారు. ఆ సమయంలో వాళ్లకు వచ్చిన ఐడియా.. కోడిపందేలు. ఇటువైపు రాజు తరపున కోడి.. అటువైపు రాజు తరపున కోడి.. ఈ రెండింటి మధ్య పోటీ. ఏ పక్షం కోడి చనిపోతుందో ఆ రాజు ఓడిపోయినట్టు. గెలిచిన పక్షానిదే రాజ్యం కూడా. ఇలా.. భారీ జన నష్టం తప్పి శాంతి ఏర్పడుతుందని కోడి పందేలను ప్రోత్సహించారు. సింధూ నాగరికతలో కోళ్ల పోటీలు ఉండేవని తెలుస్తోంది. ఈజిప్టులో ఒకప్పుడు వినోద క్రీడ అంటే కోళ్లపందేలే. గ్రీసులో సైనికులను ఉత్తేజ పరిచేందుకు, వారిని యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు కోళ్ల పోటీలు పెట్టేవారు. రోమన్లు, గ్రీకులు కోళ్ల పోటీలు నిర్వహించే వారు. 1646లో ‘కాక్‌ ఆఫ్‌ ది గేమ్‌’ అనే పుస్తకం విడుదలైంది. అందులో కోడి పందేల గురించే ప్రత్యేకంగా రాశారు. జార్జ్ విల్సన్‌ రాసిన ఆ పుస్తకం ప్రకారం.. ఇరాన్‌, ఇండోనేషియా, బ్రెజిల్‌, పెరు, ఫిలిపైన్స్‌, మెక్సికో, ఫ్రాన్స్‌, క్యూబా, పాకిస్తాన్‌, అమెరికా, జపాన్‌, దేశాల్లోని కోడి పందేలు నిర్వహించడం ఒక ఆచారంగా ఉండేది. ఆ తరువాత ఇద్దరు మనుషుల మధ్య పౌరుషానికి ప్రతీకగా కోడిపందేలు నిర్వహిస్తూ వెళ్లారు. రానురాను వినోదం కోసం కోడిపందేలను ఆడించేవారు. అలా.. కాలక్రమంలో కోడిపందేల తీరు మారుతూ వచ్చింది.

కోడిపందేలు యుద్ధాలు ఆపిన చరిత్రనే చూశాం. కాని, ఇవే కోడిపందేలు రక్తచరిత్ర రాశాయన్న విషయాన్ని కూడా ఇక్కడ చెప్పుకోవాలి. 11వ శతాబ్దంలో ఈ కోడిపందేలను పౌరుషానికి ప్రతీకగా చూశారు కాబట్టే.. పల్నాటి యుద్ధం వచ్చిందని చెబుతుంటారు. బ్రహ్మనాయుడు, బాల నాగమ్మ పక్షాల మధ్య జరిగిన కోడి పందెంలో.. పల్నాటి బ్రహ్మనాయుడు ఓడిపోవడం వల్లే ఒప్పందం ప్రకారం అడవులకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందని చరిత్ర చెబుతోంది. పందెం ప్రకారం బ్రహ్మనాయుడు ఓడిపోతే ఏడేళ్ల పాటు నేటి నాగార్జునసాగర్ ప్రాంతమైన ఏలేశ్వరం మీదుగా రాజ్యం విడిచి వెళ్లిపోవాలి. అదే నాగమ్మ ఓడిపోతే మూడున్నరేళ్ల పాటు నేటి నల్లగొండ జిల్లా కృష్ణా తీరంలోని చిట్యాల రేవు దాటి వెళ్లిపోవాలి. ఆ ఒప్పందంతో.. గురజాల- మాచర్ల మధ్య ఉన్న గోలివాగు ప్రాంతంలోని కోడేరుగుట్టల వద్ద కోడిపందేలు పెట్టారు. కాని, ఓడిన వాళ్లు ఆ ఒప్పందాన్ని పాటించలేదు. నాగమ్మ తన కోడిపుంజు కాళ్లకు కత్తులు కట్టిందనేదే అసలైన కారణమని కొన్ని జానపథ కథల్లో వినిపిస్తుంది. కారణం ఏదైనా.. కోడిపందేల్లో ఓడిపోవడం అవమానంగా భావించి.. అదే పల్నాటి యుద్ధానికి దారి తీసిందని చెబుతారు. కోళ్లకు కత్తులు కట్టడం, కోడికత్తి అనేది ఆనాడే మొదలైంది. బొబ్బిలి యుద్ధం కూడా కోడిపందేల కారణంగానే జరిగిందని చెబుతుంటారు. బొబ్బిలి, విజయనగర రాజుల పుంజుల పోటీలో.. బొబ్బిలి పుంజులు గెలిచాయి. దీంతో ఆగ్రహించిన విజయనగర రాజులు దాన్ని అవమానంగా భావించారని, చివరికు అదే యుద్ధానికి దారి తీసిందని చెబుతారు. సరిగ్గా ఆ సమయంలోనే కుక్కుట శాస్త్రం కూడా పుట్టుకొచ్చింది. అంటే.. కోళ్లకు మాత్రమే ప్రత్యేకంగా చెప్పే ఓ జ్యోతిష్య శాస్త్రం. ఏ జాతి పుంజును ఏ సమయంలో బరిలోకి దింపితే గెలుస్తుందో.. కొన్ని లెక్కలు వేసి మరీ పందేలు కాస్తారు. ఇందుకోసం.. కోడి యజమాని పేరులోని అక్షరాలు, తిథుల ఆధారంగా ముహూర్తాలు చూస్తారు. ఇప్పటికీ.. కుక్కుట శాస్త్రంలోని ముహూర్తం ప్రకారమే పెద్దపెద్ద పందేలు జరుగుతుంటాయి. కనుమ రోజున పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోటి 25 లక్షల పందెం కాశారు. నెమలి, రసంగి మధ్య జరిగిన ఈ కోడిపందేన్ని కుక్కుట శాస్త్రం ప్రకారం పెట్టిన ముహూర్తంలోనే ఆడించారు.

ఒకప్పుడు యుద్ధాలను ఆపి, రక్తచరిత్రలు రాసిన అవే కోడిపందేలు.. రానురాను వినోద క్రీడగా మారింది. అటుపైన అదో సంప్రదాయంగా తెలుగు సంస్కృతిలో కలిసిపోయింది. పండగ సమయంలో ఆటవిడుపుగా చూడాల్సిన కోడిపందెం క్రమంగా జూదంగా మారిపోయింది.

సంక్రాంతి పండగ, సంప్రదాయంలో భాగంగా కోళ్ల పోటీలు పెట్టుకోవచ్చు. అభ్యంతరం లేదు. కాని, కోడిపందేలకు మాత్రం పర్మిషన్‌ లేదు. బెట్టింగులు పెట్టి మరీ ఆడతామంటే చట్టం ఒప్పుకోదు. కాని, సంక్రాంతి సమయంలో ఇవేమీ చట్టానికి కనిపించవు. ప్రతి రాజకీయ పార్టీ కోడిపందేలను ప్రోత్సహించడమే కారణం. అందుకే, ఏటా వందల కోట్ల రూపాయల కోడిపందేలు జరుగుతాయి. మరి.. ఈ సంక్రాంతికి చేతులు మారిందెంత? ఈసారి కోడిపందేలు ఏ రేంజ్‌లో జరిగాయి? అంటే.. కోట్లకు కోట్లే చేతులు మారాయి.. ఈ సారి లక్షలాది బహుమతులను కూడా ఇచ్చారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్, మామూలు బైక్‌లు, ధార్ జీప్ లాంటివి కూడా ఈ సారి బరిలో గెలిచిన వారికి ఇచ్చారంటే.. పందేలు ఏ రేంజ్ లో జరిగాయో ఊహించుకోవచ్చు..

కోడిపందెం.. కోస కూర.. కొంతమంది దృష్టిలో సంక్రాంతి పండగ అంటే ఇదే. గెలిస్తే.. గెలిచిన కోడితో పాటు లక్షలు తీసుకెళ్తాడు. ఓడితే.. పందెం డబ్బంతా పోగొట్టుకుని కోస కూర తింటారు. కాని, ఇలా చెప్పుకున్నంత సింపుల్‌గా కోడిపందేలు జరగవు. ఏకంగా 30 ఎకరాల్లో బరిని ఏర్పాటు చేశారు గోదావరి జిల్లాలో. కోడిపందేలకు అన్ని ఎకరాలు ఎందుకు అంటే.. అన్నేసి కార్లు, బైక్‌లు వస్తాయి కాబట్టి. ఇక బరిలోకి ఎవరికి పడితే వారికి ఎంట్రీ ఉండదు. కొన్నిచోట్ల ఫీజు కట్టి లోపలికి వెళ్లాలి. పందె కాసేవాళ్లు ముందుగా టోకెన్‌ అమౌంట్‌ కట్టాలి. గెలిచినా సరే.. నిర్వాహకులకు కమీషన్‌ ఇచ్చి మరీ కదలాలి. ఇక 5 లక్షలకు మించి పందెం కాసే వారికి ఇచ్చే ట్రీట్‌మెంట్‌, ఆ మర్యాదలు వేరే లెవెల్లో ఉంటాయి. పందెంరాయుళ్లకు కాపలాగా బౌన్సర్స్‌ను పెడతారు. ఈమధ్య లేడీ బౌన్సర్స్‌ను కూడా పెడుతున్నారు. బరి చుట్టుపక్కల గుండాట, కోతాట అంటూ ప్రత్యేకమైన జూదాలు ఉంటాయి. ఇక తాగిన వాళ్లకి తాగినంత. అడిగేవారు లేరు, ఆపే వారూ లేరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పీచుపిఠాయి తినాలన్నా రెట్టింపు డబ్బు ఇవ్వాల్సిందే. అందుకే అనేది.. కోడిపందేళ్లో కోట్ల రూపాయలు చేతులు మారతాయి అని. పైగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఊరూరా బరులు వెలిశాయి. రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో బరులు ఏర్పాటు చేశారు. కోనసీమ జిల్లాలో 430 బరుల్లో పందేలు జరిగాయి. కాకినాడ జిల్లాలో 410, తూర్పుగోదావరి జిల్లాలో 300 బరులు ఏర్పాటు చేశారు. భారీ టెంట్లు, షామియానాలు, మైక్‌లు, ఎల్‌ఈడీ స్ర్కీన్లు, రన్నింగ్‌ కామెంటరీలు, పసందైన భోజనాలు.. ఎవరికీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అరేంజ్‌మెంట్స్‌ చేశారు. రాత్రిపగలు కోడిపందేలు నిర్వహించడానికి వీలుగా.. ఫ్లడ్‌ లైట్లు పెట్టి, అడ్వాన్స్‌డ్‌ సీసీ కెమెరాలు, ప్రత్యేక డ్రోన్లతో పర్యవేక్షించారు. భీమవరంలోని ఒక గుండాట బోర్డ్‌ దగ్గర 50 లక్షలు ఖర్చు పెట్టి అరేంజ్‌మెంట్స్‌ చేయించారు. టెంట్లు, గ్యాలరీ, ఎల్‌ఈడీల ఏర్పాటు కోసం హైదరాబాద్‌కు చెందిన కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు.

సంక్రాంతి తొలిరోజు అయిన భోగి నాడు.. ఉమ్మడి గోదావరి జిల్లాలు, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జరిగిన కోడి పందేల్లో ఏకంగా 300 కోట్లు చేతులు మారాయని చెబుతున్నారు. ఇందులో ఉమ్మడి గోదావరి జిల్లాల వాటా 275 కోట్ల రూపాయలు ఉంటుందని ఓ అంచనా. ఇదంతా తొలిరోజు లెక్క మాత్రమే. కోడి పందేలు, గుండాట, పేకాట, మందు, విందు పేరుతో ఒక్కొక్కరు వేల రూపాయల నుంచి లక్షల్లో ఖర్చు పెట్టారు.

కోడిపందేలు అంటే గోదావరి జిల్లాలే గుర్తుకొస్తాయి. అక్కడ ఏ రేంజ్‌లో కోడిపందేలు జరుగుతాయి, ఎన్ని వందల కోట్లు చేతులు మారతాయో చెప్పడం కష్టం. కాకపోతే, అంచనా వేయొచ్చు. ఎలా అంటే.. ఈసారి ఉమ్మడి కృష్ణా జిల్లాలో 400 కోట్ల రూపాయలు చేతులు మారినట్టు చెబుతున్నారు. కృష్ణా జిల్లాలో అతిపెద్ద బరిగా ఉన్న అంపాపురంలో మొదటి రోజే 10 కోట్ల రూపాయలకు పైబడి పందేలు జరిగాయి. ఇది కూడా పూర్తి లెక్క కాదు. ముక్కనుమ కూడా అయిపోతే తప్ప కృష్ణా జిల్లాకు సంబంధించి మొత్తం లెక్క తేలదు. ఒక్క కృష్ణా జిల్లాలోనే 400 కోట్లు చేతులు మారితే.. ఇక ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఇంకెంత జరిగి ఉండొచ్చు..! ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఈ రెండు రోజుల్లో 500 కోట్లు చేతులు మారినట్టు అంచనా వేస్తున్నారు. ఆమాటకొస్తే.. భీమవరంలోనే 150 కోట్ల రూపాయల బెట్టింగ్‌ నడిచిందని టాక్. భీమవరం నియోజకవర్గ పరిధిలో 25 భారీ బరులు, 100 పెద్ద బరులు, 150 చిన్న బరులు పెట్టారు. 10 కోట్లు పెట్టుబడి పెట్టి.. 100 కోట్లు సంపాదించిన నిర్వాహకులు కూడా ఉన్నారు. సో, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ ఇదే లెక్కన బెట్టింగ్‌ జరిగి ఉంటుంది. ఓవరాల్‌గా రాష్ట్రం మొత్తం కలిపి ఎంత లేదన్నా ఈసారి 3వేల కోట్ల రూపాయలు చేతులు మారి ఉంటాయని ఓ అంచనా. 3వేల కోట్లు అని ఎలా చెబుతున్నారు అని అడిగితే.. గతేడాది సంక్రాంతి కోడిపందేల్లో 3వేల కోట్ల రూపాయలు చేతులు మారాయనేది ఓ లెక్క. ఈసారి అంతకంటే ఎక్కువే జరిగింది తప్ప.. ఎక్కడా తక్కువ జరగలేదు. సో, ఈ సంక్రాంతి కోడిపందేల్లో ఎంతకాదన్నా 3వేల కోట్లకు మించి జరిగి ఉంటుందని ఓ రఫ్‌ కాలిక్యులేషన్.

చెబితే ఆశ్చర్యం వేస్తుంది గానీ.. ఎవరుపడితే వాళ్లు కోడిపందేల బరులు ఏర్పాటు చేయలేరు. దాని కోసం వేలంలో పాడుకోవాలి. ఇక గుండాట బోర్డును కూడా ఎవరుపడితే వాళ్లు పెట్టలేరు. దాన్ని కూడా వేలంపాటలో గెలవాలి. భీమవరంలో ఓ గుండాట బోర్డును 80 లక్షలకు వేలంలో గెలుచుకున్నాడు ఓ నిర్వాహకుడు. సంక్రాంతి అయిపోయేలోపు గుండాట ద్వారా 2 కోట్ల రూపాయలు సంపాదించాలనేది అతని టార్గెట్. సో, ఎంత కాన్ఫిడెంట్‌ ఉంటే 80 లక్షలకు గుండాట బోర్డ్‌ పాడుకుని ఉంటాడు. అసలు.. గుండాట అరేంజ్‌మెంట్స్‌ కోసమే ఒకరు 50 లక్షలు ఖర్చుపెట్టారంటే.. ఆశ్చర్యం కదూ.

కోడిపందేలను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఈసారి గిఫ్టులు కూడా భారీగా పెట్టారు. ఒక చోట ఫస్ట్‌ ప్రైజ్‌ ఆఫర్‌ కింద మహీంద్రా థార్‌ కారును ఉంచారు. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ బైకులు, యూనికార్న్‌ బైకులను కూడా గెలిచిన వారికి ఇచ్చేందుకు తీసుకొచ్చారు. తాడేపల్లిగూడెంలో ఓ పందెంరాయుడు ఏకంగా ఆరు పోటీల్లో గెలిచి బుల్లెట్‌ బైక్‌ సొంతం చేసుకున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో బైక్‌లు, గోల్డ్‌ కాయిన్లను ఆఫర్లుగా పెట్టారు. కాకినాడలోని కరప మండలంలో 36 లక్షలు ఇచ్చి.. బరిని సొంతం చేసుకున్నాడు. ఆ బరిలో తొలిరోజే 10 కోట్ల రూపాయలకు పైగా పందేలు నిర్వహించారు. అంటే.. ఈ మూడు రోజుల్లో ఎంత సంపాదించి ఉంటాడు. ఒక్కొక్కరు అంతంత సంపాదించడం చూసి.. అయ్యో తమ దగ్గర అన్ని డబ్బులు లేవే అని బాధపడక్కర్లేదు. ఇన్‌స్టంట్‌ లోన్స్‌ ఇచ్చేందుకు బరుల వద్ద ఫైనాన్స్‌ వ్యాపారులు నోట్ల కట్టలు పట్టుకుని కూర్చున్నారు. వాళ్లంతా అధిక వడ్డీకి అప్పులు ఇచ్చారు.

ఈసారి కోడిపందేలు తెలంగాణలో కూడా జోరుగా సాగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఏపీ సరిహద్దులో ఉండే తెలంగాణ జిల్లాల్లో కోడిపందేలు ఎక్కువగా జరిగాయి. ఏలూరు జిల్లాలోని కామయ్యపాలెంలో జరిగిన కోడి పందేలను తెలంగాణలోని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ స్వయంగా ప్రారంభించారు. పైగా ఏపీలో జరిగే కోడిపందేలు, గుండాటల కోసం తెలంగాణ జిల్లాల నుంచి ఎక్కువ మంది వెళ్లారు.

ఏపీలో గతం కంటే ఈసారి కోడిపందేలు పెద్ద ఎత్తున జరగడానికి కారణం.. రాజకీయ నాయకులే. భోగి నాడు స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు వచ్చి బరులను ప్రారంభించారు. తమ చేతుల మీదుగా కోడిపందేలను మొదలుపెట్టారు. ప్రజాప్రతినిధులే స్వయంగా ప్రారంభోత్సవాలు చేసినప్పుడు.. ఇక పందెంరాయుళ్లను అడ్డుకునేది ఎవరు..? అలాగని పోలీసులు పూర్తిగా ప్రేక్షకపాత్ర పోషించారని చెప్పడానికి లేదు. గోదావరి జిల్లాల్లో 350 మంది పందెం రాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 18 ప్రాంతాల్లో కోడి పందేల బరులు ధ్వంసం చేశామని ఏలూరు రేంజ్‌ పోలీసులు చెబుతున్నారు. భోగి రోజు 1800 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు, జగ్గయ్యపేటలో బరులను డ్రోన్లతో చూసి, వాటిని ధ్వంసం చేశారు. ఎవరెన్ని ఆంక్షలు పెట్టినా, పోలీసులు నిఘా పెట్టినా.. కోడిపందేలు మాత్రం ఆగేవి కావు. ప్రభుత్వం ఏదైనా సరే.. వాటిని అడ్డుకునే వారే లేరు. కోళ్లు ఎగ‌రాల్సిందే.. క‌త్తులు దూయాల్సిందే! అదే జరిగింది ఈసారి కూడా.

బయటి నుంచి చూసే వారికి.. ఈ కోడిపందేలేంటి, లక్షలకు లక్షలు పోగొట్టుకోవడం ఏంటి అని అనిపిస్తుంది. కాని, లక్షల్లో డబ్బు పెట్టే వారికి మాత్రం అదో సెంటిమెంట్. సంక్రాంతికి సొంతూరు వెళ్లామా, పందెం కాసామా అన్నదే లెక్క. పొరపాటున కోడిపందేలు మిస్‌ అయ్యారా.. ఇక ఆ ఏడాదంతా వెలితిగానే ఉంటుందట కొందరికి. పైగా కోడిపందేల్లో పాల్గొనకపోతే.. వ్యాపారం కలిసిరాదని చెప్పుకునే వాళ్లూ ఉన్నారు. ఇక్కడ.. గెలుపు ఇంపార్టెంట్ కాదు. బెట్టు కట్టామా లేదా. అదే ఇంపార్టెంట్. పెద్దపెద్ద వ్యాపారాలు చేసి, కోట్లు గడిస్తున్న తమకు.. పండక్కి లక్షలు ఖర్చుపెట్టడం పెద్ద లెక్క కాదు అంటుంటారు. అదేమంటే.. కోడిపందేలతో తమకున్న అనుబంధం అటువంటిది అని చెబుతుంటారు. ఇలాంటి వారిని చూసి సామాన్యులు తమ చేతులు కాల్చుకుంటున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయట అనే స్టేట్‌మెంట్లు విని.. ఆశకొద్దీ లక్షలు పట్టుకెళ్లి ఒట్టి చేతులతో తిరిగొస్తున్న వాళ్లున్నారు. పండగంటే పందేలు కాయడమే అనే భ్రమలోంచి బయటపడితేనే బెటర్. లేదూ.. అది సాంప్రదాయం అంటారా.. సరదాగా వెళ్లి చూసొచ్చేయండి చాలు. పండగ అంటేనే సంతోషంతో ఉండడం. డబ్బులు పోగొట్టుకుని సంతోషం ఆవిరైతే దాన్ని పండగ అనరు.. కావున ఈ విషయాన్ని గుర్తుచేసుకోవడం చాలా ముఖ్యం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..