AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమి బద్దలయ్యేలా ప్రతీకారం తీర్చుకుంటాం.. సనా ఎయిర్‌పోర్టు దాడిపై సౌదీకి హూతీల వార్నింగ్..

పశ్చిమ ఆసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. శాంతి ప్రయత్నాలకు స్వస్తి పలుకుతూ యెమెన్ రాజధాని సనా అంతర్జాతీయ విమానాశ్రయంపై సౌదీ అరేబియా భీకర క్షిపణి దాడులతో విరుచుకుపడింది. మరోవైపు ఈ పిరికిపంద చర్యకు తాము ఇచ్చే సమాధానంతో భూమి కంపించిపోతుందని హూతీ కమాండర్లు సౌదీకి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

భూమి బద్దలయ్యేలా ప్రతీకారం తీర్చుకుంటాం.. సనా ఎయిర్‌పోర్టు దాడిపై సౌదీకి హూతీల వార్నింగ్..
Saudi Airstrike Sanaa Airport
Krishna S
|

Updated on: Jul 14, 2026 | 3:10 PM

Share

పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. యెమెన్ రాజధాని సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై సౌదీ అరేబియా సోమవారం రాత్రి భీకరమైన వైమానిక దాడులు జరిపింది. ఈ క్షిపణి దాడులకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పేలుడు తీవ్రతకు సనా నగరం దద్దరిల్లిపోగా.. ఈ దాడిపై ఇరాన్ మద్దతు గల హూతీ తిరుగుబాటుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా చర్యను యుద్ధ ప్రకటనగా అభివర్ణించిన హూతీ కమాండర్లు.. దీనికి తాము ఇచ్చే సమాధానంతో భూమి కంపించిపోతుందని హెచ్చరించారు. యెమెన్ అధికారిక వర్గాలు, రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. హూతీ ప్రతినిధి బృందంతో వస్తున్న ఒక ఇరాన్ విమానాన్ని సనా విమానాశ్రయంలో ల్యాండ్ కాకుండా నిరోధించడమే లక్ష్యంగా సౌదీ అరేబియా ఈ దాడికి పాల్పడింది. అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు హూతీ ప్రతినిధులు ఇటీవలే టెహ్రాన్ వెళ్లారు. వారు తిరిగి వస్తున్న క్రమంలో సోమవారం సనా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ రన్‌వేని లక్ష్యంగా చేసుకుని సౌదీ దళాలు ఖచ్చితమైన క్షిపణి దాడులు చేశాయని యెమెన్ రక్షణ మంత్రి జనరల్ తాహర్ అల్ అకీలి సోషల్ మీడియా వేదికగా ధృవీకరించారు. రన్‌వే పూర్తిగా ధ్వంసం కావడంతో ఇరాన్ విమానం సనాలో ల్యాండ్ కాలేకపోయింది. హూతీల సమాచారం ప్రకారం.. అనంతరం ఆ విమానాన్ని సురక్షితంగా హొదైదా విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సేఫ్‌గా ల్యాండ్ అయినట్లు సమాచారం.

ఇక భూమి బద్దలవుతుంది.. హూతీల హెచ్చరిక

గత కొంతకాలంగా సౌదీ అరేబియా – యెమెన్ సరిహద్దుల్లో కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందం, శాంతి ప్రయత్నాలను ఈ దాడి పూర్తిగా తుడిచిపెట్టేసింది. ఈ వైమానిక దాడిపై హూతీ సీనియర్ అధికారి అలీ అల్ కహోమ్ స్పందిస్తూ.. ‘‘సౌదీ చేసిన ఈ పిరికిపంద చర్యకు మేము ఇచ్చే ప్రతిఘటన అత్యంత భీకరంగా ఉంటుంది. భూమిని వణికించేలా మా ప్రతీకారం ఉంటుంది. ఇందులో ఎలాంటి ఆలస్యం జరగదు’’ అని హెచ్చరించారు. మరోవైపు హూతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ యాహ్యా సారీ మాట్లాడుతూ.. సౌదీ అరేబియా శాంతి కాలానికి స్వస్తి పలికిందని మండిపడ్డారు. ‘‘సౌదీని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా ఓపిక నశించింది. మా సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించే ఏ విదేశీ విమానాన్నైనా సరే కూల్చివేయడానికి మా పూర్తి సైనిక శక్తిని ఉపయోగిస్తాం’’ అని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో వైరల్ అయిన విధ్వంసం

సనా ఎయిర్‌పోర్ట్‌పై జరిగిన ఈ దాడి దృశ్యాలను స్థానిక అల్ మసీరా టీవీ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఆకాశం నుండి సౌదీ క్షిపణులు నేరుగా ఎయిర్‌పోర్ట్ ప్రధాన రన్‌వేను ఢీకొట్టడం, ఆ వెంటనే వరుస పేలుళ్లతో భారీ అగ్నికీలలు, పొగ ఆకాశాన్ని తాకడం వీడియోలో స్పష్టంగా కనిపించింది. విమానాశ్రయం చుట్టుపక్కల ప్రజల హాహాకారాలు ఆ ప్రాంతంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని వీడియోలో చూడొచ్చు.

పశ్చిమ ఆసియాలో కొత్త యుద్ధ రంగం

ఈ తాజా పరిణామం మిడిల్ ఈస్ట్‌లో సరికొత్త యుద్ధ రంగాన్ని తెరిచినట్లయింది. హూతీ తిరుగుబాటుదారులకు ఇరాన్ నుండి పూర్తి స్థాయిలో ఆర్థిక, సైనిక, క్షిపణి సాంకేతిక మద్దతు లభిస్తుంది. ఒకవేళ హూతీలు గతంలో లాగే సౌదీ అరేబియాకు చెందిన వ్యూహాత్మక చమురు క్షేత్రాలు లేదా రిఫైనరీలపై డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ఎదురుదాడికి దిగితే.. ఈ ప్రాంతంలో యుద్ధాన్ని అదుపు చేయడం అంతర్జాతీయ సమాజానికి అత్యంత కఠినంగా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఎర్రసముద్రంలో నౌకలపై దాడులతో సంచలనం సృష్టిస్తున్న హూతీలు, ఇప్పుడు నేరుగా సౌదీతో తలపడటానికి సిద్ధమవ్వడం అంతర్జాతీయ చమురు మార్కెట్లను, ప్రపంచ భద్రతను తీవ్ర ఆందోళనలోకి నెట్టివేసింది.

Follow Us