మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుకున్న దానికంటే తక్కువ ఫలితాలు పొందిన బిజెపికిపుడు కొత్త చింత మొదలైంది. పైకి డాంబికంగా ప్రకటనలు చేస్తున్నా ప్రధాని మోదీతోపాటు బిజెపి చీఫ్ అమిత్‌షా లోలోపల రానున్న పరిణామాలపై ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ రానున్న కొత్త ముంప్పు ఏంటీ అంటారా ? రీడ్ దిస్ స్టోరీ…
మహారాష్ట్ర, హర్యానా ఫలితాల్లో అనుకున్న దానికంటే ఫేలవమైన ఫలితాలు పొందిన బిజెపికి రాజ్యసభ వేదికగా థ్రెట్ కనిపిస్తోంది. అయిదేళ్ళుగా అధికారంలో వున్నప్పటికీ.. బిజెపికి ఇటీవలనే రాజ్యసభలో సంఖ్యాబలం సమకూరింది. ప్రస్తుతం బిజెపి రాజ్యసభ ఎంపీల సంఖ్య 82 కాగా.. కాంగ్రెస్ సంఖ్య 45. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు పొంది వుంటే బిజెపికి రాజ్యసభలో నెంబర్ మరింత పెరిగి వుండేది. దాంతోపాటు 2020, 2022, 2024లలో ఖాళీ అయ్యే రాజ్యసభ బెర్తులను కాపాడుకోవడమో లేక పెంచుకోవడమో చేసే ఛాన్స్ వుండేది.
కానీ ఈ ఫలితాల కారణంగా స్వల్పంగా బిజెపికి నష్టం, కాంగ్రెస్ లాభం కలిగే పరిస్థితి కనిపిస్తోంది. మహారాష్ట్ర నుంచి మొత్తం 19 మంది రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా.. ప్రస్తుతం వారిలో 11 మంది ఎన్డీఏ(బిజెపి-శివసేన), ఏడుగురు యుపిఏ (కాంగ్రెస్-ఎన్సీపీ) పక్షాన వున్నారు. అదే సమయంలో హర్యానా నుంచి మొత్తం అయిదుగురు రాజ్యసభ సభ్యులుంటే.. బిజెపి తరపున ముగ్గురు, కాంగ్రెస్ పార్టీ తరపున ఒక్కరు.. ఇండిపెండెంట్‌గా మరొకరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇండిపెండెంట్ సభ్యుడైన సుభాష్ చంద్ర కూడా బిజెపి మద్దతులోనే నెగ్గారన్నది అందరికీ తెలిసిందే.
ఇదిలా వుంటే.. హర్యానా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు 2020లో పదవీ విరమణ చేస్తున్నారు. మరో ఇద్దరు 2022లో పదవీ విరమణ చేస్తారు. మరోవైపు మహారాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారిలో ఏడుగురు వచ్చే సంవత్సరం (2020) ఆరుగురు మరో రెండేళ్ళ తర్వాత (2022) రిటైర్ అవుతారు. అంటే వచ్చే రెండేళ్ళలో రిటైర్ అయ్యే 13 మంది మహారాష్ట్రకు చెందిన రాజ్యసభ సభ్యుల్లో ఏడుగురు ఎన్డీఏకు, ఆరుగురు యుపిఏకు చెందిన వారు.
ప్రస్తుత లెక్కల ప్రకారం హర్యానాలో ఒక రాజ్యసభ సభ్యున్ని గెలిపించుకోవాలంటే 30 మంది ఎమ్మెల్యేలు, మహారాష్ట్రలో 36 మంది ఎమ్మెల్యేలు కావాల్సి వుంటుంది. ఈ లెక్కన హర్యానాలో 2020లో కోల్పోతున్న రెండు స్థానాలకు గాను బిజెపి ఒక్కదానినే తిరిగి పొందే అవకాశం కనిపిస్తోంది. అదే సమయంలో మహారాష్ట్రలో ఏడుగురు పదవీ విరమణ చేయనుండగా.. ఎన్డీఏ కూటమి కేవలం నలుగురిని మాత్రమే తిరిగి గెలిపించుకునే పరిస్థితి వుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఒకింత మెరుగ్గా వుంది.
హర్యానాలో ఒక స్థానం కోల్పోతుండగా.. ప్రస్తుత బలంతో ఆ ఒక్క స్థానాన్ని రిటేయిన్ చేసుకునే పరిస్థితి వుంది. మహరాష్ట్ర నుంచి ఇద్దరిని గెలిపించుకునే పరిస్థితిలో యుపిఏ కనిపిస్తోంది. దాదాపు ఇదే పరిస్థితి 2022లోను పునరావృతమయ్యే సంకేతాలే స్పష్టంగా వున్నాయి.
సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు పొందిన బిజెపి.. 2020, 2022 రాజ్యసభ ఎన్నికల్లో మూల్యం చెల్లించుకునే పరిస్థితి వుంది. చత్తీస్‌గఢ్‌లో బిజెపికి కేవలం 15 మంది ఎమ్మెల్యేలుండగా.. ఒక్కరిని కూడా రాజ్యసభకు పంపే పరిస్థితి లేదు. రాజస్థాన్‌లో మొత్తం 73 మంది ఎమ్మెల్యేల బలం వున్న బిజెపి అక్కడా ఒక్కరికి మించి రాజ్యసభకు నామినేట్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజస్థాన్ నుంచి ఒకరిని రాజ్యసభకు పంపాలంటే 50 మంది ఎమ్మెల్యేలు అవసరం. మధ్యప్రదేశ్‌లో బిజెపికి 109 ఎమ్మెల్యేలుండగా.. అక్కడ ఒక్కో రాజ్యసభ సభ్యున్ని ఎన్నుకోవాలంటే 58 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా.. ఆ రాష్ట్రం నుంచి కూడా ఒక్కరినే రాజ్యసభకు పంపే పరిస్థితి.
ఈ లెక్కన గురువారం వెలువడిన ఫలితాల తర్వాత బిజెపి నేతలు పైకి ఢాంబికంగా కనిపిస్తున్నా.. అలాంటి ప్రకటనలే చేస్తున్నా.. లోలోపల రాజ్యసభలో పార్టీ బలాన్ని ఎలా కాపాడుకోవాలా అన్న అంశంపై తెగ మధనపడుతున్నట్లు సమాచారం. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలు… ట్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 రద్దు, కశ్మీర్ విభజన వంటి బిల్లుల విషయంలో రాజ్యసభలో వున్న బలాన్ని చూసుకునే మోదీ ముందడుగు వేశారు. ముందుగా రాజ్యసభలో బిల్లు ఆమోదింప చేసుకుని.. ఆ తర్వాత లోక్‌సభలో తేలికగా గట్టెక్కారు. సో.. ఇపుడు వచ్చే రెండేళ్ళలో రాజ్యసభలో సంఖ్యాబలం గణనీయంగా తగ్గే పరిస్థితి వుండడంతో మరిన్ని సాహసోపేత నిర్ణయాలను తీసుకోవడంలో మోదీ ఒకటికి రెండు సార్లు పునరాలోచన చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.