AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాకిస్తాన్‌ సైనికులకు చుక్కలు చూపిస్తున్న బలూచ్‌ మహిళా దళం.. 9 మంది జవాన్లు మృతి!

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో హింసాత్మక ఘటనలు పెరిగాయి. బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF)కి చెందిన కొత్త మహిళా సాయుధ విభాగం, కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్ (KAAD), పాక్ సైనిక కాన్వాయ్‌పై దాడి చేసింది. ఈ దాడిలో తొమ్మిది మంది సైనిక సిబ్బంది మరణించినట్లు BLF ప్రకటించింది. CPEC మార్గంలో జరిగిన ఈ దాడి, తిరుగుబాటు ఉద్యమంలో మహిళల కొత్త పాత్రను సూచిస్తుంది. అయితే, మరణాల సంఖ్య స్వతంత్రంగా ధృవీకరించలేదు.

పాకిస్తాన్‌ సైనికులకు చుక్కలు చూపిస్తున్న బలూచ్‌ మహిళా దళం.. 9 మంది జవాన్లు మృతి!
Baloch Women Fighters
Balaraju Goud
|

Updated on: Sep 30, 2026 | 8:10 AM

Share

పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ మరోసారి హింసాత్మక ఘటనతో వార్తల్లోకి వచ్చింది. పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌పై బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ (BLF)కు చెందిన కొత్త మహిళా సాయుధ విభాగం దాడి చేసినట్లు ఆ సంస్థ ప్రకటించింది. ఈ దాడిలో తొమ్మిది మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మృతి చెందినట్లు BLF పేర్కొంది. అయితే ఈ మరణాల సంఖ్యను స్వతంత్రంగా ధృవీకరించిన సమాచారం ఇప్పటివరకు అందుబాటులో లేదు.

BLF తాజాగా విడుదల చేసిన వీడియోలో తమ కొత్త మహిళా విభాగమైన కరీమా ఆర్మ్డ్ అసాల్ట్ డివిజన్ (KAAD) సభ్యులు సైనిక కాన్వాయ్‌పై దాడి చేస్తున్న దృశ్యాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. సెప్టెంబర్ 22న బలూచిస్తాన్‌లోని తుర్బత్ సమీపంలోని జుసాక్ ప్రాంతంలో చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC)కు అనుసంధానమైన రహదారిపై ఈ దాడి జరిగినట్లు BLF తెలిపింది.

విడుదల చేసిన ఫుటేజీలో మూడు వాహనాలతో వెళ్తున్న పాకిస్తాన్ క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ (QRF) కాన్వాయ్‌పై సాయుధులు కాల్పులు జరుపుతున్నట్లు కనిపిస్తోంది. ఇందులో ఓ ఆర్మర్డ్ వాహనం కూడా ఉన్నట్లు రిపోర్టులు పేర్కొన్నాయి. దాడికి ముందు మహిళా కమాండర్ తమ సభ్యులకు సూచనలు ఇస్తున్న దృశ్యాలతో పాటు, సాయుధ శిక్షణకు సంబంధించిన వీడియోలను కూడా BLF విడుదల చేసింది.

తమ కొత్త మహిళా విభాగం చేపట్టిన ఇదే తొలి సాయుధ ఆపరేషన్ అని BLF ప్రకటించింది. ఆ తర్వాత సెప్టెంబర్ 25న కలాత్ జిల్లాలోని మంగుచర్ ప్రాంతంలోనూ KAAD సభ్యులు సైనిక బలగాల కాన్వాయ్‌లను అడ్డుకుని దాడులు చేసినట్లు సంస్థ తెలిపింది. ఈ రెండు ఘటనల్లో కలిపి తొమ్మిది మంది పాకిస్తాన్ సైనిక సిబ్బంది మృతి చెందినట్లు BLF పేర్కొంది.

BLF విడుదల చేసిన మరో వీడియోలో KAAD సభ్యులు ఆయుధాలు, సైనిక పరికరాలతో శిక్షణ పొందుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీంతో బలూచ్ తిరుగుబాటు ఉద్యమంలో మహిళల సాయుధ భాగస్వామ్యానికి కొత్త రూపం ఏర్పడినట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే వీడియోలలో కనిపించే ఘటనలు, BLF ప్రకటించిన మృతుల సంఖ్యపై స్వతంత్ర ధృవీకరణ పరిమితంగానే ఉంది.

బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ భద్రతా బలగాలు, వేర్పాటువాద గ్రూపుల మధ్య చాలాకాలంగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. CPEC ప్రాజెక్టులు, సైనిక స్థావరాలు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని బలూచ్ సాయుధ సంస్థలు గతంలోనూ దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. తాజాగా ప్రత్యేక మహిళా విభాగాన్ని రంగంలోకి దించినట్లు BLF ప్రకటించడం ఈ సంఘర్షణలో మరో పరిణామంగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us