ఏఐతో పెను ప్రమాదం తప్పదు.. ఓపెన్‌ ఏఐ సేఫ్టీ సిస్టమ్స్ టీమ్ కీలక ఉద్యోగి రాజీనామా

Updated on: Oct 08, 2026 | 6:34 PM

ఓపెన్‌ఏఐ సేఫ్టీ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన డేవిడ్‌ రాబిన్సన్‌ రాజీనామా చేసినట్లు వచ్చిన వార్తలు ఏఐ రంగంలో చర్చకు దారితీశాయి. సంస్థ వేగవంతమైన వృద్ధిపై చూపుతున్న దృష్టితో పోలిస్తే ఏఐ భద్రతకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన విమర్శించినట్లు సమాచారం. శక్తివంతమైన ఏఐ మోడల్స్‌ను విడుదల చేసే ముందు కఠినమైన పరీక్షలు, భద్రతా ప్రమాణాలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఓపెన్‌ఏఐ మాత్రం మోడల్స్‌ను సురక్షితంగా నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపింది.

ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘ఓపెన్‌ఏఐ’ కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ సంస్థ సేఫ్టీ సిస్టమ్స్ విభాగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన డేవిడ్ రాబిన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. సంస్థ వేగవంతమైన వృద్ధిపై చూపుతున్న శ్రద్ధను, ఏఐ వల్ల తలెత్తే భద్రతాపరమైన ముప్పులను అరికట్టడంలో చూపడం లేదని ఆయన ఆరోపించారు. “నేను ఓపెన్‌ఏఐని వీడాను, ఎందుకంటే దాని సంస్థాగత సంస్కృతి పూర్తిగా దెబ్బతింది” అని ఓ పత్రిక ద్వారా బహిరంగంగా స్పష్టం చేశారు. సుమారు మూడున్నర ఏళ్లుగా ఓపెన్‌ఏఐలో పనిచేస్తున్న రాబిన్సన్, సంస్థ ధోరణిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. “ఏఐ కంపెనీలు తగినంత జాగ్రత్తగా వ్యవహరించడం లేదు. ఇది కేవలం నిబంధనల సమస్య కాదు, సంస్థాగత వైఖరిలోనే లోపముంది” అని విమర్శించారు. ఏఐ ఉత్పత్తులను హడావుడిగా మార్కెట్లోకి విడుదల చేసి, ఆ తర్వాత సమస్యలు వచ్చినప్పుడు భద్రతా చర్యలు చేపట్టే విధానాన్ని ఆయన తప్పుబట్టారు. ఏఐ మోడల్స్ సామర్థ్యం పెరిగేకొద్దీ, ప్రయోగాల్లో తప్పులు దొర్లితే వాటి వల్ల కలిగే నష్టం ఊహించలేనంత భయంకరంగా ఉంటుందని హెచ్చరించారు. “పరీక్షించి, ఆపై తప్పులు దిద్దుకునే సమయం ఇప్పటికే ముగిసింది” అని పేర్కొంటూ, అణు విద్యుత్ లేదా విమానయాన రంగాలు అనుసరించే అత్యంత కఠినమైన భద్రతా ప్రమాణాలు ఏఐ రంగానికి కూడా తక్షణమే వర్తింపజేయాలని రాబిన్సన్ అభిప్రాయపడ్డారు. ఇటీవల ట్రయల్స్ సమయంలో ఓపెన్‌ఏఐ ఏజెంట్లు ‘హగ్గింగ్ ఫేస్’ అనే మరో ఏఐ స్టార్టప్‌పై దాడికి ప్రయత్నించిన సంఘటనను ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ ఆరోపణలపై ఓపెన్‌ఏఐ ప్రతినిధి స్పందిస్తూ.. తాము సురక్షితంగా నియంత్రించగలిగే పరిమితులకు మించి ఏఐ మోడల్స్ శక్తివంతంగా మారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే మోడల్స్ శిక్షణను కూడా మధ్యలోనే నిలిపివేస్తామని స్పష్టం చేశారు. ఏది ఏమైనా, రాబిన్సన్ రాజీనామాతో ఏఐ రంగంలో ఆవిష్కరణలు, భద్రతా ప్రమాణాల మధ్య ఉండాల్సిన సమతుల్యతపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఖరీదైన బట్టలు, చేతిలో రిచ్ లుక్ బ్యాగ్.. చేసేది మాత్రం..

విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన కరెంట్‌ ఛార్జీలు

చదువుకుంటాను.. సాయం చేయండి!

డ్రైఫ్రూట్స్‌ ఆర్డర్‌ డెలివరీ.. క్షణాల్లో ఖాతా ఖాళీ

Elon Musk: మళ్లీ..ప్రపంచ ట్రిలియనీర్‌గా ఎలన్‌ మస్క్‌

Loading...
Unable to load recommendations.
Follow Us