ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో చూస్తే షాక్!
కింగ్ కోబ్రా కేవలం భయంకరమైన విషసర్పమే కాదు.. గుడ్ల సంరక్షణలోనూ ప్రత్యేక ప్రవర్తన చూపిస్తుంది. ఆడ కింగ్ కోబ్రా ఎండుటాకులు, చిన్న కొమ్మలను ఒకచోట చేర్చి గూడును నిర్మిస్తుంది. ఆకులు కుళ్లే సమయంలో ఉత్పత్తయ్యే సహజ వేడితో గుడ్లను వెచ్చగా ఉంచుతుంది. సాధారణంగా 21 నుంచి 40 వరకు గుడ్లు పెడుతుంది. గూడు వద్ద ఉండి వాటిని కాపాడే సమయంలో ఈ పాము అత్యంత అప్రమత్తంగా ఉంటుంది.
సహజంగా మనకు పాము కనిపిస్తే చాలు.. గుండె ఆగినంత పనవుతుంది. ప్రాణభయంతో పరుగులు తీస్తాం. ఇక అదే పాము కనుక ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన ‘కింగ్ కోబ్రా’ అయితే.. పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక్క కాటుతో ఏనుగునైనా సరే క్షణాల్లో యమలోకానికి పంపగల శక్తి ఈ రాచనాగు సొంతం. కానీ.. ఈ భయానక పాము వెనుక ఒక అద్భుతమైన, ఎంతో భావోద్వేగంతో కూడిన ప్రకృతి రహస్యం దాగి ఉంది. సాధారణంగా ఏ పాము అయినా సరే.. పుట్టల్లోనో, చెట్ల కిందో గుడ్లు పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. కానీ, ప్రపంచంలోనే గుడ్ల కోసం స్వయంగా గూడు నిర్మించే ఏకైక పాము ఈ కింగ్ కోబ్రా మాత్రమే. ఒక ఇంజనీర్‌లా ప్లాన్ చేసి, తన పిల్లలను కాపాడుకోవడానికి అది పడే తపన చూస్తే మీ రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. మరి ఆ పాములో దాగిన మాతృత్వపు రహస్యం ఏంటి? ఓ పాము గూడును ఎలా కడుతుంది? గుడ్ల నుంచి పిల్లలు వచ్చే సమయానికి ఆ తల్లి ఎందుకు దూరంగా వెళ్లిపోతుంది? ఈ ఆసక్తికరమైన విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్, మే నెలల్లో ఎండలు ముగిసి వర్షాలు పడే సమయానికి ఆడ కింగ్ కోబ్రా తన జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమవుతుంది. అదే గూడు నిర్మాణం. గుడ్లు పెట్టడానికి సాధారణ స్థలం సరిపోదని భావించే ఈ రాచనాగు.. నీరు చేరని, ఎత్తైన, డ్రై గా ఉండే ప్రదేశాన్ని ఎంచుకుంటుంది. ముఖ్యంగా పెద్ద చెట్ల కిందనో లేదంటే దట్టమైన వెదురు పొదలనో సెలెక్ట్ చేసుకుంటుంది. ఆడ కింగ్ కోబ్రాకు గూడు కట్టడం అంత తేలికైన పనేం కాదు. తన పొడవైన, బలమైన శరీరాన్ని ఉపయోగించి కింద పడి ఉన్న ఎండుటాకులు, చిన్న కొమ్మలను ఒకచోటకు లాక్కొస్తుంది. ఇందుకోసం అది ఎన్నో కిలోమీటర్ల దూరం తిరగాల్సి వస్తుంది. చాలా ఎనర్జీని కోల్పోతుంది. అలా సేకరించిన ఆకులను గుట్టగా పేర్చుతుంది. దానిపై పదే పదే పాకుతూ, తన శరీరంతో గట్టిగా నొక్కుతుంది. ఇలా దాదాపు 3 నుంచి 4 అడుగుల ఎత్తులో, అచ్చం ఒక డోమ్ ఆకారంలో వాటర్‌ప్రూఫ్ గూడును తయారు చేస్తుంది. వర్షపు నీరు లోపలికి వెళ్లకుండా, గుడ్లకు ఎలాంటి హాని జరగకుండా ఈ గూడును ఒక నిపుణుడైన ఇంజనీర్‌లా నిర్మిస్తుంది. ఈ గూడు లోపల ఒక ప్రత్యేకమైన గుంతను తయారు చేస్తుంది. అందులో దాదాపు 15 నుంచి 40 లేదా 50 వరకు గుడ్లను పెడుతుంది. ఆ తర్వాత ఆ గుడ్లన్నింటినీ మళ్లీ ఆకులతో భద్రంగా కప్పేస్తుంది. ఇక్కడే అసలైన సైన్స్ దాగి ఉంది. సాధారణంగా పాములు తమ శరీరం చుట్టూ పొదిగి ఉష్ణోగ్రత ఇస్తాయి. కానీ కింగ్ కోబ్రా మాత్రం ‘కంపోస్ట్ హీట్’ విధానాన్ని వాడుతుంది. గూడులో కుళ్ళిపోతున్న ఆకుల ద్వారా వచ్చే సహజమైన వేడిని ఉపయోగించి గుడ్లను వెచ్చగా ఉంచుతుంది. బయట వాతావరణం ఎంత చల్లగా ఉన్నా.. గూడు లోపల ఉష్ణోగ్రత ఎప్పుడూ 26 డిగ్రీల నుంచి 29 డిగ్రీల సెల్సియస్ మధ్య స్థిరంగా ఉండేలా ఈ తల్లి పాము తన శరీరాన్ని సర్దుబాటు చేస్తుంది. ఇక అసలైన కఠిన పరీక్ష ఇక్కడే మొదలవుతుంది. గుడ్లు పొదిగే కాలం దాదాపు 60 నుంచి 100 రోజుల వరకు ఉంటుంది. ఈ సుదీర్ఘ కాలంలో తల్లి పాము ఆ గూడును ఒక్క క్షణం కూడా విడిచిపెట్టదు. దాని చుట్టూ తన శరీరాన్ని రింగులా చుట్టుకుని పగలు రాత్రి అనక కాపలా కాస్తుంది. ఈ 2 నుంచి 3 నెలల కాలంలో ఆ తల్లి పాము ఏమీ తినదు. కనీసం ఒక్క చుక్క నీరు కూడా తాగదు. ఎలాంటి ఆహారం తీసుకోకుండా అత్యంత కఠినమైన ఉపవాసాన్ని పాటిస్తుంది. ఈ సమయంలో గూడు వైపునకు రాబందులు, అడవి పందులు, మనుషులు ఎవరు వచ్చినా సరే.. తన పడగ విప్పి, అత్యంత భయానకరంగా లో-ఫ్రీక్వెన్సీ బుసలు కొడుతూ శత్రువులపై ఎదురుదాడికి దిగుతుంది. ఆ కింగ్ కోబ్రా కోపాన్ని చూసి ఏ జంతువైనా సరే అక్కడి నుంచి పరారీ కావాల్సిందే. మరి గుడ్లు పొదిగి పిల్లలు బయటకు వచ్చే సమయానికి ఆ తల్లి ఏం చేస్తుంది? అక్కడే ఉండి తన పిల్లలతో ఆడుకుంటుందా? అంటే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. గుడ్లు పొదిగి పిల్లలు బయటకు రావడానికి సరిగ్గా వారం రోజుల ముందు.. ఆ తల్లి పాము ఆ గూడును పూర్తిగా విడిచిపెట్టి ఎంతో దూరంగా వెళ్లిపోతుంది. ఎందుకు వెళ్తుంది? గుడ్లను అంత ప్రేమగా చూసుకున్న తల్లి.. పిల్లలు బయటకు వచ్చే సమయానికి ఎందుకు పారిపోతుంది అనుకుంటున్నారా? ఇక్కడే వన్యప్రాణి పరిశోధకులు చెబుతున్న అద్భుతమైన నిజం ఉంది. సుమారు 60 నుంచి 80 రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా, కఠినమైన ఉపవాసం ఉన్న ఆ తల్లి పాము విపరీతమైన ఆకలితో ఉంటుంది. ఒకవేళ గనుక ఆ సమయంలో తను అక్కడే ఉంటే.. ఆకలి మంట తట్టుకోలేక, గూటి నుండి బయటకు వస్తున్న సొంత పిల్లలను తనే స్వయంగా తినేసే ప్రమాదం ఉంది. తన పిల్లలను వేరే జంతువుల నుంచి కాపాడుకున్న ఆ తల్లి.. చివరికి తన ఆకలి వల్ల తన పిల్లలకే ప్రాణాపొయ రాకూడదని భావించి.. గుడ్లు పగిలి పిల్లలు బయటకు వచ్చే లోపే అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ప్రకృతి ఆ పాముకు నేర్పిన అత్యంత గొప్ప మాతృత్వపు సంకేతం ఇది. చూశారాగా మనం ఎంతగానో భయపడే, విషపూరితమైన కింగ్ కోబ్రా వెనుక ఎంతటి గొప్ప మాతృత్వం, ప్రకృతి రహస్యాలు దాగి ఉన్నాయో. ఇవి ఇతర పాములలా కాకుండా పర్యావరణాన్ని, ఇతర పాములను నియంత్రిస్తూ మన ప్రకృతికి ఎంతగానో మేలు చేస్తాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హైటెక్ సిటీ స్టేషన్‌లో 10 రైళ్లకు హాల్ట్! ఇక ఆఫీస్ నుంచి నేరుగా మీ సొంతూరికి
Ba Ba Black Sheep: పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు చేస్తుంది
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
సూపర్ మార్కెట్ ఏరియాలో భయానక దృశ్యం.. భయంతో జనం పరుగులు!

