AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!

కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టుకుని బాలిలొ ఈతకొట్టిన ఓ యూకే వ్యక్తికి భయానక అనుభవం ఎదురైంది. ఓ పరాన్నజీవి అతడి కంటిని పాక్షికంగా తినేసింది. సాధారణ ఇన్ ఫెకన్ గా భావించి చుక్కల మందు వేసుకున్నారు. రెండు నెలల తర్వాత పరీక్ష చేయించుకోగా షాకింగ్ విషయం బయటపడింది. .

కాంటాక్ట్‌ లెన్స్‌తో ఈత కొడితే.. కంటిని తినేసిన పరాన్నజీవి!
Man Contracts Eye Eating Parasite After Swimming With Contact Lenses
Sharada V
|

Updated on: Aug 26, 2026 | 6:54 PM

Share

కాంటాక్ట్ లెన్స్‌ ధరించి ఈత కొట్టడంతో యూకేకు చెందిన 38 ఏళ్ల వ్యక్తి ‘అకాంతమీబా కెరటిటైస్’ అనే అరుదైన పరాన్నజీవి ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డారు. సాధారణ ఇన్‌ఫెక్షన్‌లాగే లక్షణాలు ఉండటంతో దానిని గుర్తించడం ఆలస్యమైంది.  మాట్ ఫ్లాక్.. బాలి పర్యటనలో భాగంగా స్విమ్మింగ్ పూల్‌లో కాంటాక్ట్ లెన్స్‌తోనే ఈత కొట్టారు.  ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయనకు కంటి ఇన్‌ఫెక్షన్ లక్షణాలు ప్రారంభమయ్యాయి. ఎడమ కన్ను తెరవడం కష్టంగా మారింది. మొదట సముద్రపు నీరు, ఇసుక వల్ల కంట్లో ఏదో పడిందని ఆయన భావించారు.

అయితే కొద్ది రోజులకు తీవ్రమైన కంటి నొప్పి, కాంతిని చూడలేకపోవడం, కన్ను ఎర్రబడటం వంటి సమస్యలు మొదలయ్యాయి. “నేను కాంటాక్ట్ లెన్స్‌లు పెట్టడం ఆపేశాను. ఏదో ఒకలా సర్దుకుంటుందని అనుకున్నాను. కానీ పరిస్థితి మరింత దిగజారింది. వెలుతురును అస్సలు చూడలేకపోయాను, కంటిలో నీరు నిరంతరం కారుతూనే ఉంది” అని మాట్ ఫ్లాక్ తెలిపారు. స్థానిక ఫార్మసీలో చుక్కల మందు కొనుగోలు చేసి వాడినా ఫలితం లేకపోవడంతో.. రెండు నెలల తర్వాత యూకేలో డాక్టర్‌ను సంప్రదించారు. అక్కడ కార్నియా స్క్రేపింగ్ (కణజాలం సేకరించే చిన్న పరీక్ష) చేయించగా ..వైద్యులు పరీక్షించి ‘అకాంతమీబా కెరటిటైస్’ సోకినట్లు నిర్ధారించారు.

అకాంతమీబా కెరటిటైస్ తో కంటి చూపు పోయే ప్రమాదం?

ఈత కొలనులు, హాట్ టబ్స్, సరస్సులలొ ఉండే ఈ సూక్ష్మజీవి ద్వారా అరుదైన, తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశముంది. కాంటాక్ట్ లెన్స్‌లు ధరించే వారికి లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఈ ముప్పు ఎక్కువగా ఉంటుందని క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ వైద్యులు తెలిపారు. నీటిలో కాంటాక్ట్ లెన్స్ ధరించినప్పుడు, లెన్స్ కింద సూక్ష్మజీవులు ఇరుక్కుపోతాయి. ఆ పరాన్నజీవి కంటి బయటి పొరలోకి చొచ్చుకెళ్లి, తీవ్రమైన మంటను కలిగించడంతో పాటు కాలక్రమేణా కంటి కణజాలాన్ని తినేస్తుంది.

“ఇది నిజంగా నా కంటిని తినేస్తున్న పరాన్నజీవి. డాక్టర్లు ఆ విషయం చెప్పగానే నేను ఒక్కసారిగా భయపడ్డాను,” అని మాట్ ఫ్లాక్ అన్నారు. “చికిత్సతో తగ్గకపోతే కార్నియా మార్పిడి ఆపరేషన్లు చేయాలని డాక్టర్ సూచించినట్లు” తెలిపారు.

కళ్లద్దాల స్థానంలో కాంటాక్ట్‌ లెన్స్‌ వాడే వారి సంఖ్య ఇటీవల పెరిగింది. కళ్లలో ఫిక్స్ చేసి ఉండే ఈ కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు జాగ్రత్తలు  తీసుకోకుంటే, కళ్లకే ప్రమాదం. “నేను రోజు వాడే కాంటాక్ట్ లెన్స్‌నే ధరించాను. అయినా నాకు ఈ పరిస్థితి వచ్చింది. లెన్స్‌లు ధరించే వారు స్విమ్మింగ్ పూల్‌లోకి దిగే ముందు వాటిని కచ్చితంగా తీసేయాలి. ఎవరికీ ఈ కష్టం రాకూడదు” అని మాట్ ఫ్లాక్ హెచ్చరించారు.

Follow Us