
అగ్రరాజ్యం అమెరికాలో విమానయాన వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో తలెత్తిన భారీ కమ్యూనికేషన్ వైఫల్యంతో దేశవ్యాప్తంగా విమాన రాకపోకలు అస్తవ్యస్తమయ్యాయి. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) అత్యవసరంగా గ్రౌండ్ స్టాప్ విధించింది. దీంతో వేలాది విమానాలు ఆలస్యమవ్వగా, మరికొన్ని రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమెరికా తూర్పు కాలమానం ప్రకారం శుక్రవారం (నవంబర్ 13) మధ్యాహ్నం 3.54 గంటలకు FAA ఈ నిర్ణయం తీసుకుంది. నేలపై ఉన్న విమానాలు టేకాఫ్ కాకుండా ఆదేశాలు జారీ చేసింది. అప్పటికే గాలిలో ఉన్న విమానాలు మాత్రం తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతించింది. ఫ్లైట్ ట్రాకింగ్ సంస్థ ఫ్లైట్అవేర్ వివరాల ప్రకారం 11 వేలకుపైగా విమానాలు ఆలస్యం లేదా రద్దుకు గురయ్యాయి. ఇందులో సుమారు 10 వేల విమానాలు ఆలస్యమవ్వగా, వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. మరోవైపు వందలాది విమానాలను ప్రత్యామ్నాయ విమానాశ్రయాలకు మళ్లించారు.
ఈ అంతరాయం అంతర్జాతీయ విమాన సర్వీసులపైనా ప్రభావం చూపింది. కెనడా, యూరప్ నుంచి అమెరికాకు వచ్చే విమానయాన సంస్థలు తమ షెడ్యూళ్లను మార్చుకోవాల్సి వచ్చింది. అమెరికా నుంచి బయలుదేరే అంతర్జాతీయ విమానాలను పరిస్థితిని బట్టి అనుమతిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో ప్రయాణికులు భారీగా చేరుకోవడంతో గేట్లు, పార్కింగ్ స్థలాల కొరత కూడా ఏర్పడింది.
అయితే ఈ ఘటన వెనుక సైబర్ దాడి ఉన్నట్లు ప్రాథమికంగా ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా అధికారులు స్పష్టం చేశారు. టెలికమ్యూనికేషన్ వ్యవస్థల్లో ఏర్పడిన సాంకేతిక లోపమే ప్రధాన కారణమని భావిస్తున్నారు. పాతబడిన స్విచ్లు, రౌటర్లు ఓవర్లోడ్ కావడం వల్ల కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిన్నట్లు రవాణా శాఖ మంత్రి సీన్ డఫీ తెలిపారు. అమెరికా భద్రతా వ్యవస్థకు ఎలాంటి ముప్పు లేదని, ముందుజాగ్రత్త చర్యగానే విమానాలను నిలిపివేసినట్లు అధికారులు వివరించారు. అత్యవసర వైద్య, భద్రతా విమానాలకు మాత్రం అనుమతి కొనసాగించారు.
2001 సెప్టెంబర్ 11 ఉగ్రదాడుల తర్వాత, 2023 జనవరిలో NOTAM కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం తలెత్తినప్పుడు మాత్రమే ఇలాంటి దేశవ్యాప్త అంతరాయాలు చోటుచేసుకున్నాయి. తాజా ఘటనతో అమెరికా విమానయాన రంగంలోని పాతబడిన సాంకేతిక మౌలిక సదుపాయాలపై మరోసారి చర్చ మొదలైంది. విమాన సేవలు పూర్తిస్థాయిలో ఎప్పుడు పునరుద్ధరిస్తారనే దానిపై ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులు, విద్యార్థులు తమ ప్రయాణాలపై ఆందోళన చెందుతున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..