Andhra Pradesh: ‘సూపర్‌ సిక్స్‌’పై చంద్రబాబు సర్కార్ కసరత్తు.. నవంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌..!

|

Oct 20, 2024 | 8:32 PM

ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు వేళయింది. దీంతో అసెంబ్లీ సమావేశలకు ముహూర్తం పెట్టే పనిలో పడింది కూటమి ప్రభుత్వం. ఖర్చులు, ఆదాయాలపై ఇప్పటికే స్పష్టత వచ్చిన నేపథ్యంలో.. ఎన్నికల హామీల అమలుపై బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వనుంది సర్కారు. మరి పయ్యావుల పద్దులో..సూపర్‌ సిక్స్‌ లెక్కెంత..? A అంటే అమరావతి.. P అంటే పోలవరం అని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. వాటికి ఏ మేరకు నిధులు కేటాయించనుంది..?

Andhra Pradesh: ‘సూపర్‌ సిక్స్‌’పై చంద్రబాబు సర్కార్ కసరత్తు.. నవంబర్‌లో పూర్తి స్థాయి బడ్జెట్‌..!
Pawan Kalyan Chandrababu
Follow us on

ఏపీలో పూర్తిస్థాయి బడ్జెట్‌కు వేళయింది. తొలిసారి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. ఎన్నికల నేపథ్యంలో గత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం.. ఫిబ్రవరి నెలలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను సమర్పించింది. మొత్తం రూ.2 లక్షల 86 వేల 389 కోట్లకు బడ్జెట్‌ సమర్పించిన గత ప్రభుత్వం.. 2024 ఏప్రిల్‌ నుంచి జులై 31 వరకు నాలుగు నెలల కాలానికి 40 గ్రాంట్ల కింద 1 లక్షా 9 వేల 52.34 కోట్లకు అసెంబ్లీ ఆమోదం తీసుకుంది. జూన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జులైలో పూర్తి స్థాయి బడ్జెట్‌ సమర్పించాల్సి ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా ఉందన్న చంద్రబాబు ప్రభుత్వం..ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. ఆగస్టు నుంచి నవంబరు వరకు రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులు, ఇతర కార్యకలాపాల కోసం 1 లక్షా 29 వేల 972.97 కోట్లకు గవర్నర్‌ నుంచి ఆమోదం తీసుకున్నారు. దీంతో మొత్తంగా 8 నెలల కాలం ఓట్ ఆన్ అకౌంట్ పద్దుతోనే గడిచింది.

ఇటీవలే 125 రోజులు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తాము సాధించిన విజయవాలపై ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. ఇటీవలే టీడీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించిన చంద్రబాబు.. ఇప్పటి వరకూ చేసిన పనులను చెప్తూనే భవిష్యత్ ప్రణాళికను కూడా ఆవిష్కరించారు. అటు వైసీపీ మాత్రం ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేక పోతోందని పదేపదే విమర్శలు చేస్తోంది. హామీలు అమలు చేయడం ఇష్టం లేక బడ్జెట్ పెట్టకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తోంది.. మాజీ సీఎం జగన్ ఆరోపణలు సంధిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్థంగా మారిందని ఆరోపిస్తున్న ప్రభుత్వం..వివిధ శాఖల్లో పరిస్థితిని తెలుసుకునేందుకు సమయం పట్టిందని చెబుతోంది. ఈ నేపథ్యంలో నవంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

రూ.2.90 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ ఉండే అవకాశం

వాస్తవానికి చివరి నాలుగు నెలల కాలానికి బడ్జెట్‌ ఖర్చులకు ఆమోదం తీసుకోవాల్సి ఉన్నా.. ఏడాది మొత్తానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సిందే. దీంతో దాదాపు రూ.2.90 లక్షల కోట్ల మేరకు బడ్జెట్‌ ఉండొచ్చని తెలుస్తోంది. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్‌లో పెద్దపీట వేసే అవకాశం ఉంది. రహదారుల నిర్మాణం, మరమ్మతులు కీలకం కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సూపర్‌ సిక్స్‌ పేరుతో హామీలు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అధికారం చేపట్టిన వెంటనే పెన్షన్ల మొత్తాన్ని పెంచి అందిస్తున్నారు.నవంబరు నుంచి ఉచిత గ్యాస్‌ సిలిండర్ల హామీని కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం వంటి కీలక హామీలను డిసెంబర్ నుంచి అమలు చేయాలనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. వీటిపై పూర్తిస్థాయి బడ్జెట్‌లో క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మిగిలిన సంక్షేమ పథకాల అమలుపై కూడా ఆర్థికశాఖ ప్రస్తుతం కసరత్తు చేస్తోంది. బడ్జెట్ ప్రతిపాదనలపై ఇప్పటికే శాఖల వారీగా సమావేశాలు నిర్వహించారు..ఆర్థిక శాఖ అధికారులు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే..గతం కంటే రూ.20 వేల కోట్లు అదనంగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు నిధుల సమీకరణ, కేటాయింపులపై ఆర్థిక శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏ పథకానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేస్తున్నారు.

వీడియో చూడండి..

కేంద్ర నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్టత

కేంద్ర బడ్జెట్‌ నుంచి వివిద పద్దుల క్రింద అందబోతున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి స్పష్ఠత వచ్చింది. మరోవైపు ఇసుక, మద్యం, పరిశ్రమలు తదితర పాలసీలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. సంక్షేమ పధకాలను ఎప్పటి నుంచి ఏ విధంగా అమలుచేయాలి? వాటితో ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే దానిపై కూడా లెక్కలు వచ్చాయి. ఈ నాలుగు నెలల్లో రాష్ట్ర ఆదాయ వ్యయాలు, అప్పులపై కూడా క్లారిటీ వచ్చింది. దీంతో నవంబర్‌ రెండో వారంలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఓవైపు ఆర్థికశాఖ అధికారులు బడ్జెట్‌ రూపకల్పనలో బిజీగా ఉంటే.. మరోవైపు శాసనసభ, ఆర్థిక వ్యవహారాలశాఖ మంత్రి పయ్యావుల అసెంబ్లీ సమావేశాల తేదీలు ఖరారు చేసే పనిలో ఉన్నారు. నవంబర్ రెండో వారంలో ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..