మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు… సైకోలుగా మారుతున్న యువకులు.. అమావాస్య‌కు ముందు కలకలం

Updated on: Oct 08, 2026 | 6:44 PM

పల్నాడు జిల్లా నరసరావుపేటలో మూఢనమ్మకాల నేపథ్యంలో జరిగినట్లు చెబుతున్న హత్య కేసు కలకలం రేపుతోంది. నిద్రిస్తున్న రాజేష్‌ను బండరాయితో కొట్టి చంపిన నిఖిల్‌, మృతుడి శరీరంలోని కొన్ని భాగాలను తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో 2018లో నాగరాజు అనే వ్యక్తిని కూడా ఇదే తరహాలో హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించినట్లు సమాచారం. సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో నిఖిల్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

శాస్త్ర సాంకేతిక రంగాల్లో మానవుడు దూసుకుపోతున్నాడు. రోజు రోజుకీ టెక్నాలజీ ఎంతగానో పెరుగుతోంది. నిరక్షరాసులు, మారుమూల ప్రాంతాల ప్రజలు సైతం టెక్నాలజీని అందిపుచ్చుకొని ముందుకుసాగుతున్నారు. అలాంటి ఈ కాలంలో కూడా, కొందరు మూఢనమ్మకాల ఊబిలో కూరుకుపోయి.. కంటికి కనిపించని ‘శక్తుల’ కోసం మనుషుల ప్రాణాలు తీసే దారుణాలు సమాజాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. మంత్రాలు, క్షుద్ర పూజలు, అద్భుత శక్తులు వస్తాయనే పిచ్చి నమ్మకాలతో మనుషులను బలిఇచ్చే మూర్ఖత్వం ఇంకా మనుగడలో ఉందనడానికి పల్నాడు జిల్లాలో వెలుగుచూసిన ఈ దారుణ ఘటనే నిదర్శనం. నిద్రపోతున్న అమాయకులను లక్ష్యంగా చేసుకుని, హత్యలు చేసి, వారి శరీర భాగాలను పూజల కోసం తీసుకెళ్లిన ఒక సైకో కిల్లర్‌ ఉదంతం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. నరసరావుపేట పట్టణం, బరంపేటకు చెందిన నిఖిల్ అనే యువకుడు పనీ పాటా లేకుండా జులాయిగా తిరిగేవాడు. పైకి అందరిలాగే సాధారణంగానే కనిపించేవాడు. కానీ ఆ యువకుడి మనస్సులో ఎంతటి క్రూరమైన, వికృత ఆలోచనలు నిండి ఉన్నాయో ఎవరికీ తెలియదు. మానవ శరీర భాగాలతో పూజలు చేస్తే తనకు అద్భుత శక్తులు వస్తాయని, లోకాన్ని శాసించవచ్చని బలంగా నమ్మాడు. ఈ అపోహతోనే, గాసి రాజేష్‌ అనే వ్యక్తిపై నిఖిల్‌ కన్ను పడింది. అతన్ని ఎలాగైనా చంపి, ఆ శరీరభాగాలతో క్షుద్రపూజలు చేయాలనుకున్నాడు. సెప్టెంబర్‌ 29వ తేదీన నరసరావుపేటలో బ్రహ్మానందరెడ్డి కాంప్లెక్స్ అండర్ గ్రౌండ్‌లో ఆదమరిచి..ప్రశాంతంగా నిద్రపోతున్న రాజేష్‌ తలపై బండరాయితో బాది అత్యంత దారుణంగా హత్య చేశాడు. మరుసటి రోజు ఉదయం రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే, శవపరీక్షతో పాటు ప్రాథమిక విచారణలో ఒక విస్తుపోయే విషయం వెలుగులోకి వచ్చింది. రాజేష్ గుండె భాగంపై ఉన్న చర్మంతో పాటు ఆయన మర్మాంగాలపై ఉన్న వెంట్రుకలను నిందితుడు కోసి తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. హత్య సాధారణ కక్షలతో జరిగి ఉంటే ఇలా శరీర భాగాలను కోసుకెళ్లాల్సిన అవసరం ఏముందనే కోణంలో పోలీసులకు అనుమానం మొదలైంది. పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్ అడహళ్లి మార్గదర్శకత్వంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ పుటేజీలను పోలీసులు జల్లెడ పట్టారు. అందులో నిఖిల్ కదలికలు అనుమానాస్పదంగా కనిపించడంతో, సాంకేతిక ఆధారాల సహాయంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో నిఖిల్‌ను విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. తాజాగా చేసిన హత్యే కాకుండా, 2018లో తాను చేసిన మరొక దారుణ హత్యను కూడా నిందితుడు ఒప్పుకున్నాడు. 2018లో ‘నాగరాజు’ అనే వ్యక్తిని కూడా ఇదే విధంగా దారుణంగా హత్య చేసిన నిఖిల్, ఆయన చేతి వేలును కోసుకుని తీసుకెళ్లాడు. అప్పట్లో ఆ హత్య మిస్టరీగా మిగిలిపోగా, ఇప్పుడు ఈ రెండవ హత్య దర్యాప్తులో ఆనాటి పాత కేసు కూడా పరిష్కారమైంది. విచారణలో అతడి మానసిక స్థితి సరిగా లేదని, క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల పిచ్చిలోనే ఈ హత్యలు చేశానని నిందితుడు అంగీకరించాడు. సేకరించిన పక్కా ఆధారాలతో నిఖిల్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసును సమర్థవంతంగా చేధించిన పోలీస్ అధికారులను జిల్లా ఎస్పీ అభినందించారు. 21వ శతాబ్దంలో మనం అంతరిక్ష యాత్రలు చేస్తున్నాం, కృత్రిమ మేధస్సు తో లోకాన్ని శాసిస్తున్నాం. కానీ మరోవైపు, ఇలాంటి అజ్ఞానంతో కూడిన మూఢనమ్మకాలు మన సమాజంలో ఇంకా వేర్లూనుకుని ఉండటం అత్యంత బాధాకరం. లక్షలు సంపాదించవచ్చని, అమరత్వం వస్తుందని, అద్భుత శక్తులు వస్తాయని కొందరు నకిలీ తాంత్రికులు, యూట్యూబ్ లేదా సోషల్ మీడియాలోని తప్పుడు సమాచారం వల్ల కొందరు యువకులు దారి తప్పుతున్నారు. అనారోగ్యకరమైన ఆలోచనలు ఉన్నవారు లేదా వికృతమైన సైకో లాంటి మానసిక స్థితి ఉన్నవారు ఇలాంటి పూజల పేరిట సమాజంలో నేరాలకు తెగబడుతున్నారు. దైవచింతన వేరు, మూఢనమ్మకం వేరు. తోటి మనిషి ప్రాణాన్ని తీసి, శరీర భాగాలతో పూజలు చేస్తే శక్తులు వస్తాయనుకోవడం కేవలం వికృత మనస్తత్వం తప్ప మరొకటి కాదు. ఇలాంటి దారుణాల బారిన పడకుండా ఉండాలంటే సమాజంలో ప్రక్షాళన జరగాలి. విచక్షణ పెంచుకోవాలి. సైన్స్ ఎంత పెరిగినా మనుషుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందనంత వరకు ఇలాంటి ఘోరాలు జరుగుతూనే ఉంటాయి. కుటుంబ సభ్యులు ఎవరైనా వింతగా ప్రవర్తిస్తున్నా, మూఢనమ్మకాల వైపు ఆకర్షితులవుతున్నా వెంటనే మానసిక నిపుణులకు చూపించి కౌన్సిలింగ్ ఇప్పించాలి. పరిసరాల్లో క్షుద్ర పూజలు, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే భయపడకుండా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. నరసరావుపేట ఘటన ప్రతి ఒక్కరినీ హెచ్చరిస్తోంది. నమ్మకం హద్దులు దాటి అంధవిశ్వాసంగా మారితే అది మనిషిని నరరూప రాక్షసుడిగా మారుస్తుందనడానికి ఈ సంఘటన ఒక స్పష్టమైన హెచ్చరిక.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు.. హోంగార్డ్ ఈవెంట్స్‌లో అదరగొట్టిన మహిళ

రెండో అంతస్తునుంచి పడిపోయిన బాలుడు.. అద్భుతంగా సేవ్‌ చేసిన యువకుడు!

ఏఐతో పెను ప్రమాదం తప్పదు.. ఓపెన్‌ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా

ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..

విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన కరెంట్‌ ఛార్జీలు

Loading...
Unable to load recommendations.
Follow Us