వారం రోజులపాటు అమెరికాలో పర్యటించి అనేకమంది దేశాధినేతలతో మంతనాలు జరిపి ఇండియా తిరిగి వచ్చిన ప్రధాని మోదీ అంతా బాగుందని సెలవిచ్చేసారు. ఈ ప్రకటన ఒక్కసారిగా పదిహేనేళ్ల క్రితం 2004 లో ఎన్నికలకు వెళ్లే ముందు అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి చేసిన ప్రకటన గుర్తొచ్చింది. అంతా బాగుందంటూ అప్పట్లో అయన ఎన్నికలకు వెళ్లి బొక్క బోల్తా పడ్డారు. ఇపుడు కాశ్మీర్ విభజన తర్వాత మోదీ విదేశాల మద్దతు కూడగద్దంలో విజయవంతం కావచ్చు గాక, […]
Follow us on
వారం రోజులపాటు అమెరికాలో పర్యటించి అనేకమంది దేశాధినేతలతో మంతనాలు జరిపి ఇండియా తిరిగి వచ్చిన ప్రధాని మోదీ అంతా బాగుందని సెలవిచ్చేసారు. ఈ ప్రకటన ఒక్కసారిగా పదిహేనేళ్ల క్రితం 2004 లో ఎన్నికలకు వెళ్లే ముందు అప్పటి ప్రధాని అటల్ బిహారి వాజ్ పేయి చేసిన ప్రకటన గుర్తొచ్చింది. అంతా బాగుందంటూ అప్పట్లో అయన ఎన్నికలకు వెళ్లి బొక్క బోల్తా పడ్డారు. ఇపుడు కాశ్మీర్ విభజన తర్వాత మోదీ విదేశాల మద్దతు కూడగద్దంలో విజయవంతం కావచ్చు గాక, కానీ కశ్మీర్ లో పరిస్థితి అంతా బాగుందని తనకు తానే చెప్పుకోవడం ఒకింత ఆశ్చర్యానికి గురిచేయక మానదు.
ప్రధాని స్వయంగా తొమ్మిదవ శిఖరాగ్ర సమావేశాలలో పాల్గొన్నారు. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన రెండోసారి ప్రసంగించారు. ఒక విధంగా చూస్తే మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వలే తనకు ఒక అంతర్జాతీయ నేతగా గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఎక్కువగా ఆరాట పడినట్లు కనిపిస్తున్నది. దౌత్య నీతిలో బహిరంగ సమావేశాలకు, అధినేతల కౌగిలింతలు, ఫోటో సమావేశాలకు చెప్పుకోదగిన ప్రాధాన్యత ఉండదు. వ్యూహాత్మకంగా వేసే అడుగులే అద్భుత ఫలితాలు ఇస్తాయి.
ఐక్యరాజ్యసమితిలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సహనం కోల్పోయి పూనకం వచ్చిన్నట్లు ఊగిపోతూ భారత్ పై విషం విరజిమ్ముతూ చేసిన ప్రసంగం చూస్తుంటే నేడు ప్రపంచంలో ఆ దేశం ఏకాకిగా మిగిలిన్నట్లు స్పష్టం అవుతుంది. అందుకు బలమైన పునాది వేసినది మాజీ విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్. భారత్ – అమెరికా మధ్య సంబంధాలు ఏర్పరచడం కోసం అహర్నిశలు కృషి చేసింది కూడా ఆయనే. ఆ ఫలితాలు ఇప్పుడు ఆచరణలో కనిపిస్తున్నాయి. అంతకు ముందు అమెరికా పాకిస్థాన్‌కు మిత్రదేశం. భారత్ కు శత్రుదేశం కాకపోయినా వ్యతిరేకంగా ఉంటూ వచ్చేది. రష్యాతో సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికాతో స్నేహం పెంపొందించడం కోసం జస్వంత్ సింగ్ చేసిన కృషి చరిత్రాత్మకమైనది. స్వతంత్ర భారత్ దేశ చరిత్రలో అత్యంత సమర్ధవంతంగా, ప్రభావంతంగా పని చేసిన విదేశాంగ మంత్రిగా ఆయనను పేర్కొనవచ్చు. ఈ ఫలితాలను భారత్‌కు అనుకూలంగా మార్చుకొనే ప్రయత్నం నేడు జరగాలి.
మోడీ అమెరికా పర్యటనలో హ్యూస్టన్‌లో జరిగిన ‘హౌడీ మోడీ’కు విశేష ప్రాధాన్యత కల్పించారు. ఈ కార్యక్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సహితం పాల్గొనడం ఒక విధంగా నూతన చరిత్ర సృస్టించిన్నట్లు అయింది. మరో దేశాధినేత ప్రసంగించే సభలో అమెరికా అధ్యక్షుడు పాల్గొనడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. ఇప్పుడు మోడీ- ట్రంప్‌లు ఎంతో సన్నిహిత మిత్రులు అన్నట్లు ప్రచారం జరుగుతున్నది.
మోడీ అమెరికా పర్యటనలో ఉండగానే ట్రంప్ ఇమ్రాన్ ఖాన్ తో మంతనాలు జరపడం, పాకిస్థాన్, భారత్ కలసి కోరుకొంటే తాను మధ్యవర్తిత్వం జరుపుతానని పదే పదే పేర్కొనడం ఈ సందర్భంగా గమనార్హం. ఈ అంశాన్ని ప్రధాని మోడీతో సమావేశమైనప్పుడు మాత్రం ప్రస్తావించ లేదు. కశ్మీర్ విషయం మోడీ చూసుకొంటారులే అన్నట్లు చెప్పుకొంటూ వచ్చారు. అంటే కశ్మీర్, పాకిస్థాన్ అంశాలపై ట్రంప్ ద్వంద వైఖరి అవలంబిస్తున్నట్లు స్పష్టం అవుతుంది. మరో వంక భారత్ పై వాణిజ్యపర ఆంక్షలను తొలగించే ప్రస్తావనే తీసుకు రాలేదు. అంతర్జాతీయంగా అత్యధికంగా ద్వేష భావనకు గురైన అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పేరొందారు. ఆయన ఎప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకొంటారో, ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో ఎవ్వరూ చెప్పలేరు. ప్రపంచంలో ఆయనకు నమ్మకస్థులుగా పేరొందిన ఇద్దరు, ముగ్గురు దేశాధినేతలు నిరంకుశ ప్రభుత్వాలు నడుపుతున్నవారే కావడం గమనార్హం.
ఈ సందర్భంగా మోడీని ‘జాతిపిత’ అంటూ ట్రంప్ పొగడ్తలతో ముంచెత్తడంతో సంబరపడిపోతున్న బిజెపి నేతలు సైద్ధాంతికంగా తమకు జరుగబోయే నష్టం గురించి ఆలోచించడం లేదు. వేల సంవత్సరాల ప్రాచీన సంస్కృతి, అస్తిత్వం కలిగిన భారత్ ను మహాత్మా గాంధీని ‘జాతిపిత’గా భావించడం పట్లనే సంఘ్ పరివార్‌లో తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అటువంటిది ఒక రాజకీయవేత్త అయిన మోడీని ‘జాతిపిత’ అంటూ భావించడం సాధ్యం కాదు.
పరిస్థితి అంతా బాగుందని అధినేతలు తమకు తాము చెప్పుకుని, తమ భుజాలు తామే చరచుకోవడం వాళ్ళ నిజంగానే అంతా బాగైపోదు. అధినేతలు మాట్లాడేప్పుడు గ్రౌండ్ లెవెల్ పరిస్థితిని ప్రతిబింబించేలా మాట్లాడితే తమపై వున్న విశ్వసనీయత మరింత పెరుగుతుంది.. లేకపోతే వాపును చూసి బలుపు అనుకున్న విధంగా తప్పుడు ప్రకటనలు చేస్తే భవిష్యత్తులో బొక్క బోర్లా పాడడం ఖాయం. ఈ విషయం మోదీ-అమిత్ షా ద్వయం గ్రహిస్తారని అనుకుందాం.