అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు మరికొన్ని గంటల్లో ముగియబోతోంది. డెమొక్రాట్ల అభ్యర్థి, ఉపాధ్యక్షురాలు కమలాహారిస్, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అత్యంత హోరాహోరీగా తలపడుతున్నారు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో ఎవరూ కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే.. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీల్లో ఏదో ఒకదానికి స్పష్టంగా మద్దతిచ్చేవే కావడంతో వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. ప్రతి అధ్యక్ష ఎన్నికల్లోనూ సదరు రాష్ట్రాలను ఆయా పార్టీలే గెలుచుకుంటాయి. ఎటూ తేల్చుకోని ఓటర్లు ఎక్కువగా ఉండే కొన్ని రాష్ట్రాలపై పోటీ ఆధారపడడంతో స్వింగ్ స్టేట్స్‌గా మారాయి. నువ్వా? నేనా? అనేలా పోటీ ఉండే స్వింగ్ స్టేట్స్ అమెరికాలో ఏడున్నాయి. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, మిషిగన్, నార్త్ కరోలినా, జార్జియా, నెవడా, అరిజోనా.. ఈ ఏడు రాష్ట్రాల్లో 93 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. వీటిలో మెజారిటీ ఓట్లను సాధించినవారే అమెరికా అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకుంటారు.
వాస్తవానికి.. అమెరికాలో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లున్నాయి. గెలవడానికి మ్యాజిక్ ఫిగర్ 270 ఓట్లు.. అయితే.. సేఫ్ స్టేట్లన్నీ ఈసారి కూడా ఆయా పార్టీల ఖాతాల్లోనే పడే అవకాశం ఉండడంతో ఆ లెక్కన కమలా హారిస్‌కు 226 ఓట్లు సాధిస్తారు. ట్రంప్‌కు మాత్రం 219 ఓట్లే వస్తాయి. దాంతో.. స్వింగ్ స్టేట్లలోని 93 ఓట్లు అత్యంత కీలకంగా మారాయి. ట్రంప్ గెలవాలంటే ఆ 93లో కనీసం 51 ఓట్లు సాధించాలి. హారిస్‌కు మాత్రం 44 ఓట్లు సరిపోతాయి. అలాగే.. 19 ఎలక్టోరల్ ఓట్లున్న పెన్సిల్వేనియా ఈసారి మొత్తం అమెరికా దృష్టినీ ఆకర్షిస్తోంది. అక్కడ నెగ్గిన అభ్యర్థే అధ్యక్షుడయ్యే అవకాశం 90 శాతం వరకూ ఉండడంతో పెన్సిల్వేనియాలో హారిస్, ట్రంప్ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది.
ఇక.. అమెరికా నిర్మాణ రంగంలో ప్రముఖ పాత్ర పోషించే రస్ట్ బెల్ట్ రాష్ట్రాలైన విస్కాన్సిన్, మిషిగాన్, పెన్సిల్వేనియాలు కూడా కీలకంగా మారాయి. కార్మిక సంఘాలకు పట్టు ఉండే ఈ మూడు రాష్ట్రాల్లో మొత్తం 44 ఓట్లున్నాయి. ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉండే సన్ బెల్ట్ రాష్ట్రాలైన నెవడా, అరిజోనా, నార్త్ కరోలినా, జార్జియాలో మొత్తం 49 ఓట్లున్నాయి. రస్ట్ బెల్ట్ రాష్ట్రాలపై దశాబ్దాలుగా డెమోక్రాట్లదే ఆధిపత్యం. ఈసారి కూడా అదే జరిగితే 44 ఓట్లు కమలా హారిస్ ఖాతాలో పడతాయి. ఒకవేళ ట్రంప్ 3 స్టేట్స్‌లో గెలిచినా.. విజయానికి మరో 7 ఓట్ల దూరంలో నిలుస్తారు. అప్పుడు మరో స్వింగ్ స్టేట్‌ని గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ హారిస్.. రస్ట్ బెల్ట్ రాష్ట్రాల్లో కీలకమైన పెన్సిల్వేనియాతో పాటు మరోదాన్ని దక్కించుకున్నా ఆమె విజయావకాశాలు మెరుగ్గానే ఉంటాయి. మిగతా నాలుగు స్వింగ్ స్టేట్లలో ఏ ఒక్కదాన్ని నెగ్గినా కమలా హారిస్ గెలిచినట్టే. ట్రంప్ గెలవాలంటే మాత్రం ఆ నాలుగింటినీ స్వీప్ చేయాల్సి ఉంటుంది. రిపబ్లికన్లకు సన్ బెల్ట్‌ను క్లీన్‌స్వీప్ చేసిన చరిత్ర ఉండడంతో.. రస్ట్ బెల్ట్ నుంచి కనీసం ఒక్క రాష్ట్రాన్నైనా ట్రంప్ చేజిక్కించుకోవాల్సి ఉంటుంది. లేని పక్షంలో ఆయనకు ఇబ్బంది తప్పదనే అంచనాలూ ఉన్నాయి.
వాస్తవానికి అమెరికా ఎన్నికలు.. ప్రతిసారి నవంబర్ మాసం తొలి మంగళవారం జరుగుతాయి.. మొదటినుంచి ఇదే సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది..
ఇదిలావుంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల హోరాహోరీ పోరులో తెలుగువారి ఓట్లు కూడా కీలకంగా మారాయి. దాంతో.. ఆయా పార్టీల ముందు తెలుగువారు కూడా కొన్ని డిమాండ్లు పెడుతున్నారు. ఇమ్మిగ్రేషన్, టెక్ ఇండస్ట్రీని ప్రభావితం చేసే విధానాలు, పెరిగిన నిత్యావసరాలు, ఆహార ధరలు వంటివి తీవ్రంగా ప్రభావితం చేస్తుండడంతో వాటిపై ఫోకస్ పెట్టాలంటున్నారు. అంతేకాదు.. వీసా, అక్రమ వలసల విషయంలో చర్యలు తీసుకోవాలని.. ప్రధానంగా H1B వీసా విధానంలో మార్పులు చేయాలని కోరుతున్నారు అమెరికాలో నివసించే తెలుగువారు. మొత్తంగా.. అనేక ట్విస్టులు, కాల్పుల గందరగోళాలకు కేరాఫ్‌గా నిలిచిన అమెరిక అధ్యక్ష ఎన్నికలు తీవ్ర ఉత్కంఠగా మారాయి. ఈ నేపథ్యంలో.. ఆయా అంచనాలు.. విశ్లేషణలు ఎవరికి మేలు చేస్తాయో.. ఎవరికి నష్టం చేకూరుస్తాయో చూడాలి.
మరిన్ని ప్రీమియం కథనాల కోసం…TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.