
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సిద్ధమైంది. ఇప్పటికే తొలి దశలో 100 అర్బన్ లోకల్ బాడీలకు ఎన్నికలు నిర్వహించగా.. పెండింగ్లో ఉన్న మరో 23 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేత వెల్లడించారు. ఈ మేరకు నిర్వహించిన మీడియా సమావేశంలో ఎన్నికల షెడ్యూల్తో పాటు ఏర్పాట్లు, భద్రతా చర్యలు, ఓటింగ్ శాతంపై కీలక వివరాలు వెల్లడించారు.
శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్లతో పాటు మరో 19 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. అర్బన్ లోకల్ బాడీల పరిధిలో నవంబర్ 14 నుంచి 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 17న నామినేషన్ల పరిశీలన, 19న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పిస్తారు. నవంబర్ 26న పోలింగ్ నిర్వహించి.. 30వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ప్రాంతాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని SEC స్పష్టం చేశారు.
మరోవైపు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశకు రేపు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తొలి దశలో నవంబర్ 26న, రెండో దశలో నవంబర్ 29న, మూడో దశలో డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. ప్రతి దశలోనూ పోలింగ్ ముగిసిన రోజే ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని అనిల్ చంద్ర పునేత తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా జరిగేలా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నామినేషన్ల స్వీకరణ నుంచి ఓట్ల లెక్కింపు వరకు సీసీ కెమెరాల పర్యవేక్షణ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నామినేషన్లు దాఖలు చేసే బాధ్యత పూర్తిగా జిల్లా యంత్రాంగానిదేనని స్పష్టం చేశారు. సున్నిత ప్రాంతాల్లో పోలీసుల భద్రత నడుమ నామినేషన్లు స్వీకరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఎన్నికల కోసం నాలుగు నెలల ముందుగానే అవసరమైన ఏర్పాట్లు ప్రారంభించామని, పోలింగ్ కేంద్రాల నుంచి కౌంటింగ్ కేంద్రాల వరకు పటిష్ట భద్రత కల్పిస్తామని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రాంతాల్లోనూ స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల సమయంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ నెల 14న ఆయా జిల్లాల ఎస్పీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
MPTC, ZPTC ఎన్నికల నిర్వహణకు కూడా SEC తరఫున వంద శాతం ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. రాజకీయ పార్టీలు, పోటీలో నిలిచే అభ్యర్థుల నుంచి పూర్తి సహకారం లభిస్తోందన్నారు.
ఇక విశాఖపట్నంలో ఓట్ల పెరుగుదలపై వచ్చిన వివాదంపై స్పందించిన SEC.. పోలింగ్ స్టేషన్ వారీగా ఓటింగ్ వివరాలను ఇప్పటికే వెల్లడించామని తెలిపారు. ప్రతి ఓటును పరిశీలించి, చెల్లుబాటయ్యే ఓట్ల ఆధారంగానే తుది ఓటింగ్ శాతాన్ని ప్రకటించామని స్పష్టం చేశారు. గత స్థానిక సంస్థల ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో ఓటింగ్ శాతం పెరిగిందని అనిల్ చంద్ర పునేత వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..