అమరావతిలో ఆర్ -5 జోన్ ఏర్పాటుపై ఏపీ హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. రాజధానిలో ఇతర ప్రాంతాల వారికి స్థలాలు ఇచ్చేందుకు ఆర్ -5 జోన్ ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం. ఈ మేరకు గవర్నర్ ద్వారా గెజిట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్‌పై రైతులు హైకోర్టులో సవాల్ చేశారు. రాజధాని రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. అలాగే, అమరావతి రైతుల తరపున మరో లాయర్ కారుమంచి ఇంద్రనీల్ మరో పిటిషన్ వేశారు. పిటిషన్ ను స్వీకరించిన న్యాయస్థానం ఇవాళ్టికి వాయిదా వేసింది. దీంతో ఇవాళ ఆర్ -5 జోన్ ఏర్పాటుపై మరోసారి విచారణ జరగనుంది.
సీఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనల మేరకు ఆర్ -5 జోన్ పేరిట పేదల ఇళ్ల కోసం ప్రత్యేక జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రాజధానిలోని 5 గ్రామాల పరిధిలోని 900.97 ఎకరాలను పేదల ఇళ్ల కోసం జోనింగ్ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. మంగళగిరి మండలంలోని కృష్ణాయాపాలెం, నిడమర్రు, కురగల్లు గ్రామాల్లో .. తుళ్లురు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల్లో ఆర్ -5 జోనింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పు చేర్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
జోనింగ్ లో మార్పు చేర్పులపై అభ్యంతరాలు, సూచనలు సలహాలు 15 రోజుల్లోగా తెలియచేయాలని స్పష్టం చేసింది. అక్టోబరు 28 తేదీ నుంచి నవంబరు 11 తేదీ వరకూ 15 రోజుల పాటు సీఆర్డీఏకి అభ్యంతరాలుంటే చెప్పాలని సర్కార్ సూచించింది. దీంతో ఇవాళ్టి నుంచి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ప్రభుత్వం. మందడం, లింగాయపాలెంలో అధికారులు గ్రామ సభలు సైతం నిర్వహించనున్నారు. ఈ క్రమంలో R5 జోన్ ఏర్పాటుపై (CRDA) సీఆర్డీఏకు మహిళా రైతులు గురువారం ఫిర్యాదు చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..