వ్యోమగామి సునీత విలియమ్స్ అంతకుముందు చాలాసార్లు స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లినా తాజాగా స్పేస్ స్టేషన్‌లో ఇరుక్కుపోయారు. బోయింగ్ స్టార్‌లైనర్ బ్రోబ్‌ను పరీక్షించేందుకు స్పేస్ స్టేషన్‌కు వెళ్లిన సునీత విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లు ప్రోబ్‌లో తలెత్తిన సమస్య కారణంగా అంతరిక్షంలోనే ఉండాల్సి వచ్చింది.
జూన్ 5వ తేదీన స్పేస్ స్టేషన్‌లోకి వెళ్లిన వారు వచ్చే ఏడాది వరకు ఉండాల్సి వచ్చింది. అయితే ఎక్కువ రోజులపాటు అంతరిక్షంలో ఉండడంతో సునీత విలియమ్స్ అనారోగ్యానికి గురయినట్లు వార్తలు వస్తున్నాయి.. తాజాగా విడుదల చేసిన ఫొటోల్లో సునీత ఆరోగ్యం క్షీణించినట్లు స్పష్టమవుతోంది. సునీత విలియమ్స్ బరువు తగ్గినట్లు ఫొటో చూస్తే స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ విషయమై అమెరికాకు చెందిన శ్వాసకోశ సంబంధిత వ్యాధుల నిపుణులు డాక్టర్ వినయ్ గుప్తా మాట్లాడారు. ఆమె పోషకాహార లోపాన్ని ఎదుర్కొంటున్నారని, అందువల్లే బలహీనంగా కనిపిస్తున్నారని తెలిపారు. వ్యోమగాములు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రోజుకు కనీసం 2.5 గంటల వ్యాయామం చేయాలని ఆయన సూచించారు. కాగా అంతరిక్షంలో ఎక్కువ సమయం ఉన్నవారికి స్పేస్ ఎనీమియా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా ఎర్రరక్తకణాలు క్షీణిస్తాయి.
సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్లిన వెంటనే.. శరీరం స్పేస్ ఎనిమీయాకు గురవడం ప్రారంభమవుతుంది. ఎర్ర రక్త కణాల క్షీణత మొదలుకాగానే శరీరంలోని భాగాలకు ఆక్సిజన్ అందడం తగ్గిపోతుంది. దీంతో అలసట, నిస్సత్తువ, శారీరక, మానసిక పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీర్ఘకాలంలో ఇది హృదయ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..