AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

క్రేజీ ఉద్యోగం.. జస్ట్ మేఘాలను వీడియో తీస్తూ నెలకు రూ. 8.5 లక్షలు సంపాదిస్తున్న కుర్రాడు!

రోజంతా కొండల మధ్య నిలబడి, గాలిలో తేలియాడే మేఘాలను చూస్తూ వీడియో తీయడమే ఆ కుర్రాడి ఉద్యోగం. పైగా నెలకు ఏకంగా రూ. 8.5 లక్షల జీతం! అసలు ఆ ఉద్యోగం ఏంటి? అంత పెద్ద మొత్తంలో జీతం ఎందుకు ఇచ్చారు?

క్రేజీ ఉద్యోగం.. జస్ట్ మేఘాలను వీడియో తీస్తూ నెలకు రూ. 8.5 లక్షలు సంపాదిస్తున్న కుర్రాడు!
He Watched Clouds From A Chinese Mountaintop And Earned Rs 8.5 Lakh
Sharada V
|

Updated on: Aug 20, 2026 | 12:10 PM

Share

నేటి డిజిటల్ యుగంలో చిత్ర విచిత్రమైన ఉద్యోగాలు వెలుగులోకి వస్తున్నాయి. చైనాలోని ఓ యువకుడు సరిగ్గా అలాంటి ఒక కలలో మాత్రమే సాధ్యమయ్యే ఉద్యోగంలో చేరిపోయాడు. చైనాలోని హేనాన్ ప్రావిన్స్‌లో ఉన్న ప్రసిద్ధ ‘లావోజున్ పర్వత’ ప్రాంత ప్రభుత్వ యంత్రాంగం ఒక వినూత్న ప్రకటన విడుదల చేసింది. తమ కొండలపై మారే మేఘాల సౌందర్యాన్ని చిత్రీకరించడానికి ఒక “క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్” అంటే మబ్బులను పరిశీలించే వ్యక్తి కావాలని కోరింది.

ఈ ఉద్యోగానికి నెలకు 60,000 యువాన్లు అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ. 8.5 లక్షలు జీతంతో పాటు ఉచిత వసతిని ఆఫర్ చేసింది. వార్త బయటకు రావడమే ఆలస్యం కేవలం వారం రోజుల్లోనే 3,500 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నెటిజన్లు దీనిని “డ్రీమ్ జాబ్” అని దేవతలు చేసే ఉద్యోగం అని అభివర్ణించారు.

3,500 మందిని వెనక్కు నెట్టి!

అంతమంది పోటీదారుల్లో దిగ్గజ ఫొటోగ్రాఫర్లను సైతం వెనక్కి నెట్టి ఆ అవకాశం ఒక 23 ఏళ్ల సాధారణ ఈ-కామర్స్ గ్రాడ్యుయేట్‌ను వరించింది. అతడే లీ సిచెన్. లీ రూపొందించిన వీడియోల నాణ్యత, సోషల్ మీడియాలో అతనికి వచ్చిన లైక్స్, షేర్ల ఆధారంగా యాజమాన్యం అతనిని క్లౌడ్‌స్కేప్ అబ్జర్వర్”గా ఎంపిక చేసింది. నెల రోజుల పాటు లీ ఆ పర్వతంపైనే ఉంటూ రోజూ ప్రకృతి అందాలను కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పంచుకోవాల్సి ఉం టుంది.

అనుకున్నంత ఈజీ కాదు… చుక్కలు కనిపించాయి!

బయటకు ఉద్యోగం  చాలా సరదాగా ఓ ఆటలా అనిపించినా.. ఆచరణలో లీకి చుక్కలు కనిపించాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కెమెరాలతో సిద్ధంగా ఉండాలి. రాత్రి వెలుగుల ప్రదర్శన పూర్తయ్యే వరకు వీడియోలు తీస్తూనే ఉండాలి. ఊహించని వాతావరణ మార్పులతో తాను అనుకున్న దృశ్యాలు రాక లీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. ఆ క్షణాలను అతడు “ఒక రకమైన చిత్రహింస”గా తెలిపాడు. తను తీసిన వీడియోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతాయో లేదో అన్న భయం అతడిని నిరంతరం వెంటాడింది.

లావోజున్ పర్వతానికి 2,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉంది. తావోయిజం వ్యవస్థాపకుడైన ‘లావో జు’ పేరుతో ఫేమస్ అయింది. నిరంతరం మంచు తెరల మధ్య అద్భుతంగా ఉండే ఆ కొండ ప్రాంతం చైనాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 5A-లేవల్ పర్యాటక ప్రాంతం. అయితే పర్వత ప్రాంతం మిలటరీ బేస్ కు సమీపంలో ఉండటం వల్ల  విదేశీ పర్యాటకులకు ప్రవేశం లేదు. కేవలం చైనీయులకు మాత్రమే అనుమతి ఉంది.

నెల రోజుల పాటు డ్రోన్లు ఆపరేట్ చేయడం, కలర్ గ్రేడింగ్, వీడియో ఎడిటింగ్ వంటి కొత్త నైపుణ్యాలను లీ నేర్చుకున్నాడు. “సమయం ఎంత వేగంగా గడిచిపోయిందో తెలియలేదు” అని చెబుతూ తన అనుభవాలను వ్లాగ్స్ రూపంలో షేర్ చేసుకున్నాడు. ప్రకృతిని ఆస్వాదించడం కేవలం ఒక వ్యాపకం మాత్రమే కాదు… సరిగ్గా ఆలోచిస్తే అదొక రూ. 8.5 లక్షల ఉద్యోగ అవకాశం అని లీ సిచెన్ నిరూపించాడు!

Follow Us