RUSSIA-UKRAINE WAR INTENSIFIED MOSCOW PLAN B TARGETTING EAST UKRAINE: అదో పెద్ద దేశం.. సైనిక సంపత్తిలో అగ్రరాజ్యం. అమెరికా తర్వాత ఆ స్థాయిలో అణ్వాయుధాలు కలిగి వున్న పెద్ద దేశం. ఇటువైపు చిన్న దేశం. పెద్దగా సైనిక పాటవం లేకపోవడంతో అగ్రరాజ్యం అమెరికా అండదండలతో నడిచే నాటోలో చేరేందుకు రెండున్నర దశాబ్దాలుగా ఆరాటపడుతున్న దేశం. అంత పెద్ద దేశం ఉన్నట్లుండి దండయాత్ర ప్రారంభిస్తే.. ఈ చిన్న దేశానికి ఏ దేశమూ సైనిక సాయం అందించకపోతే.. ఆదుకునేందుకు రంగంలోకి దిగకపోతే.. పెద్దగా ప్రతిఘటించలేదు అనుకున్నారందరూ. కానీ నాలుగు వారాలుగా దండయాత్ర కొనసాగిస్తూ యావత్ ప్రపంచం దృష్టిలో యుద్ధోన్మాది అని నిందింపబడుతున్నా కూడా ఆ చిన్న దేశాన్ని ఇంకా ఓడించలేకపోతోంది. అనుకున్న దానికంటే ఎంతో మెరుగ్గా ఈ చిన్న దేశం ఆ పెద్ద దేశపు మిలిటరీ దురాక్రమణను ఎదుర్కొంటోంది. ఎస్.. రష్యా, యుక్రెయిన్ యుద్దం గురించే ఈ ప్రస్తావన. ఏడాది కాలంగా వ్యూహాత్మకంగా తమ బలగాలను యుక్రెయిన్ సరిహద్దులకు తరలించిన రష్యా.. ఫిబ్రవరి నాలుగోవారంలో యుద్దాన్ని ప్రారంభించింది. యుద్దాన్ని ప్రారంభించక ముందే యుక్రెయిన్ దేశాన్ని మూడు వైపులా చుట్టుముట్టింది రష్యన్ మిలిటరీ. ముందుగా తూర్పు యుక్రెయిన్ ప్రాంతంలోని డొనెట్స్కీ, లూహన్స్కీలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించింది రష్యా. డాన్ బాస్ ఏరియాపై ఆధిపత్యాన్ని ప్రకటించుకుంది.
ఫిబ్రవరి 24వ తేదీన రష్యా తూర్పు యుక్రెయిన్ భాగంపై దండయాత్ర ప్రారంభించింది. మరో రెండు రోజుల్లో ఉత్తర యుక్రెయిన్ వైపు మిలిటరీ యాక్షన్ మొదలు పెట్టింది. యుక్రెయిన్, బెలారుస్ బోర్డర్‌లోని చారిత్రాత్మక చెర్నోబిల్ అణు కేంద్రాన్ని గుప్పిట్లోకి తీసుకుంది రష్యా. ఆ తర్వాత రష్యాన్ దళాలు యుక్రెయిన్ రాజధాని కీవ్ నగరంవైపు బయలుదేరాయి. కేవలం వందా 20 కిలోమీటర్ల దూరంలోని కీవ్ నగరాన్ని రష్యాన్ సైన్యం చేరుకోవడానికి ఎంతో సమయం పట్టదని, ఆ నగరాన్ని రక్షించుకునే సైనిక సామర్థ్యం యుక్రెయిన్‌కు లేదని అంతా భావించారు. కానీ యుక్రెయిన్ సైన్యం వ్యూహాత్మకంగా రష్యన్ దళాలను నిరోధించాయి. 60 కిలోమీటర్ల మేర సాగిన రష్యన్ ట్యాంకర్ల కాన్వాయ్ కీవ్ నగరాన్ని స్వాధీనం చేసుకునేందుకే అనుకున్నారంతా. కానీ ఆ కాన్వాయ్‌లోని సగం యుద్దవాహనాలు కనిపించకుండా పోయాయి. అవి రష్యాకు తిరిగి వెళ్ళాయా లేక అమెరికా అందించిన యాంటీ ట్యాంకర్ మిస్సైళ్ళతో యుక్రెయిన్ సైన్యమే వాటిని ధ్వంసం చేసిందా అన్నది తేలలేదు. కీవ్ నగరం మాస్కో కంటే పూర్వమే సంయుక్త రష్యాకు రాజధాని. ఎంతో చారిత్రాత్మకం కాబట్టే కీవ్ నగరంపై రష్యా కన్నేసింది. కానీ కీవ్ నగరానికి సహజ సిద్దంగా కలిసి వచ్చిన అంశం ఆ నగరం గుండా పయనించే నది. డ్నియేపర్ నది యుక్రెయిన్ ఉత్తర భాగాన బెలారుస్ నుంచి ప్రారంభమవుతుంది. అది కీవ్ నగరం గుండా పయనించి దక్షిణాన నల్ల సముద్రంలో కలుస్తుంది. డ్నియేపర్ నది కీవ్ నగరాన్ని70:30 నిష్పత్తిలో విడదీస్తుంది. ఇపుడీ నదియే కీవ్ నగరాన్ని రష్యన్ల నుంచి కాపాడుతుందని చెప్పాలి.
అందుబాటులో వున్న ఆయుధాలతోనే రష్యన్ సైన్యాన్ని ఎదుర్కోవాలని దృఢసంకల్పంతో రంగంలోకి దిగిన యుక్రెయిన్ దళాలు.. స్థానికుల సహకారంతో కీవ్ నగరాన్ని కాపాడుకుంటూ వస్తున్నాయి. దాదాపు మూడు వారాలుగా కీవ్ నగరంలోకి రష్యన్ దళాలు రాకుండా నిరోధించడంలో యుక్రెయిన్ సైనికులు విజయం సాధించారనే చెప్పాలి. నదికి అటువైపు నుంచి మిస్సైళ్ళను ప్రయోగిస్తూ భవనాలను కుప్పకూలుస్తున్న రష్యన్ దళాలు నదిని దాటి నగరంలోకి రాలేకపోతున్నాయి. నదిని దాటి సెంట్రల్ కీవ్‌లోకి రష్యన్ బలగాలు వస్తే ఇక ఆనగరంపై యుక్రెయిన్ ప్రభుత్వం పట్టు కోల్పోయినట్లే భావించాలి. ఇది మరో రెండు, మూడురోజుల్లో జరగొచ్చు గాక.. కానీ మినిమం మిలిటరీతో, మినిమం వెపన్స్‌తో రష్యన్ బలగాలను మూడు వారాలపాటు నిరోధించిన యుక్రెయిన్ సైన్యాన్ని అభినందించకుండా వుండలేం. కీవ్ సిటీపై పట్టు సాధించడం అంత ఈజీ కాదని గ్రహించడం వల్లనే రష్య ప్లాన్ బీని అమలు చేస్తోందని అంతర్జాతీయ మీడియా విశ్లేషిస్తోంది. ప్లాన్ బీలో భాగంగానే రష్యా.. యుక్రెయిన్‌కు ఆగ్నేయంలో వున్న పోర్ట్ సిటీ మేరియుపోల్‌ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. యుక్రెయిన్ దేశానికి దక్షిణాన నల్ల సముద్రంలోకి చొచ్చుకుని వుండే ద్వీపకల్పం క్రిమియా నుంచి ఇటీవల దురాక్రమణ ద్వారా పట్టు సాధించిన డాన్ బాస్ ఏరియా దాకా రష్యా ఆధీనంలో తూర్పు యుక్రెయిన్ వుండాలంటే మేరియుపోల్ పోర్ట్ సిటీపై పట్టు సాధించడం రష్యాకు అవసరం. అందుకే వ్యూహాత్మకంగా కీవ్ సిటీపై ఫోకస్ కాస్త తగ్గించి మేరియుపోల్‌పై రష్యన్ బలగాలు దృష్టి సారించాయి. మేరియుపోల్ సిటీలోని జనావాస ప్రాంతాలు, జనసమ్మర్థం వుండే థియేటర్లు, షాపింగ్ మాల్స్‌పై విచక్షణారహితంగా దాడులు నిర్వహిస్తోంది రష్యా. సామాన్య ప్రజలను హతమారుస్తోంది. మేరియుపోల్ సిటీని ఆక్రమించుకుంటే.. తూర్పు యుక్రెయిన్ ప్రాంతమంతా రష్యా గుప్పిట్లోకి చేరుతుంది. ఇదే లక్ష్యంగా రష్యా ఇపుడు యుద్దాన్ని కొనసాగిస్తోందని తెలుస్తోంది. ఇదే ప్లాన్ బీ అంటున్నారు అంతర్జాతీయ అంశాల విశ్లేషకులు.
Also Watch: