వామ్మో… ఈ శునకం ట్యాలెంట్ మామలుగా లేదు!
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మాచవరానికి చెందిన ఓ కుటుంబం పెంచుకుంటున్న ‘మ్యాక్సీ’ అనే లాబ్రడార్ కుక్క తన తెలివితేటలతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొబ్బరికాయలు తీసుకురావడం, పశువులను మేతకు తీసుకెళ్లి తిరిగి తీసుకురావడం వంటి పనులను స్వయంగా చేస్తూ కుటుంబ సభ్యుడిలా మారింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మనుషులకన్నా మూగజీవాలకే విశ్వాసం, ప్రేమ ఎక్కువ అంటుంటారు. ఆ మాటను అక్షరాలా నిజం చేస్తూ ఓ పెంపుడు కుక్క ఇంట్లో పెద్ద కొడుకులా బాధ్యతలు నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. డాగ్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఘటన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వెలుగుచూసింది. అంబాజీపేట మండలం మాచవరం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ నాగాబత్తుల కాంతకుమారి, సుబ్బారావు దంపతులు గత కొన్నేళ్లుగా ‘మ్యాక్సీ’ అనే లాబ్రడార్ జాతి కుక్కను పెంచుకుంటున్నారు. సాధారణంగా పెంపుడు కుక్కలు షేక్ హ్యాండ్ ఇవ్వడం, పిలవగానే రావడం చూస్తుంటాం. కానీ మ్యాక్సీ మాత్రం ఇంట్లో మనుషుల లాగే పనులు చేస్తుంది. తోటలో కొబ్బరికాయ పడిన శబ్దం వినిపిస్తే చాలు.. వెంటనే పరిగెత్తుకెళ్లి ఆ కొబ్బరికాయను నోట కరుచుకుని తెచ్చి ఇంట్లో పెడుతుంది. అంతేకాదు, వీరు పెంచుకుంటున్న ఆవును, గేదెను పొలంలోకి తీసుకెళ్లడం, అవి మేత మేసాక తాడును నోటితో పట్టుకుని తిరిగి పశువుల పాక వద్దకు తీసుకురావడం వంటి పనులన్నీ మ్యాక్సీ స్వయంగా చేస్తుంది. తాము ఏం చెబితే అది చేస్తుందని, మ్యాక్సీని తమ పెద్ద కుమారుడిలా భావిస్తున్నామని ఆ దంపతులు గర్వంగా చెబుతున్నారు. అది ఒక్క గంట కనిపించకపోతే అల్లాడిపోతామని, ఊరికి వెళ్లినా తమ వెంటే తీసుకెళ్తామని తెలిపారు. మనుషుల ప్రేమ కంటే మూగజీవాల ప్రేమే స్వచ్ఛమైనదని మ్యాక్సీని చూస్తే అర్థమవుతుందని వారు మురిసిపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సమోసా కోసం.. లోకోపైలెట్ ట్రైన్ ఆపాడా? నెట్టింట వీడియో వైరల్.. ఎంతవరకు నిజం?
కలను సాకారం చేసిన.. రూ.10 కాయిన్లతో రూ.1.10 లక్షల బైక్!
పెట్రోల్‌లో ఇథనాల్ మిక్సింగ్‌తో వాహనాలు చెడిపోతాయా? నిజమెంత?
