Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మన్యం జిల్లా వాసులకు దసరా బొనాంజా..

| Edited By: Shaik Madar Saheb

Oct 05, 2024 | 3:13 PM

పార్వతీపురం మన్యం జిల్లావాసులకు విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పటనుంది. ఏళ్ల తరబడి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్యకు చెక్ పెట్టనుంది. ఆ దిశగా ఇప్పటికే ఏపి ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇంతకీ ఏనుగుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెక్ చెప్పనుంది? తీసుకోబోయే చర్యలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఏనుగుల సమస్యకి పరిష్కారం దొరికేనా? అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.

Andhra Pradesh: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. మన్యం జిల్లా వాసులకు దసరా బొనాంజా..
Elephants
Follow us on

పార్వతీపురం మన్యం జిల్లావాసులకు విజయదశమి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పటనుంది. ఏళ్ల తరబడి జిల్లా వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఏనుగుల సమస్యకు చెక్ పెట్టనుంది. ఆ దిశగా ఇప్పటికే ఏపి ప్రభుత్వం చర్యలకు దిగింది. ఇంతకీ ఏనుగుల సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ఎలా చెక్ చెప్పనుంది? తీసుకోబోయే చర్యలు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యలతో ఏనుగుల సమస్యకి పరిష్కారం దొరికేనా? అనేది ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఏనుగులు ప్రధానంగా జియ్యమ్మవలస, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, కొమరాడ, గరుగుబిల్లి మండలాల్లో సంచరిస్తుంటాయి. ఇప్పటివరకు ఏనుగుల దాడిలో పన్నెండు మంది మృతిచెందగా, మరో నలభై మంది వరకు గాయాల పాలయ్యారు. సుమారు పది పశువులు చనిపోయాయి. జిల్లాలో అరటి, మొక్కజొన్న, బొప్పాయి వంటి వేలాది ఎకరాల పంటలను ధ్వంసం చేశాయి. కూరగాయలు సాగు చేసుకుని కుటుంబాన్ని పోషించే రైతుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. తెల్లవారుజామున తోటల్లోకి వెళ్లి ఆకుకూరలు, కూరగాయలు సేకరించాలంటే ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిందే. ఏనుగులు ఎప్పుడు ఎటు వైపు నుండి వచ్చి దాడి చేస్తాయో తెలియని భయానక పరిస్థితి నెలకొంది. అంతే కాక ఇప్పుడు కొత్తగా శ్రీకాకుళం జిల్లా నుండి మరో నాలుగు ఏనుగుల గుంపు జిల్లాకు చేరుకుంది. అలా వచ్చిన ఏనుగుల గుంపు కురుపాం మండలం జరడలో సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి. గిరిజనులు పండిస్తున్న రాగులు, జొన్నలతో పాటు ఇతర చిరుధాన్యాల పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. అంతేకాకుండా రాత్రి సమయంలో గ్రామాలకు ప్రవేశిస్తూ ఘీంకరాలు చేస్తున్నాయి. కొత్తగా వచ్చిన ఏనుగులు గుంపు ప్రవర్తన కూడా భయానకంగా ఉండటంతో స్థానికులు వణికిపోతున్నారు.

జిల్లాలో సంచరిస్తున్న మొత్తం పదకొండు ఏనుగుల కారణంగా నెలకొన్న భయానక పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఏనుగుల తరలింపునకు ముమ్మర కసరత్తు చేస్తోంది. ఎలాగైనా ఏనుగులను తరలించాలని అటవీశాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఏనుగుల తరలింపునకు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను తీసుకువచ్చి వాటి సహాయంతో తిరిగి ఒడిశాలోని లఖేరి అటవీ ప్రాంతానికి తరలించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో జయంత్, వినాయక్ అనే రెండు ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఉన్నాయి.. అయితే వాటి వయస్సు దాదాపు 55 సంవత్సరాలు పైబడి ఉండటంతో వాటి సహాయం తీసుకోవడం కష్టతరం అవుతుంది. దీంతో ఏపి ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటక సహాయం కోరింది.

Elephants

కుంకీ ఏనుగులు అంటే ఏమిటి? అవే చేసే ఆపరేషన్స్ ఎలా ఉంటాయి..

ఏపీలో ఉన్న రెండు ఏనుగులు వృద్దాప్యంలో ఉండగా ప్రస్తుతం కర్ణాటకలో ప్రత్యేక శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు ఉన్నాయి. ఆపరేషన్స్ లో భాగంగా అక్కడ నుంచి నాలుగు కుంకీ ఏనుగులు ఏపికి తీసుకు వచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వంతో ఏపి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీంతో ఏనుగుల పరిష్కారానికి తొలి అడుగు పడింది. ఇప్పటివరకు ఏనుగుల గుంపుతో జిల్లావాసులు భయం భయంగా గడుపుతుంటే అలాంటి భయానక ఏనుగులనే గజగజలాడిస్తాయి ఈ కుంకీ ఏనుగులు. కుంకీ ఏనుగులు అంటే పూర్తిస్థాయిలో ప్రత్యేక శిక్షణ పొందిన ఏనుగులు అని అర్థం. ఎక్కడైనా ఏనుగులు దాడులకు దిగుతున్నా, ప్రమాదంలో ఎక్కడైనా ఏనుగులు గాయపడ్డ లేక మదమెక్కి స్వైర విహారం చేస్తున్న వాటిని అదుపులోకి తెచ్చేందుకు, పరిస్థితుల బట్టి వాటిని రక్షించేందుకు ఈ కుంకీ ఏనుగులు రంగంలోకి దిగుతాయి.

సహజంగా కుంకీ ఏనుగులన్నీ మగ ఏనుగులు మాత్రమే ఉంటాయి. మగ ఏనుగులు మాత్రమే ఒంటరిగా సంచరిస్తుంటాయి. అలాంటి మగ ఏనుగులను బంధించి వాటిని అడవిలో కొన్ని నెలలపాటు ప్రత్యేక శిక్షణ ఇస్తారు. అలా శిక్షణ ఇచ్చిన తర్వాత వాటిని ఆపరేషన్ల కోసం వాడతారు. కుంకీ ఏనుగులు ఆపరేషన్లు చేస్తున్న సందర్భాల్లో ఏనుగుల గుంపు ఈ కుంకీ ఏనుగుల పై దాడి చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ కుంకీ ఏనుగులు సమర్ధవంతంగా వాటిని తిప్పి కొట్టి ఆపరేషన్ పూర్తి చేసేలా తయారు చేస్తారు.

ఒకసారి ఈ కుంకీ ఏనుగులు రంగంలోకి దిగితే ఆపరేషన్ పూర్తయ్యే వరకు వెనుతిరగవు. ముందుగా ఏనుగుల గుంపుతో మచ్చిక చేసుకొని వాటిని కలుపుకొని ఇతర ప్రాంతాలకు తరలించే విధంగా ప్రయత్నిస్తాయి. అలా కుదరకపోతే బలవంతంగా అయినా వాటి పై దాడికి దిగి ఆపరేషన్ పూర్తి చేస్తాయి. అలాంటి సమర్థవంతమైన రెండు కుంకీ ఏనుగులు విజయదశమి తర్వాత జిల్లాకు రానున్నాయి. అందుకోసం అధికారులు ఇప్పటికే కసరత్తు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..