
అంతరిక్ష ప్రయోగ రంగంలో సంచలనాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌కు స్టార్‌షిప్ ఫ్లైట్ 15లో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రయోగంలో సూపర్ హెవీ బూస్టర్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో అనుకున్న రీతిలో రాకెట్‌ను తిరిగి ప్రయోగ టవర్ వద్దకు తీసుకురాలేకపోయారు. దీంతో ఆటోమేటిక్ అబార్ట్ ప్రక్రియ అమల్లోకి వచ్చి బూస్టర్‌ను మెక్సికో గల్ఫ్‌లోకి మళ్లించారు.
సాధారణంగా స్టార్‌షిప్ ప్రయోగంలో మొదటి దశ అయిన సూపర్ హెవీ బూస్టర్‌ను తిరిగి స్టార్‌బేస్‌కు తీసుకొచ్చి, అక్కడ భారీ యాంత్రిక చేతులైన ‘చాప్‌స్టిక్స్’ సాయంతో లాంచ్ టవర్ వద్ద పట్టుకోవడం స్పేస్‌ఎక్స్ లక్ష్యం. అయితే ఈసారి బూస్టర్‌లో సమస్య తలెత్తడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. చివరకు బూస్టర్ సముద్రంలో ల్యాండ్ అయింది. దీంతో స్టార్‌షిప్ రాకెట్ రెండు దశలను ఒకే మిషన్‌లో తిరిగి పొందాలన్న స్పేస్‌ఎక్స్ ప్రణాళికకు బ్రేక్ పడింది.
అయితే ఈ సాంకేతిక లోపానికి అసలు కారణమేంటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. అప్‌గ్రేడ్ చేసిన సూపర్ హెవీ V3 బూస్టర్‌లో ఏ వ్యవస్థ విఫలమైందనే విషయాన్ని స్పేస్‌ఎక్స్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. V3 వెర్షన్ బూస్టర్‌కు సంబంధించి లాంచ్ టవర్ క్యాచ్ ప్రయత్నం పరంగా ఈ ప్రయోగం కీలకంగా మారింది.
మరోవైపు స్టార్‌షిప్ పై దశ తన ప్రయాణాన్ని కొనసాగించింది. షిప్ 42గా పేర్కొన్న ఈ వాహనం తదుపరి తరం స్టార్‌లింక్ V3 ఉపగ్రహాలను ప్రయోగించి, భూమి చుట్టూ సుమారు 14 కక్ష్యలు పూర్తి చేయనున్నట్లు సమాచారం. అనంతరం తిరిగి స్టార్‌బేస్‌కు చేరుకోవాల్సి ఉంది. నవంబర్ 15న భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 2:45 గంటలకు పై దశను ప్రయోగ టవర్ వద్ద పట్టుకునే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రయత్నం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగ చరిత్రలో మరో కీలక మైలురాయిగా నిలుస్తుంది.
రాకెట్‌ను సముద్రంలో దించకుండా నేరుగా లాంచ్ టవర్ వద్ద పట్టుకుని తిరిగి ఉపయోగించుకోవడమే స్పేస్‌ఎక్స్ ప్రధాన లక్ష్యం. ఈ విధానం విజయవంతమైతే ప్రయోగ ఖర్చులు తగ్గడంతో పాటు రాకెట్లను వేగంగా మళ్లీ ప్రయోగించే అవకాశం ఏర్పడుతుంది. తాజా సాంకేతిక సమస్యతో ఈ లక్ష్య సాధనలో స్పేస్‌ఎక్స్‌కు మరో సవాలు ఎదురైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..