AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రంప్ కుమారుడి పెళ్లి వేడుక వివాదం.. రష్యన్‌ కుబేరుడి పేరు తెరపైకి..?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనయుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్ ( వివాహానంతర వేడుకలకు రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఉమర్ క్రెమ్లెవ్ ఆర్థిక సహాయం చేసినట్లు వచ్చిన నివేదికలు ఇప్పుడు చర్చకు దారితీశాయి. పుతిన్‌తో సంబంధాలున్న వ్యక్తిగా పేర్కొంటున్న క్రెమ్లెవ్ బహామాస్‌లో జరిగిన ప్రైవేట్ ఐలాండ్ వేడుకలు, బాణసంచా వంటి ఏర్పాట్లకు భారీగా ఖర్చు చేసినట్లు కథనాలు చెబుతున్నాయి. దీనిపై ట్రంప్ కుటుంబం వివరణ ఇవ్వగా, అమెరికా రాజకీయ వర్గాల్లో మాత్రం ఇది చర్చనీయాంశంగా మారింది.

ట్రంప్ కుమారుడి పెళ్లి వేడుక వివాదం.. రష్యన్‌ కుబేరుడి పేరు తెరపైకి..?
Donald Trump Jr. And Bettina Anderson
Janardhan Veluru
|

Updated on: Sep 16, 2026 | 12:54 PM

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమారుడు జూనియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump Jr) వివాహ వేడుక చుట్టూ వివాదం రాజుకుంది. జూనియర్ డొనాల్డ్ ట్రంప్, తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్‌ (Bettina Anderson)ను 2026 మే నెలలో వివాహం చేసుకున్నాడు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భద్రతా కారణాలతో ట్రంప్ ఈ వివాహ వేడుకకు హాజరుకాలేదు. బహామాస్‌లో జరిగిన వివాహానంతర వేడుకలకు అయిన భారీ ఖర్చులను రష్యన్ కుబేరుడు ఉమర్‌ క్రెమ్లెవ్‌ భరించినట్లు కథనాలు రావడంతో ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉమర్ క్రెమ్లెవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు ఉండటం అమెరికాలో రాజకీయ దుమారం రేపుతోంది.

రష్యాకు చెందిన ఉమర్ క్రెమ్లెవ్‌ ఇంటర్నేషనల్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ (IBA) అధిపతిగా ఉన్నారు. ఆయనకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సంబంధాలు ఉన్నట్లు పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 2026 ఏప్రిల్‌లో పుతిన్‌ ఆయనకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ ఫ్రెండ్‌షిప్‌’ అనే రష్యా ప్రభుత్వ పురస్కారాన్ని అందించారు. అలాగే మే నెలలో పుతిన్‌ చైనా పర్యటనకు వెళ్లిన ప్రతినిధి బృందంలో క్రెమ్లెవ్‌ కూడా ఉన్నారు.

ప్రోపబ్లికా కథనం ప్రకారం.. బహామాస్‌లోని ప్రైవేట్‌ ఐలాండ్‌ అద్దె, బాణసంచా ప్రదర్శన, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చుల్లో క్రెమ్లెవ్‌ వందల వేల డాలర్లు చెల్లించినట్లు ఆర్థిక రికార్డులు, కార్యక్రమానికి సంబంధించిన వ్యక్తుల సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తెలిపింది. అయితే మొత్తం వివాహ ఖర్చును ఆయనే భరించారనే విషయం నిర్ధారించబడలేదు.

ఈ వ్యవహారంపై బెట్టినా ఆండర్సన్‌ స్పందిస్తూ.. వివాహం కుటుంబ సభ్యులకే పరిమితమైందని, ఆ తర్వాత జరిగిన రెండు రాత్రుల వేడుకలను క్రెమ్లెవ్‌ స్నేహితుడిగా కానుకగా నిర్వహించారని ధృవీకరించారు. అయితే ఇందులో ఎలాంటి రాజకీయ కుట్ర లేదని ఆమె పేర్కొన్నారు. ట్రంప్‌ కూడా క్రెమ్లెవ్‌ ఎవరో తనకు తెలియదని, ఆయన వివాహానికి కాకుండా తర్వాత జరిగిన వేడుకలకు మాత్రమే సహకరించారని చెప్పారు.

ఇదిలా ఉండగా, అమెరికాలో ఈ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. అమెరికా కాంగ్రెస్‌లోని డెమొక్రాట్లు ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. విదేశీ వ్యక్తి నుంచి డొనాల్డ్ ట్రంప్ కుటుంబీకులు ఇంత భారీ ఆర్థిక సహాయం అందుకోవడం వల్ల రాజకీయ ప్రభావం లేదా నైతికతకు సంబంధించిన ప్రశ్నలు తలెత్తుతున్నాయని వారు పేర్కొన్నారు. అయితే రష్యా కుబేరుడి ఈ సహాయం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని ఇప్పటివరకు నిర్ధారించే ఆధారాలు బహిరంగంగా వెల్లడికాలేదు.

Follow Us