ఇంటి ఆవరణలో భారీ శబ్దాలు.. పొదల చాటున సీన్ చూసి గుండె గుభేల్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో అర్ధరాత్రి ఇంటి ఆవరణలో 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న రిటైర్డ్ అటవీ అధికారి మహమ్మద్ చాకచక్యంగా దానిని పట్టుకున్నారు. అనంతరం నీలాద్రి అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు. గత మూడు నెలలుగా ఈ ప్రాంతంలో కొండచిలువల సంచారం పెరగడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అర్ధరాత్రి వేళ భయాందోళన కలిగించే ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని కృషి బైపాస్ రోడ్డు సమీపంలోని ఒక ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిమ్మ చీకటిలో భారీ శబ్దాలు రావడం చూసి స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఏమైందోనని భయపడుతూనే పొదల వద్దకు వెళ్ళి చూడగా.. నిశ్శబ్దంగా పాకుతూ వస్తున్న 12 అడుగుల భారీ కొండచిలువ కనిపించింది. అది చూసి భయంతో ఒక్కసారిగా అంతా పరుగులు తీసారు. ఇటీవల సంభవించిన ‘మురసు’ తుఫాను వల్ల వచ్చిన భారీ వరదల కారణంగా సత్తుపల్లి అటవీ ప్రాంతం నుంచి ఈ కొండచిలువ జనావాసాల్లోకి కొట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. వెంటనే కాలనీవాసులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రిటైర్డ్ ఎఫ్బీఓ మహమ్మద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని, ఎంతో చాకచక్యంగా ఆ కొండచిలువను బంధించారు. అనంతరం దానిని నీలాద్రి అర్బన్ పార్క్ అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమీప ప్రాంతాల్లో గత మూడు నెలలుగా కొండచిలువల సంచారం విపరీతంగా పెరిగిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే మున్సిపల్ చైర్మన్, సిబ్బందికి ఫిర్యాదు చేయడంతో పిచ్చి చెట్లను తొలగించి పరిసరాలను శుభ్రం చేసినప్పటికీ.. మళ్లీ జనావాసాల్లోకి ఇలాంటి కొండచిలువలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని కాలనీవాసులు భయపడుతున్నారు. కొండచిలువల బారినుంచి అటవీ అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమాన టికెట్లు బుక్ చేశాక రైలు టికెట్లు కన్ఫామ్.. రైల్వేకు రూ.19,000 జరిమానా!
బీచ్ ఒడ్డుకు కొట్టుకు వచ్చిన భారీ తిమింగలం.. స్థానికులు ఏం చేశారో చూడండి!
