USA: అమెరికాలో పెరిగిన దొంగల బెడద.. భారతీయుల ఇళ్లను టార్గెట్ చేస్తోన్న దొంగలు

|

Oct 16, 2024 | 7:20 PM

అమెరికాలో దొంగలు రెచ్చిపోతున్నారు. నాన్‌ అమెరికన్స్‌ టార్గెట్‌గా చోరీలు చేస్తున్నారు. ఇండియన్స్‌ ఇండ్లకు కన్నాలు వేస్తున్నారు. తెలుగువారి ఇళ్లయితే చాలు... మరీ ముచ్చటపడిపోతున్నారు దొంగలు.. భారతీయులనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మనవాళ్ల ఇళ్లలో దొంగలకు అంతగా నచ్చిందేంటి?

USA: అమెరికాలో పెరిగిన దొంగల బెడద.. భారతీయుల ఇళ్లను టార్గెట్ చేస్తోన్న దొంగలు
Burglars
Follow us on

అగ్రరాజ్యం అమెరికాలో 2008-2012 మధ్య దొంగతనాలు ఎక్కువగా జరిగేవి. 2012 తర్వాత దొంగతనాలు తగ్గిపోయాయి. అయితే ఈ ఏడాది ప్రారంభం నుంచి యూఎస్‌లోని పలు రాష్ట్రాల్లో చోరీలు విపరీతంగా పెరిగాయి. FBI డేటా ప్రకారం అమెరికాలో ఈ ఆరు నెలల్లో 5వేలకు పైగా చోరీలు జరిగాయి. వీరిలో 62 శాతానికి పైగా బాధితులు నాన్‌ అమెరికన్స్‌ కాగా.. వీరిలో 21 శాతం మంది బాధితులు భారతీయులే . పలు దేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వారి ఇళ్లను దొంగలు టార్గెట్ చేసి బంగారం చోరీ చేస్తున్నారు. అమెరికా మార్కెట్‌లో బంగారం ధర పెరగడంతో దొంగల కళ్లు పసిడిపై పడ్డాయి.

అమెరికా దొంగలు ఎక్కువగా భారతీయులను టార్గెట్ చేస్తున్నారు. ఎందుకంటే భారతీయుల దగ్గరే బంగారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మన తెలుగువారి ఇళ్లలో గోల్డ్‌ అధికంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్న వారి ఆస్తులను అమ్మేసి బంగారం రూపంలో తీసుకెళ్తారు ఎన్నారైలు. ప్రతి ఇంట్లో 200 గ్రాముల నుంచి 250 గ్రాముల బంగారం అయితే కచ్చితంగా ఉంటుంది. అందుకే దొంగలు అమెరికాలో సెటిలైన భారతీయుల ఇళ్లను టార్గెట్ చేశారు. ఇటీవల కాలిఫోర్నియాలో 30 వేల డాలర్ల విలువైన బంగారాన్ని దోచేశారు దొంగలు.

టూరిజం వెసులుబాటును వాడుకుని అమెరికాకు టూరిస్ట్ వీసాపై వస్తున్నారు దొంగలు. ఇండో అమెరికన్స్‌ ఉండే ప్రాంతాల్లో ఇళ్లను అద్దెకు తీసుకుంటున్నారు . ఆ ఇంట్లో ఉన్నవారిపై నిఘాపెడుతున్నారు. వారు పనినిమిత్తం బయటకు వెళ్లగానే తమ చోరకళను ప్రదర్శించి ఇల్లును లూటీ చేస్తున్నారు. 34 శాతం దొంగతనాలను ఈజీగా చేసేస్తున్నారు. 23 శాతం దొంగతనాలు ఫస్ట్‌ ఫ్లోర్ కిటికీల్లోంచి వెళ్లి చేసినవేనని ఎఫ్‌బీఐ రిపోర్ట్స్‌ చెబుతున్నాయి. దొంగలు ఇంట్లోకి వెళ్లిన10 నిమిషాల్లోనే పనిముగించేస్తున్నారు. బంగారం, లాప్‌టాప్‌, మొబైల్స్‌ ఎత్తుకెళ్తున్నారు. తమ కుటుంబ వారసత్వంగా వచ్చిన బంగారం, అమ్మానాన్న గుర్తుగా దాచుకున్న బంగారం పోవడంతో చాలామంది బాధితులు ఆవేదనకు గురవుతున్నారు.

వీసా సమస్యలను ఎదుర్కొంటున్న భారతీయులు బంగారం పోయినా ఫిర్యాదు చేయలేని పరిస్థితి నెలకొంది. బంగారం బ్యాంక్‌ లాకర్లలో దాచుకోవాలన్నా, మళ్లీ వెనక్కి తీసుకోవాలన్న పెద్ద ప్రాసెస్‌ ఉంటుంది. ఒకవేళ బ్యాంక్‌లాకర్లలో పెట్టినా వాటికి ఇన్సూరెన్స్‌ ఉండదు. దీంతో చాలా మంది తమ ఇళ్లలోనే బంగారాన్ని దాచుకుంటున్నారు.

భారతీయుల ఇళ్లలో చోరీలకు పాల్పడ్డ 17 మందిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో 18 ఏళ్లలోపు వారే ఎక్కువగా ఉన్నారు. అమెరికా చట్టాల ప్రకారం మైనర్లకు తక్కువ శిక్ష పడుతుంది. దీంతో దొంగల బ్యాచ్‌ టీనేజర్స్‌ను చోరీలకు ఉపయోగించుకుంటున్నారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఇండో అమెరికన్స్‌ ఉండే ప్రాంతాల్లో నిఘా పెంచుతామంటున్నారు పోలీసులు.

దేశంకాని దేశంలో జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సంపద దొంగల పాలవుతుండటం భారతీయులను కంటతడిపెట్టిస్తుంది. ఫంక్షన్లు, పండగలకు కూడా బంగారాన్ని ధరించాలంటే భయపడే పరిస్థితి నెలకొంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి