AP News: ఇదెక్కడి మోసం రా మావా..చీర పేరుతో..

| Edited By: Velpula Bharath Rao

Oct 22, 2024 | 1:18 PM

గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చీర పేరుతో కేటుగాడు మోసం చేశాడు. అన్ని పథకాలు అందుతున్నాయా అంటూ అందినకాడికి కేటుగాడు దండుకున్నాడు. చివరికి ఏం జరిగింతో మీరే చూడండి..!

AP News: ఇదెక్కడి మోసం రా మావా..చీర పేరుతో..
Cheated An Old Man
Follow us on

గుంటూరులో రోజుకో మోసం వెలుగు చూస్తుంది. తాజాగా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మోసం జరిగింది. గుంటూరు నగరంలోని ఆశోక్ నగర్‌లో చెరుకూరి రమణ అనే వృద్ధురాలు ఒక్కరే ఆ ఇంటిలో నివసిస్తున్నారు. ఆమె పిల్లలు అమెరికాలో ఉంటారు. ఒక యువకుడు స్కూటీపై రమణ ఇంటి వద్దకు వచ్చాడు. రమణ ఒక్కరే ఉన్న విషయం తెలుసుకున్న యువకుడు మీకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా అంటూ వివరాలు అడగటం మొదలు పెట్టాడు. ఆ తర్వాత చంద్రబాబు ప్రిడ్జ్, వాషింగ్ మెషీన్, మిక్సీ ఇస్తున్నారని ఇందుకోసం పసుపు చీర కట్టుకొని ఫోటో దిగాలని చెప్పాడు. అంతేకాకుండా ఒక ఇరవై వేల రూపాయలు డబ్బులు కూడా పట్టుకొని ఉన్నట్లు ఫోటో తీయాలని చెప్పాడు. దీంతో ఆమె పసుపు చీర ధరించి రావడమే కాకుండా, యాభై వేల రూపాయల కట్టల డబ్బులు తీసుకొని వచ్చింది. వెంటనే అతను డబ్బులతో పాటు ఎర్ర చీర కూడా కావాలని చెప్పడంతో ఆమె రెండు నోట్ల కట్టలను అక్కడే ఉన్న టేబుల్ పై పెట్టి ఎర్ర చీర కోసం లోపలికి వెళ్లింది. వెంటనే ఆ యువకుడు ఆ నోట్ల కట్టలను తీసుకొని ఇంటిలోని బయటకు వచ్చి స్కూటీపై వెళ్లిపోయాడు.

గదిలోని బయటకు వచ్చిన రమణ ఆ యువకుడి కోసం వెదికినా కనిపించలేదు. డబ్బులు కట్టలు కూడా లేకపోవడంతో తాను మోసపోయినట్లు గుర్తించి పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి కోసం సీసీ కెమెరా విజువల్స్‌ను పరిశీలించారు. అయితే ప్రభుత్వ పథకాల పేరుతో అక్కడక్కడ మోసాలకు పాల్పడుతున్నారని ఆగంతకులు ఎవరైనా వస్తే వారి మాటలు నమ్మి మోసపోవద్దని పట్టాభిపురం సీఐ వీరేంద్ర కుమార్ సూచించారు. అదే విధంగా బంగారు ఆభరణాలు మెరుగు పడతామంటూ కూడా కొంతమంది వస్తున్నారని వారి మాటలు నమ్మవద్దన్నారు. అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫోన్ చేయాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..