ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఓటర్లకు ఇక ఎడమ చేతి చిటికెన వేలికే సిరా గుర్తు.. ఎందుకంటే?
Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సిరా గుర్తు వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చూపుడు వేలికి సిరా గుర్తు వేసిన నేపథ్యంలో.. ఈసారి ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని ఆదేశించింది.

AP Gram Panchayat Elections: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు సిరా గుర్తు వేసే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని ఆదేశించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఓటర్ల చూపుడు వేలికి సిరా గుర్తు వేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో వేసిన సిరా గుర్తు ఇంకా ఓటర్ల వేళ్లపై కనిపించే అవకాశం ఉంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మార్పు చేసింది. ఓటర్లు ఇప్పటికే చూపుడు వేలిపై సిరా గుర్తు కలిగి ఉండే అవకాశం ఉన్నందున, మరో వేలికి గుర్తు వేయాలని స్పష్టం చేసింది.
ఈ మేరకు మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చిటికెన వేలికి సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 26న తొలి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత ఎన్నికలు జరగనున్నాయి.
ఈ ఆదేశాలను తప్పనిసరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, రిటర్నింగ్ అధికారులకు రాష్ట్ర ఎన్నికల సంఘం సూచించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకతను పాటిస్తూ, ఒకే వ్యక్తి రెండుసార్లు ఓటు వేయకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ నెల 17న సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 21న ఉపసంహరణకు గడువు ముగియనుంది. ఈనెల 26న పోలింగ్ నిర్వహించి, అదేరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అవసరమైతే 27న రీపోలింగ్ నిర్వహించనున్నారు.
