Indigenous Day: కొండకోనల్లో అడవుల మధ్య బతుకుతూ.. ప్రకృతితో మమేకమైన జీవనం వారిది. కల్మషం లేని మనస్సు వారి సొంతం. డోలు చప్పుల్లు, నృత్యాలు, గుస్సాడి వేషధారణల మేళవింపు గిరిజనుల జీవన శైలి.. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా ఆదివాసీల జీవనస్థితిగతుల్లో చెప్పుకోదగిన అభివృద్ధి కనిపించదు. నేటికి వైద్యం, విద్య, మౌలికవసతుల కల్పన వంటి వాటికి గిరిజన గ్రామాలు దూరంగానే ఉన్నాయి. ఈనేపథ్యంలో ఆదీవాసీల హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఆగష్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవంగా ప్రకటించింది. అప్పటినుంచి ఐక్యరాజ్యసమితిలోని ‘డిపార్టుమెంట్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ సోషల్ ఎఫ్ఫైర్సై్ ఇండిజినియస్ పీపుల్స్’ విభాగం ఆధ్వర్యంలో ఆదీవాసీల దినోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. నేడు అంతర్జాతీయ ఆదివాసీల దినోత్సవం సందర్భంగా వారికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
75 ఏళ్ల స్వాతంత్య్ర భారతదేశంలో ఎన్నో ప్రభుత్వాలు, ఎందరో పాలకులు మారినా అడవి బిడ్డల బతుకులు మారడంలేదు. అడవి తల్లిని వదిలి బయటకు రావడానికి గిరిజనులు ఇష్టపడరు. కష్టమైనా.. నష్టమైనా అడవి తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటారు. నేటికి ఆదీవాసీల గ్రామాల్లో రవాణా వ్యవస్థ సరిగ్గాలేదనది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఆదివాసీ బిడ్డను దేశానికి రాష్ట్రపతిగా ఎన్నుకుని ఆదివాసీలకు తగిన గౌరవం ఇచ్చిన ఘనత భారతదేశ ప్రజాస్వామ్యానికే దక్కుతుంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర భారతంలో ఒక ఆదివాసీ మహిళ భారత రాష్ట్రపతి పీఠమెక్కడం బ్యూటీ ఆఫ్ డెమెక్రసీగా చెప్పుకోవచ్చు. కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం గిరిజనుల సాధికారత కోసం అనేక కార్యక్రమాలను తీసుకొచ్చి.. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా గిరిజన ప్రజలకు ఆరోగ్య భద్రత తో జీవనోపాధి కల్పించడానికి తన వంతు ప్రయత్నం చేస్తోంది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఎంతోమంది గిరిజన నాయకులు ప్రముఖ పాత్ర పోషించారు.
ఆదివాసీల దినోత్సవం ప్రాముఖ్యత: ప్రపంచంలోని దాదాపు 70 దేశాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు. వీరి సంఖ్య సుమారు 370 మిలియన్లు అంటే 37 కోట్ల మంది. విశ్వంలో సుమారు 5వేల ఆదీవాసీ తెగలుండగా.. భారత్ లో 705 గిరిజన తెగలను అధికారికంగా గుర్తించారు. భారత దేశంలో 104 మిలియన్ల ఆదీవాసీలుండగా.. దేశ జనాభాలో వీరు 8.6 శాతం, ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా గ్రీన్ ల్యాండ్ లో 88 శాతం మంది ఆదివాసీలుండగా.. ఫ్రెంచ్ పొలినేషియాలో 80 శాతం మంది ఆదివాసీలున్నారు. ఇండోనేషియాలో 60 మిలియన్లు, ఇథోపియాలో 15.7 మిలియన్ల ఆదీవాసీ జనాభా ఉన్నారు.
బతుకుపోరాటంలో ఎన్నో ఒడుదుడుకులను ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నారు ఆదివాసీలు. వారి నివసించే ప్రాంతాలు ఒకానొక సందర్భంలో సహజవనరులతో కళకళలాడుతుండేవి. చాలా దేశాలలో ఆదివాసీలకు తగిన గుర్తింపు, రక్షణ లేదు. కొన్ని దేశాల్లో అడవి బిడ్డల సంరక్షణకు కనీసపు చట్టాలు లేవు. ఆధునిక సమాజపు కొత్త పోకడలకు దూరంగా తమ కట్టు, బొట్టూ, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ కాపాడుకుంటూ వాటిని భావి తరాలకు అందిస్తున్నారు. గిరిజనులు జరుపుకునే పండుగలు, వేడుకలు వారి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. మన దేశంలో ఆదివాసీ తెగలు ఎక్కువుగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జార్ఖండ్, బీహార్, పశ్చిమబెంగాల్, మిజోరం, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో జీవిస్తున్నారు.
ఈఏడాది సాంప్రదాయ విజ్ఞాన పరిరక్షణ, ప్రసారంలో మహిళల పాత్ర ఇతివృత్తంతో అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గిరిజనులకు వారి హక్కులపై అవగాహన కల్పించడం, హక్కులను రక్షించడానికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..