షాకింగ్ సైబర్ క్రైమ్! డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో లేడీ వల.. రూ.14.61 కోట్లు గోవిందా
హైదరాబాద్ ఎర్రగడ్డకు చెందిన 44 ఏళ్ల దంత వైద్యుడు భారీ సైబర్ మోసానికి గురయ్యాడు. ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ మాటలు నమ్మి నకిలీ ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో దశలవారీగా రూ.14.61 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. యాప్‌లో రూ.34 కోట్ల లాభం చూపించిన కేటుగాళ్లు, డబ్బు విత్‌డ్రా చేసుకునేందుకు రూ.7.5 కోట్ల పన్ను చెల్లించాలని డిమాండ్ చేయడంతో మోసం బయటపడింది. ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్క ఫేస్‌బుక్ మెసేజ్.. ఒకే ఒక్క అపరిచిత మహిళ మాట.. ఒక డాక్టర్ జీవితాన్ని రోడ్డు మీద పడేసింది. ఆయనేం అమాయకుడు కాదు.. బాగా చదువుకున్న దంత వైద్యుడు. కానీ, సోషల్ మీడియాలో తగిలిన ఆ “మాయలేడీ” విసిరిన వలపు వలలో చిక్కుకుని.. అందినకాడికి అప్పు చేసి, చివరికి ఇల్లు కూడా అమ్మి.. ఏకంగా 14 కోట్ల 61 లక్షల రూపాయలు సైబర్ కేటుగాళ్ల పాలు చేశాడు. తెలంగాణ సైబర్ క్రైమ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద షాకింగ్ మోసం. అసలు ఆ మహిళ ఎవరు? ఆ డాక్టర్ ఎలా బుక్కయ్యాడు? ఈ స్టోరీ వెనుక ఉన్న 34 కోట్ల రూపాయల డ్రామా ఏంటి?
ఈ కథ మొదలైంది ఆగస్టు 27న. హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ ప్రాంతానికి చెందిన 44 ఏళ్ల డెంటల్ డాక్టర్‌కు ఫేస్‌బుక్‌లో ఒక రిక్వెస్ట్ వచ్చింది. మెసేజ్ చేసిన ఆ మహిళ తన పేరు “మోనికా మాధవ్” అని, తాను చెన్నైలో ఉంటానని పరిచయం చేసుకుంది. మొదట సాధారణంగా షురూ అయిన కబుర్లు.. ఆ తర్వాత పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లాయి. పెళ్లైందని, కానీ భర్తతో విభేదాలు వచ్చాయని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నానని డాక్టర్‌ను కేటుగాళ్లు నమ్మించారు. సానుభూతి పేరుతో మాట కలిపి, పూర్తిగా నమ్మకాన్ని పెంచుకున్నారు. ఆ తర్వాత అసలు ఆట మొదలుపెట్టారు. తాము ఆన్‌లైన్ ట్రేడింగ్ ద్వారా రోజుకు లక్షల్లో సంపాదిస్తున్నామని, తనతో కలిసి ఇన్వెస్ట్ చేస్తే మీ జీవితమే మారిపోతుందని ఆశ చూపించారు. చదువుకున్న ఆ డాక్టర్ ఆ మాయమాటల వలలో పూర్తిగా చిక్కుకుపోయారు. ఇక అక్కడి నుంచి డిజిటల్ దోపిడీ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 3న మోనిక చెప్పిన నకిలీ ట్రేడింగ్ వెబ్‌సైట్‌లో ఆ డాక్టర్ తొలిసారిగా 30 లక్షల రూపాయలు డిపాజిట్ చేశారు. చూడండి మాయాజాలం ఎంత పక్కాగా ఉందో. ఆ వెబ్‌సైట్‌లో ఆ వెంటనే రూ.8.6 లక్షలు లాభం వచ్చినట్లు చూపించారు. పైగా, నమ్మకం కలగడం కోసం అందులోంచి 85 వేల రూపాయలు విత్‌డ్రా చేసుకోవడానికి కూడా సైబర్ కేటుగాళ్లు అనుమతించారు. అంతే! ఆ డాక్టర్‌కి ఆ ప్లాట్‌ఫామ్ మీద వందశాతం నమ్మకం వచ్చేసింది. ఇది అసలైన ట్రేడింగే.. అని గుడ్డిగా నమ్మేశారు. ఇద్దరం కలిసి రూ. 10 కోట్లు పెడదాం, మనకు కోట్లలో లాభం వస్తుంది” అని మోనిక మరో భారీ ఎర వేసింది. ఇంకేముంది.. ఆ డాక్టర్ తన దగ్గర ఉన్న పొదుపు మొత్తాలన్నింటినీ కరిగించడమే కాకుండా, భారీగా అప్పులు చేశారు. చివరికి తన ఇల్లు కూడా విక్రయించి మరీ ఆ నకిలీ యాప్‌లో విడతల వారీగా 14 కోట్ల 61 లక్షల రూపాయలు కుమ్మరించారు. ఆ నకిలీ యాప్ డాష్‌బోర్డ్‌లో చూస్తే.. డాక్టర్ ఖాతాలో ఏకంగా 34 కోట్ల రూపాయల లాభం కనిపిస్తోంది. ఆ సంతోషంలో ఆయన తేలిపోయారు.. కానీ ఆ తర్వాతే అసలు నరకం మొదలైంది. వాలెట్‌లో 34 కోట్ల రూపాయలు చూసుకుని మురిసిపోయాడు ఆ డాక్టర్. ఆ డబ్బును తన ఒరిజినల్ బ్యాంక్ ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఏమైంది? ఆప్షన్ పనిచేయలేదు. కంగారుపడిన ఆయన మోనికకు ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే.. ఆమె తన కాంటాక్ట్ నంబర్లను బ్లాక్ చేసి గల్లంతయింది. వెంటనే కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే.. ఆ కేటుగాళ్లు మరింత షాకిచ్చారు. మీకు వచ్చిన రూ.34 కోట్ల లాభాలు మీ అకౌంట్‌లోకి రావాలంటే.. ముందుగా మీరు ట్యాక్స్ రూపంలో ఏడున్నర కోట్ల రూపాయలు చెల్లించాలి అని డిమాండ్ చేశారు. అప్పుడే ఆ డాక్టర్‌కు అర్థమైంది.. తాను మోసపోయానని, ఇన్నాళ్లూ మాట్లాడింది ఒక అందమైన మహిళ కాదు.. కోట్లను కొల్లగొట్టే డిజిటల్ గ్యాంగ్ అని. గుండె పగిలినట్లయింది.. వెంటనే లబోదిబోమంటూ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. చూశారుగా.. బాగా చదువుకున్న డాక్టరే కావచ్చు, ఎంతటివారైనా సరే సోషల్ మీడియాలో వచ్చే మాయమాటలకు, ఈజీ మనీ ట్రేడింగ్ యాప్‌లకు పడిపోతే ఇదే గతి పడుతుంది. ఇల్లు, ఆస్తులు అన్నీ గాలిలో కలిసిపోతాయి. సైబర్ నేరగాళ్లు ఎంతటి హై-టెక్ మోసాలకైనా తెగిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎవరైనా అపరిచితులు వచ్చి “ట్రేడింగ్ చేద్దాం, కోట్లు సంపాదిద్దాం” అంటే ఒక్క క్షణం ఆగి ఆలోచించండి. ఇలాంటి నకిలీ లింక్‌లను అస్సలు క్లిక్ చేయకండి. ఒకవేళ మీరు లేదా మీ చుట్టుపక్కల ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాల బారిన పడితే.. క్షణం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయండి లేదా cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
భారతీయ భోజనం మానేశాకే ఫిట్‌గా అయ్యాను!
కూతురికి గుడికట్టి పూజిస్తున్న తండ్రి!
ఈ ఆకుతో పచ్చడి చేసుకుని తింటే మోకాళ్ల నొప్పులు పరార్!
ఫోన్ నంబర్ లింక్ చేయకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందా? రవాణా శాఖ క్లారిటీ!
