AP News: ఆ విషయంలో ఏపీకి ఆదర్శంగా ఈశాన్య రాష్ట్రం.. ఏపీ ఉన్నతస్థాయి బృందం పర్యటన

| Edited By: Janardhan Veluru

Oct 05, 2024 | 3:41 PM

ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదన్నది కొన్నేళ్ల క్రితం మాట.. ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. కొన్ని అంశాలు దేశంలోని ఇతర ప్రాంతాలకే ఆదర్శంతంగా నిలుస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాలు. తాజాగా అసోంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (Road Asset Management System) అమలు పరిశీలనకై ఏపీకి చెందిన ఉన్నత స్థాయి బృందం అక్కడ పర్యటించింది.

AP News: ఆ విషయంలో ఏపీకి ఆదర్శంగా ఈశాన్య రాష్ట్రం.. ఏపీ ఉన్నతస్థాయి బృందం పర్యటన
Ap Delegation In Assam
Follow us on

ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదన్నది కొన్నేళ్ల క్రితం మాట.. ఇప్పుడు ఆ పరిస్థితిలో పూర్తి మార్పు వచ్చింది. కొన్ని అంశాలు దేశంలోని ఇతర ప్రాంతాలకే ఆదర్శంతంగా నిలుస్తున్నాయి ఈశాన్య రాష్ట్రాలు. తాజాగా అసోంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం (Road Asset Management System) అమలు పరిశీలనకై ఏపీకి చెందిన ఉన్నత స్థాయి బృందం అక్కడ పర్యటించింది. ఈ ఉన్నత స్థాయి బృందానికి ఏపీ రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీ.సీ జనార్దన్ రెడ్డి సారథ్యంవహించారు. రెండు రోజుల పర్యటనలో ఏపీ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందం అక్కడ అమలవుతున్న రోడ్ల నిర్వహణ విధానాలను చూసి ఆశ్చర్యపోయింది.

సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి లేదని వింటూ వుంటాం. కానీ ఇటీవల కాలంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశాక ఈశాన్య ప్రాంతంలోని అభివృద్ధి పరుగులు పెడుతోంది. పలు పథకాలు, ప్రాజెక్టుల ప్రణాళిక, అమలు,  పర్యవేక్షణకు సంబంధించిన విషయాలకు ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యత వహిస్తుంది. ఈ ప్రాంతం యొక్క సామాజిక-ఆర్థిక అభివృద్ధి వేగాన్ని వేగవంతం చేయడం దీని దృష్టి దేశంలోని మిగిలిన ప్రాంతాలతో సమానమైన వృద్ధిని పొందడం లక్ష్యంగా చాలా వేగంగా అడుగులు పడుతున్నట్టు గుర్తించింది మన రాష్ట్ర బృందం.

అస్సాం ప్రభుత్వం తరపున అస్సాం పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ స్పెషల్ కమీషనర్ & సెక్రటరీ చంద్రశర్మ, అస్సాం పీడబ్ల్యూడీ సెక్రటరీ పబన్ తెరంగ్ ఇతర పీడబ్ల్యూడీ ఉన్నతాధికారులు ఆంధ్ర ప్రదేశ్ బృందానికి అక్కడ జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా అస్సాం రాజధాని గౌహతిలో బ్రహ్మపుత్ర గెస్ట్ హౌస్ లో అస్సాం పబ్లిక్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆ రాష్ట్రంలో రహదారుల ఆస్తుల నిర్వహణ విధానం అమలుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా రాష్ట్ర బృందానికి వివరించారు. ఈ విధానంలో వారి అనుభవాలను, తలెత్తే సమస్యలను ఎదుర్కొనే తీరును ఇరు రాష్ట్రాల అధికారులు చర్చించడం జరిగింది.

అస్సాం రాష్ట్ర రహదార్ల వ్యవస్థ 66,203 కిలోమీటర్లు

గత రెండు దశాబ్దాలుగా అస్సాం ఆర్ & బీ శాఖ తీసుకుంటున్న చర్యల ద్వారా వచ్చిన గణనీయమైన మార్పులను ఆ రాష్ట్ర అధికారులు వివరించారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ప్రధాన జిల్లా రహదారులు మరియు గ్రామీణ రహదారులు అన్ని కలిపి.. మొత్తంగా అస్సాం రాష్ట్ర రహదార్ల వ్యవస్థ సుమారుగా 66,203 కి.మీ మేర ఉన్నది. అస్సాం ప్రభుత్వం రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా ఆ రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా రూ. 10 వేల కోట్లు ఆర్ & బీ శాఖకు కేటాయింపులు చేయడం కీలక పరిణామం.. ఇది ఆ రాష్ట్ర బడ్జెట్ లో దాదాపుగా 7 శాతం వరకు ఉంది. ఈ విధంగా అస్సాం ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తూ ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.

భారత మాల తరహాలోనే అస్సాం మాల

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న భారత మాల పథకం తరహాలోనే అస్సాంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా త్వరితగతిన అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఆ రాష్ట్ర ఆర్ & బీ శాఖ “అస్సాం మాల” అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేపట్టింది. అస్సాంలో ధీర్ఘకాలిక పనితీరు ఆధారంగా మెయింటెనెన్స్ కాంట్రాక్టులు 5 ఏళ్ల వ్యవధికి చేపట్టడం జరిగింది. మల్టిమోడల్ లాజిస్టిక్ పార్కు ప్రాజెక్టును సైతం అస్సాం ప్రభుత్వం చేపట్టడం జరిగింది.. అలాగే రోడ్ల నిర్మాణంలో భూసేకరణ సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నేరుగా భూముల కొనుగోలు విధానంను అస్సాం ప్రభుత్వం అమలు చేస్తోంది. ముఖ్యంగా అస్సాం ప్రభుత్వం రోడ్ల ఆస్తుల నిర్వహణ విధానంను అత్యాధునిక పద్దతిలో అమలు చేయడం జరుగుతోంది.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి