ఏపీలో ప్రస్తుతం ఆ ఇద్దరు నేతల గురించి జోరుగా చర్చలు నడుస్తున్నాయి. రెండు పార్టీలకు ప్రతినిధులుగా వచ్చిన ఆ ఇద్దరూ వ్యక్తిగత ప్రతిష్ట కోసం దాదాపు యుద్ధమే చేస్తున్నారు. ఈ ఎన్నికలు ఇద్దరికీ ఇజ్జత్ కా సవాలే. సీఎం రమేష్ వర్సెస్ వైవీ సుబ్బారెడ్డి.. స్ట్రాటజీలు-కౌంటర్ స్ట్రాటజీలతో ఉత్తరాంధ్ర రాజకీయాల్ని కాక రేపుతున్నారు. వాళ్లిద్దరి మధ్య ఎందుకింత భగ్గుభగ్గు..? ప్రస్తుతానికి ఎవరిది పైచేయి?
ప్రాంతీయ ఇన్‌చార్జిల ఆధ్వర్యంలో పార్టీని నడిపించాలన్నది వైసీపీ సంస్థాగత స్ట్రాటజీ. ఒక్కొక్కరికి రెండు లేదా మూడు జిల్లాలు.. 30 నుంచి 40 వరకు అసెంబ్లీ సెగ్మెంట్లనిచ్చి.. వాటిల్లో పార్టీ బాగోగుల్ని చూసుకోవడం వీళ్ల బాధ్యత. ఆ కోవలో ఉత్తరాంధ్ర ప్రాంతీయ ఇన్‌చార్జిగా వచ్చిన విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామక్రిష్ణారెడ్డి.. ఇప్పుడు అదే సీక్వెన్స్‌లో సీన్లోకొచ్చారు వైవీ సుబ్బారెడ్డి.
2014లోనే ఉత్తరాంధ్ర ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించారు వైవీ సుబ్బారెడ్డి. కానీ.. అప్పుడు పార్టీ ఓటమిపాలవడంతో ఆయన్ను తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాల ఇన్‌చార్జిగా పంపారు. ఆసమయంలో ఉత్తరాంధ్ర చార్జ్ తీసుకున్నారు విజయసాయిరెడ్డి. 2019 ఎన్నికలప్పుడు వ్యూహం మార్చి సాయిరెడ్డిని దక్షిణ కోస్తాకు పంపి.. ఆ ప్లేస్‌లో మళ్లీ వైవీ సుబ్బారెడ్డినే ఉత్తరాంధ్రకు పంపింది వైసీపీ హైకమాండ్. పార్టీ అధిష్టానం ప్రతినిధిగా స్థానికంగా శ్రేణుల్ని సమన్వయ పరుస్తూ దాదాపు ఏడాది నుంచి ఉత్తరాంధ్రలో చురుగ్గా తిరుగుతున్నారు వైవీ సుబ్బారెడ్డి. ఈసారి ఎన్నికల్లో పోటీలో లేకపోయినా.. ఉత్తరాంధ్రలో పార్టీ గెలుపు బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు వైవీ సుబ్బారెడ్డి.
ఇదే గ్యాప్‌లో ఉత్తరాంధ్ర వైపు చూసిన మరో సీమ నేత సీఎం రమేశ్. బీజేపీ రాజ్యసభ ఎంపీగా ఉన్నప్పటికీ… ఆయన మనసంతా విశాఖ మీదే ఉండేది. ఎంపీగా పోటీ చేయాలనేది ఆయనకున్న బలమైన ఆకాంక్ష. అప్పుడప్పుడూ స్పెషల్ ఫ్లయిటేసుకుని వైజాగ్ వచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. కానీ.. జీవీఎల్ నుంచి బలమైన పోటీ ఎదురవడం, టీడీపీ నేత భరత్ పట్టుబట్టడంతో.. సీఎం రమేశ్‌కి విశాఖ ఎంపీ సీటు మిస్సయింది. కానీ.. కూటమి అభ్యర్థిగా అనకాపల్లి ఎంపీగా రేసులో ఉన్నారు సీఎం రమేష్.
విశాఖ మెట్రో సిటీ కనుక అక్కడ సామాజిక వర్గాలతో సంబంధం లేదు. అనకాపల్లి ఎంపీ సీటు ఎక్కువగా రూరల్ కవరేజ్ కనుక అక్కడ కులసమీకరణాలే కీలకం. అనకాపల్లిలో తూర్పుకాపుల తర్వాత అతి పెద్ద సామాజికవర్గం వెలమ. తను కూడా వెలమే కనుక.. 3 లక్షల వెలమ ఓట్లున్న అనకాపల్లినే ఎంచుకున్నారు సీఎం రమేష్. పైగా.. స్థానిక నేతలు బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు, గవిరెడ్డి రామానాయుడు లాంటి వెలమ కులస్థులతో సీఎం రమేశ్‌కి సన్నిహిత సంబంధాలున్నాయి. అందుకే.. అనకాపల్లిలో సీఎం రమేశ్ గెలుపు ఖాయమేనన్న క్లారిటీతో ఉంది విపక్ష కూటమి.
సరిగ్గా ఇక్కడే.. సీఎం రమేశ్ దూకుడును అడ్డుకోడానికి రంగంలో దిగారు వైవీ సుబ్బారెడ్డి. బీసీలకు అడ్డాగా ఉన్న ఉత్తరాంధ్రలో బీసీలకు ఇవ్వకుండా ఓసీకి, పైగా నాన్‌లోకల్‌కి టికెట్ ఇచ్చారంటూ సీఎం రమేష్ టార్గెట్‌గా కొత్త నినాదం తీసుకొచ్చారు వైవీ. నేను నాన్ లోకలైతే.. వైవీ సుబ్బారెడ్డి ఏంటి.. అనేది అట్నుంచి వస్తున్న రివర్స్ ఎటాక్. ఆర్థికంగా స్థితిమంతుడు కనుక.. సీఎం రమేశ్ హవాను తెగ్గొట్టడానికి తమ వ్యూహానికి మరింత పదును పెట్టక తప్పలేదు వైసీపీకి. అందులో భాగమే.. అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగిన బూడి ముత్యాలనాయుడు. మా వోడు బీసీ వెలమ.. పైగా లోకల్ వెలమ. మీ వోడు ఆర్థికంగా బలమైన వెలమ.. మావోడు సామాన్య వెలమ.. అంటూ తమ అభ్యర్థితో కౌంటర్ స్ట్రాటజీ మొదలుపెట్టారు వైవీ సుబ్బారెడ్డి. అసలు సీఎం రమేష్ తమకు పోటీనే కాదనేది ఆయన వెర్షన్.
ఇప్పటికే అనకాపల్లిలో మకాం పెట్టేశారు సీఎం రమేశ్. సింహాచలం నుంచి రోడ్‌షో ద్వారా వచ్చిన ఎంపీ అభ్యర్థికి కూటమి పార్టీల క్యాడర్ బ్రహ్మరథం పట్టింది. మొదట్లో కొణతాల రామకృష్ణ.. తర్వాత కొణిదెల నాగబాబు.. ఆ తర్వాత పవన్‌కల్యాణ్.. ఇన్ని పేర్లు మారాక తన చేతికి చిక్కిన అనకాపల్లి ఎంపీ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు సీఎం రమేశ్. గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు కుడిభుజంగా వ్యవహరించిన రాయలసీమ నేత సీఎం రమేశ్. ఇప్పుడు ఉత్తరాంధ్ర వైపు ఫేస్ టర్న్ ఇచ్చుకోవడం ఒక నాటకీయ పరిణామం. ఇక్కడ మరో సీమ నేత వైవీ సుబ్బారెడ్డితో వ్యూహాత్మక పోరాటం చేయాల్సి రావడం మరో ఇంట్రస్టింగ్ విషయం. ఇలా ఇద్దరు సీమ లీడర్ల మధ్య జరిగే ప్రచ్ఛన్న యుద్ధానికి ఉత్తరాంధ్ర కేరాఫ్ కావడం సిసలైన కొసమెరుపు.