అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల మోత.. షాపింగ్ మాల్ వద్ద రక్తపాతం..!
అమెరికాలో మరోసారి తుపాకీ మోత మోగింది. రద్దీగా ఉండే షాపింగ్ ప్రాంతంలో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ముగ్గురు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు గాయపడగా, ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఎదురు కాల్పుల్లో దుండగుడిని హతమార్చారు. ఈ ఘటనతో అమెరికాలో తుపాకీ హింస, భద్రతా వ్యవస్థలపై మరోసారి చర్చ మొదలైంది.

అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఇడాహో రాష్ట్రంలోని ట్విన్ ఫాల్స్ నగరంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర కలకలం రేపింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం (ఆగస్టు 01) మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రముఖ ఇన్-ఎన్-అవుట్ బర్గర్ రెస్టారెంట్ సమీపంలోని షాపింగ్ ప్రాంతానికి వచ్చిన ఓ దుండగుడు అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించాడు.
రద్దీగా ఉన్న ప్రాంతంలో ఒక్కసారిగా తుపాకీ శబ్దాలు వినిపించడంతో అక్కడున్న ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు మరణించినట్లు ప్రాథమిక సమాచారం వెలువడగా, పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్యపై అధికారులు అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.
సమాచారం అందుకున్న వెంటనే ట్విన్ ఫాల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దుండగుడిని లొంగిపోవాలని హెచ్చరించినప్పటికీ అతడు కాల్పులు కొనసాగించడంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో ఏఆర్-శైలి రైఫిల్‌తో దుండగుడు రెస్టారెంట్ ముందు తిరుగుతూ కనిపించగా, మరో వీడియోలో పార్కింగ్ ప్రాంతంలో విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్న దృశ్యాలు నమోదయ్యాయి. అయితే వైరల్ వీడియోల ప్రామాణికతపై అధికారులు అధికారికంగా నిర్ధారణ ఇవ్వాల్సి ఉంది.
వీడియో ఇక్కడ చూడండి..
WATCH: Video reportedly shows one of the two believed suspects opening fire with what appears to be an AR-style rifle in a parking lot in Twin Falls, Idaho. No word on casualties. pic.twitter.com/eBo3zagILN
— Scope Report (@ScopeReport_) August 1, 2026
ఈ ఘటన జరిగిన గంటలోపే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ట్విన్ ఫాల్స్ పోలీస్ చీఫ్ మాథ్యూ హిక్స్ తెలిపారు. ప్రస్తుతం సమాజానికి ఎలాంటి ముప్పు లేదని, దుండగుడి గుర్తింపు, దాడి వెనుక ఉన్న ఉద్దేశ్యంపై దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా షాపింగ్ ప్రాంతం చుట్టూ ఉన్న రహదారులు, సమీప వంతెనను తాత్కాలికంగా మూసివేశారు.
ఇటీవలి కాలంలో అమెరికాలో పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, షాపింగ్ సెంటర్లు, ఆహార ఉత్సవాలు, బహిరంగ కార్యక్రమాల్లో వరుసగా కాల్పుల ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా ఘటనతో మరోసారి అమెరికాలో తుపాకీ చట్టాల కఠినత, ప్రజల భద్రత, గన్ కల్చర్‌పై జాతీయ స్థాయిలో చర్చ మొదలైంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
