బ్రిటన్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్. దేశంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ రెచ్చిపోతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుందని విమర్శించారు. బాలికలను వేధించే ముఠాలను అదుపు చేయలేని ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత అంటూ అసహనం వ్యక్తం చేశారు. బ్రిటన్ కింగ్ చార్లెస్ -త్రీ పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికల నిర్వహణకు ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు మస్క్.
బ్రిటన్ బాగుపడాలంటే దేశ పార్లమెంట్‌ను రద్దు చేసి.. ఎన్నికలకు ఆదేశించాలా? అంటూ బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్‌ను ఉద్దేశించి ఎక్స్‌లో ఓ నెటిజన్ పెట్టిన పోస్టుపై మస్క్ స్పందించారు. గ్రూమింగ్ గ్యాంగ్‌లను అదుపు చేయడంలో కీర్ స్టార్మర్ విఫలమయ్యారని ఆరోపించారు మస్క్. 2008-2013 మధ్య ఈ ముఠాలు ఎంతోమంది యువతుల జీవితాలను నాశనం చేశాయన్నారు. అప్పుడు క్రౌన్ ప్రాసిక్యూషన్ అధిపతిగా ఉన్న కీర్ స్టార్మర్ ఏం చేయలేకపోయారన్నారు. ప్రభుత్వం నుంచి కఠిన చర్యలు లేకపోవడంతో గ్రూమింగ్ గ్యాంగ్‌లు మరింత రెచ్చిపోయాయన్నారు. బ్రిటన్ అధికారులు చేస్తున్న తప్పులకు వారిని జైలుకు పంపాలన్నారు మస్క్.
పాకిస్తానీ మూలాలున్న బ్రిటిషర్లు చేస్తోన్న అరాచకాలపై ఆ దేశ ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు మస్క్. బ్రిటన్‌లో బాలికలకు భద్రత కరువైందన్నారు. ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపాయి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..