ఢిల్లీలో గణతంత్రదినోత్సవ వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్‌డే రిహార్సల్ అదిరిపోయింది. త్రివిధ దళాలకు చెందిన జవాన్లు ఈ రిహార్సల్‌లో పాల్గొన్నారు. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన మిస్సైళ్లను ఈసారి రిపబ్లిక్‌డే వేడుకల్లో ప్రదర్శిస్తున్నారు. రిహార్సల్‌లో భాగంగా ఆర్మీ హెలికాప్టర్లు, యుద్ద విమానాల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి. రిపబ్లిక్‌డే వేడుకల కోసం కర్తవ్యపథ్‌ను అందంగా తీర్చిదిద్దారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎప్పటిలాగే ఈసారి కూడా రిపబ్లిక్ పరేడ్ కన్నుల పండువగా జరగబోతోంది. ఈ సారి దక్షిణ భారతదేశం నుంచి ఆంధ్రప్రదేశ్, కేరళ, తమిళనాడు, రాష్ట్రాలకు అవకాశం కల్పించారు.
రిపబ్లిక్‌డే వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రబలతీర్ధం శకటాన్ని ప్రదర్శిస్తున్నారు. కోనసీమ జిల్లాల్లో మాత్రమే కన్పించే విశిష్ట సంస్కృతిని ఈసారి ఢిల్లీలో రిపబ్లిక్ డే వేళ ప్రదర్శిస్తున్నారు. మొత్తం 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శకటాలను ఈసారి ప్రదర్శిస్తున్నారు. ఈ ఏడాది వేడుకల్లో తొలిసారిగా దర్యాప్తు సంస్థల శకటాలకు కూడా అనుమతి ఇచ్చారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) శకటాన్ని వేడుకల్లో ప్రదర్శిస్తున్నారు.
కోనసీమలో జరిగే ప్రబల తీర్థం థీమ్‌తో ఏపీ శకటంను రెడీ చేశారు. కోనసీమ జిల్లాలో 450 ఏళ్లుగా కొనసాగుతోంది ప్రబల తీర్థం సంస్కృతి. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభల తీర్థం ఎంపికవడం తమకు చాలా గర్వంగా ఉందని కళాకారులంటున్నారు. ఈ అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు . ప్రభల తీర్థం విశిష్టత గురించి తాము రాసిన లేఖకు ప్రధాని బదులిచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. అయితే ఈ ఏడాది రాష్ట్రాల సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో శకటాలను ప్రదర్శిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం