అమెరికా అధ్యక్షపదవికి క్రమంగా ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఓటర్లను, ముఖ్యంగా యువతను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. దేశంలో కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడంలో ఈయన ప్రభుత్వం విఫలమైందని డెమొక్రాట్లతో బాటు అనేకమంది విమర్శిస్తుండగా.. డ్యామేజీ కంట్రోల్ కి ట్రంప్ శ్రీకారం చుట్టారు. యువతకు ఉద్యోగాల కల్పనతో బాటు నిరుద్యోగులకు వారానికి 400 డాలర్ల భృతిని, విద్యార్థులకు రుణాన్ని ఇచ్చేందుకు ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఆర్దర్లపై ఆయన సంతకాలు చేశారు. ఈ సొమ్మును వారికి సాధ్యమైనంత త్వరగా పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.
న్యూజెర్సీలోని గోల్ఫ్ క్లబ్ బాల్ రూమ్ లో ఆయన ఈ పత్రాలపై సంతకాలు చేయడం విశేషం. అలాగే ఏడాదికి లక్ష డాలర్ల కన్నా తక్కువ ఆదాయం పొందుతున్నవారికి ‘పే రోల్ టాక్స్ హాలిడే’ ని కూడా ఆయన ప్రకటించారు. అయితే అమెరికన్ల సమస్యలను సజావుగా పరిష్కరించేబదులు.. ట్రంప్ గోల్ఫ్ కోర్సులో.. బలహీనమైన, పని చేయని ఇలాంటి పాలసీని ప్రకటించడం వల్ల ఫలితం లేదని చక్ షమర్ వంటి సెనేటర్లు దుయ్యబడుతున్నారు.