మన అత్యంత ప్రియనేస్తం రేడియో! మన ఆనంద విషాదాల్లో పాలు పంచుకునే చుట్టం రేడియో!

|

Feb 13, 2021 | 3:16 PM

ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం.. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు. సంతోష సమయంలో అదే తోడు! సమాచారానికి అదే చేదోడు!

మన అత్యంత ప్రియనేస్తం రేడియో! మన ఆనంద విషాదాల్లో పాలు పంచుకునే చుట్టం రేడియో!
Follow us on

ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగం.. కలత చెందిన మనసుకు అదే ఓదార్పు. సంతోష సమయంలో అదే తోడు! సమాచారానికి అదే చేదోడు! కబుర్లు చెప్పే నెచ్చెలి అదే! ఇప్పటి తరానికి రేడియోతో అంత గొప్ప అనుభవాలు ఉండకపోవచ్చు కానీ, అప్పుట్లో రేడియోరనే సమస్తం! పొద్దున్నే సిగ్నేచర్‌ ట్యూన్‌ సుప్రభాతం అయ్యేది.. మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమంతో పొద్దుపుచ్చేది! సాయంత్రం జనరంజకంగా పలకరించేది.. రాత్రి మనసును ఆహ్లాదపరచి నిద్రపుచ్చేది.. రేడియోతో ఉన్న సౌలభ్యమేమిటంటే అది మన రోజువారి పనులను చెడగొట్టేది కాదు.. పాటలో, కబర్లో వింటూనే పనులు చేసుకునేవారు! అందుకే రేడియో అంత పాపులరయ్యింది.. ఇవాళ ప్రపంచ రేడియో దినోత్సవం కాబట్టి రేడియో గురించి కాసింత తెలుసుకుందాం! ఇవాళ్టికీ రేడియోనే వినోదసాధనం! ప్రపంచ జనాభాలో 95 శాతానికి పైగా ప్రజలు రేడియోను వినియోగిస్తున్నారంటే నమ్మి తీరాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించి 75 శాతం మందికి పైగా గృహిణులు వివిధ అంశాల సమాచారం కోసం రేడియోపై ఆధార పడుతున్నారన్నది పచ్చి నిజం! ఎవరండీ రేడియోకు క్రేజ్‌ తగ్గిందన్నది! ఎవరండీ రేడియోను పాతచింతకాయ పచ్చడన్నది! రేడియో ఎవర్‌గ్రీన్‌! ఈనాటికి ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌ పేరిట దేశ ప్రజలతో తన మనసులో మాటలను, అభిప్రాయాలను షేర్‌ చేసుకుంటున్నారంటేనే రేడియో ఎంత గొప్ప మాధ్యమమో తెలిసిపోతున్నది.మన దేశంలో 1923 జూన్‌లో మొదటిసారిగా రేడియో క్లబ్‌ ఆఫ్‌ బొంబాయి ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. నాటి వైస్రాయ్‌ లార్డ్‌ ఇర్విన్‌ చేతుల మీదుగా ప్రారంభమైన రేడియో ఆ తర్వాత ఇంటింటికి చేరింది.. ఆ తర్వాత బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీ ఏర్పాటయ్యింది. ఇది భారత ప్రభుత్వం కిందే పని చేసేది.. 1927 జులైలో ప్రయోగాత్మకంగా కోల్‌కతా, ముంబాయి నగరాలలో ఈ కంపెనీ ప్రసారాలు చేసింది.. 1936లో ఆకాశవాణి ప్రభుత్వ సంస్థగా ఏర్పడింది. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి కోల్‌కతా, ఢిల్లీ, ముంబాయి, మద్రాస్‌, లక్నో, తిరుచిరాపల్లిలో మాత్రమే ఆకాశవాణి కేంద్రాలుండేవి.. మరి ఇప్పుడో వందలకు చేరాయి.. 1938లో మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో తెలుగు కార్యక్రమాలు ప్రారంభమైనప్పుడు మొదటి మహిళా అనౌన్సర్‌ శ్రీమతి పున్నావజ్జుల భానుమతి. ఈమెను రేడియో భానుమతి అని అనేవారు. అంటే తెలుగువారి తొలి రేడియో ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రమే అన్నమాట! ఈమె కూతురు జ్యోత్స్న కూడా రేడియో అనౌన్సర్‌గా శ్రోతల మన్ననలను అందుకున్నారు. రేడియో ఎంతో మంది కళాకారులను పరిచయం చేసింది.. ఎంతోమంది రచయితలకు పురుడుపోసింది. ఎంతో మందికి అన్నం పెట్టింది. ఎంతో మందిని అక్కున చేర్చుకుంది.. అప్పట్లో రేడియో వ్యాఖ్యాతలు మన బంధువుల్లా అనిపించేవారు.
రేడియో కేవలం వినోదసాధనమే కాదు.. అది స్వాతంత్ర కాంక్షను కూడా రగిలించింది.. మన దగ్గర భాగ్యనగర్‌ రేడియో నిజాం ప్రభువుకు వ్యతిరేకంగా ప్రజలను ఎంతగా జాగృతపరిచిందో.. నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ నడిపిన ఆజాద్‌ హింద్ రేడియో, రామ్‌మనోహర్‌ లోహియా ఆధ్వర్యంలో నడిచిన ఆజాద్‌ రేడియోలు బ్రిటిష్‌వారికి అంతగా ముచ్చెమటలు పట్టించాయి.. రేడియోకు అంత శక్తి ఉంది..ఇక చరిత్రలోకి వెళితే… 1893 మార్కొని మొదటిసారిగా సెయింట్‌ ‌లూయిస్‌ ‌మిస్సోరిలో వైర్‌లైస్‌ ‌రేడియో ప్రసారాలను ప్రారంభించినప్పుడు లోకం నివ్వరపోయింది.. 1896లో ఇంగ్లాండ్‌ ‌వైర్‌లైస్‌ ‌పెటెంట్‌ ‌హక్కులను పొందింది. ఆ తర్వాత రేడియో అంతకంతకూ వ్యాప్తి చెందింది. .ఐక్యరాజ్యసమితి రేడియో 1946 ఫిభ్రవరి 13న ప్రారంభమైంది. 2012 నుంచి ఆ తేదీన ప్రపంచ రేడియో దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇక హైదరాబాద్‌లో 1935లోనే రేడియో ప్రసారాలు మొదలయ్యాయి.. మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ ప్రారంభించిన ఆ దక్కన్‌ రేడియోలో ప్రభుత్వ సమాచారంతో పాటు సంగీత కార్యక్రమాలు కూడా ప్రసారం అయ్యేవి.. 1957 అక్టోబర్‌ రెండున వివిధ భారతి మొదలయ్యింది.. ప్రస్తుతం మన దేశంలో నాలుగు వందలకు పైగా రేడియో స్టేషన్లు ఉన్నాయి..

మరిన్ని చదవండి ఇక్కడ: ఈ దేశానికి ప్రమాదకరమైన వ్యక్తి,, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫైర్

మరిన్ని చదవండి ఇక్కడ: మారేడుమిల్లి ఏజెన్సీ ఏరియాలో అడవిపిల్లి హల్చల్, చిరుతపులి అనుకొని బిత్తరపోయిన జనం