మన ఉసిరి చెట్టుకి.. మలక్కా జలసంధికీ ఏంటా సంబంధం ?

Updated on: Apr 20, 2026 | 4:28 PM

ట్రంప్‌ దృష్టి మలక్కా జలసంధిపై పడటంతో దాని వ్యూహాత్మక ప్రాముఖ్యత ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ జలసంధికి పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఉసిరి చెట్టు (మెలక వృక్షం) పేరు మీదుగానే "మలక్కా" అనే పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది. ఇండోనేసియా రాజు పరమేశ్వర ఓ సంఘటనతో ప్రభావితమై ఆ ప్రాంతాన్ని "మెలక" అని పిలిచారు. ఈ కీలకమైన జలమార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి, ఆసియా భద్రతకు అత్యంత కీలకం.

హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోన్న అధ్యక్షుడు ట్రంప్‌ చూపు ఇప్పుడు ఆసియాలోని మలక్కా జలసంధిపై పడింది. అక్కడ పట్టు కోసం ఇండోనేసియాతో డీల్‌ కుదుర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో ఆ జలసంధి పేరు నెట్టింట వైరల్‌ అవుతోంది. అదే సమయంలో ఓ ఆసక్తికర అంశం బయటకొచ్చింది. మన దేశంలో పవిత్రంగా భావించే ఉసిరి చెట్టు పేరు మీదుగానే ఈ జలసంధికి ‘మలక్కా’ అనే పేరు వచ్చిందట..! 14వ శతాబ్దంలో ఇండోనేసియాలో రాజు పరమేశ్వర తన రాజ్యాన్ని కోల్పోయారు. ఆ తర్వాత తిరుగుతూ తిరుగుతూ మలయ్‌ ద్వీపకల్పానికి చేరుకున్నారు. అక్కడ ఓ రోజు వేట కోసం వెళ్లి నది ఒడ్డున ఓ చెట్టు కింద కూర్చుని ఉండగా ఆసక్తికర దృశ్యం కన్పిస్తుంది. ఓ చిన్న జీవి తనను వేటాడుతున్న కుక్కలతో భీకరంగా పోరాడి వాటిని తరిమికొడుతుంది. ఆ దృశ్యం ఆయనలోని ఆత్మస్థైర్యాన్ని మేల్కొలుపుతుంది. దాన్ని శుభపరిణామంగా భావించి ఆ రాజు అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకుంటారు. అలా అక్కడే కొత్త రాజ్యాన్ని ఏర్పరుచుకున్నారు. ఏ చెట్టు కిందైతే తనకు మంచి జరిగిందని ఆయన భావించాడో.. ఆ ‘మెలక’ వృక్షం పేరే తన కొత్త రాజ్యానికి పెట్టుకుంటారు. మెలక వృక్షాన్నే మన భారతీయ సంస్కృతిలో ఉసిరి చెట్టుగా పిలుస్తాం. సంస్కృతంలో ఉసిరి చెట్టును అమలక అంటారు. వాడుక భాషలో అది ఆమ్లా అయ్యింది. అలా ఆ మెలక ప్రాంతం నెమ్మదిగా సముద్ర తీర నగరంగా అభివృద్ధి చెందింది. కాలక్రమేణ అదే ‘మలక్కా జలసంధి’గా స్థిరపడింది. ఉసిరి చెట్టును భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఆయుర్వేదం, ఇతర ఔషధాల తయారీలో వాడతారు. ఉసిరిలో విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉంటుంది. మలక్కా జలసంధి దాదాపు 900 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అండమాన్‌, దక్షిణ చైనా సముద్ర జలాలను కలుపుతుంది. వ్యూహాత్మకంగా, భౌగోళికంగా ఇది కీలక జలసంధి. మలక్కాలో ఇరుకైన మార్గాల ద్వారా కూడా ఏటా 80వేల నౌకలు రాకపోకలు సాగిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Prakash Raj Vs Vijay: TVK చీఫ్ గాలి తీసిన ప్రకాశ్ రాజ్

Naga Babu: రామ నామాన్ని ఎగతాళి చేస్తే నాశనమైపోతావ్

‘ఇంట్రెస్టింగ్ మిస్టికల్ థ్రిల్లర్..’ ఆహాలో మంచి సిరీస్

ఇదో స్వచ్ఛమైన పల్లెటూరి కథ..! 90ల్లోకి అలా వెళ్లి వచ్చేయచ్చు

Follow Us