AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్న దేశ ప్రధాని.. ప్లాస్టిక్‌ సర్జన్‌కు గట్టి కౌంటర్‌!

డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఓ ప్లాస్టిక్ సర్జన్ పంపిన మెసేజ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆమె ముక్కుపై ఉన్న చిన్న మచ్చను తొలగిస్తానంటూ ఆ డాక్టర్ ఇచ్చిన ఆఫర్‌పై ప్రధాని తీవ్రంగా స్పందించారు. తన రూపం గురించి వస్తున్న కామెంట్లపై అసహనం వ్యక్తం చేశారు.

బాడీ షేమింగ్‌ ఎదుర్కొన్న దేశ ప్రధాని.. ప్లాస్టిక్‌ సర్జన్‌కు గట్టి కౌంటర్‌!
Happy As I Am Says Denmark Pm
Sharada V
|

Updated on: Aug 25, 2026 | 8:22 PM

Share

ఇటీవల ఉక్రెయిన్ పర్యటనలో ఉన్న సమయంలో మెటె ఫ్రెడెరిక్సన్‌కు ఓ ప్లాస్టిక్ సర్జన్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆమె ముక్కుపై కనిపిస్తున్న చిన్న మచ్చను సరిచేస్తానంటూ ఆ డాక్టర్ సూచించారు. మెసేజ్‌పై ప్రధాని తీవ్రంగా స్పందించారు. ప్లాస్టిక్ సర్జన్ పేరును బయటపెట్టకుండా.. ఆయన మెసేజ్ స్క్రీన్‌షాట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. తన రూపం గురించి గతంలో ఎదురైన అనుభవాలను ఆమె గుర్తుచేసుకున్నారు.

“నా పళ్లు బాగోలేవన్నారు.. జుట్టు పలుచగా ఉందన్నారు”

తన రూపంపై ఇప్పటివరకు ఎన్నో రకాల కామెంట్లు వచ్చాయని మెటె ఫ్రెడెరిక్సన్ పోస్ట్ లో రాసుకొచ్చారు. కొంతమంది తన పళ్లు అందంగా లేవని, మరికొందరు తన జుట్టు పలుచగా ఉందని, ఇంకొందరు తన ముక్కుపై మచ్చను  గమనించి కామెంట్లు చేశారని చెప్పారు. ఇలాంటి వ్యాఖ్యలు తనకు కొత్తేమీ కాదని ఆమె అన్నారు. అయితే.. ఒక ప్లాస్టిక్ సర్జన్ నుంచి తన రూపాన్ని మార్చుకోవాలంటూ నేరుగా మెసేజ్ రావడంపై మాత్రం ఆమె తీవ్రంగా స్పందించారు.

“నాకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదు”

ఆ డాక్టర్‌కు సమాధానమిస్తూ మెటె ఫ్రెడెరిక్సన్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. “నా ముక్కుపై ఉన్న మచ్చపై ఇంత శ్రద్ధ చూపించినందుకు ధన్యవాదాలు. కానీ నాకు ప్లాస్టిక్ సర్జరీ అవసరం లేదు” అని గట్టి కౌంటర్ ఇచ్చారు. తన శరీరం విషయంలో తాను పూర్తిగా సంతృప్తిగా ఉన్నానని, “నా రూపం గురించి సలహాలు ఇవ్వడానికి నాకు ఎలాంటి పురుష ప్లాస్టిక్ సర్జన్ అవసరం లేదు” అంటూ ఘాటుగా స్పందించారు.

“నా ముక్కు గురించి కాదు.. ప్రజా సమస్యల గురించి మాట్లాడండి”

ప్లాస్టిక్ సర్జన్‌కు మెటె ఫ్రెడెరిక్సన్ ఇచ్చిన అసలు కౌంటర్ ఇదే. “మీ విలువైన సమయాన్ని అర్థవంతమైన ప్రజా సమస్యల గురించి మాట్లాడటానికి ఉపయోగించండి. నా ముక్కు గురించి మాట్లాడటానికి కాదు” అని హితవు పలికారు. ప్రధాని కౌంటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తోంది. ఒక మహిళ ఎలా కనిపించాలి? తన శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి? అనే విషయాలపై ఇతరులు సలహాలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా మొదలైంది.

బాడీ షేమింగ్‌పై మరోసారి చర్చ

ప్రముఖ వ్యక్తులు సోషల్ మీడియాలో కనిపించినప్పుడు వారి పని కంటే వారి రూపం గురించే ఎక్కువగా వ్యాఖ్యలు రావడం కొత్తేమీ కాదు. ముఖంపై మచ్చ. జుట్టు. పళ్లు. బరువు. వయసు, ఇలా ప్రతి అంశంపైనా కామెంట్లు వస్తుంటాయి. ఒక వ్యక్తి తన రూపంతో సంతోషంగా ఉన్నప్పుడు.. దాన్ని మార్చుకోవాలని సలహా ఇవ్వడం అవసరమా? అనే ప్రశ్న ఇప్పుడు చర్చకు వచ్చింది.  డెన్మార్క్ ప్రధాని మాత్రం తన సమాధానంతో ఆ ప్రశ్నకు తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పేశారు. “నా రూపం గురించి కాదు.. ప్రజలకు ఉపయోగపడే విషయాల గురించి మాట్లాడండి” అన్న ఆమె సందేశం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

Follow Us