స్విమ్మింగ్ కు వెళుతున్నారా.. పూల్ కండ్లకలకతో జాగ్రత్త

Updated on: May 14, 2026 | 7:55 PM

వేసవి సెలవుల్లో పిల్లలు స్విమ్మింగ్‌ పూల్స్‌లో ఎక్కువ సమయం గడుపుతుంటారు. అయితే కలుషిత నీరు, అధిక క్లోరిన్ కారణంగా కంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ‘అకాంతమీబా’ వంటి సూక్ష్మజీవులు కళ్లకు హానికరమని చెబుతున్నారు. గాగుల్స్ వినియోగించడం, ఈత తర్వాత కళ్లు శుభ్రం చేసుకోవడం, శరీరానికి తగినంత నీరు అందించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

వేసవి సెలవులు వచ్చాయంటే పిల్లలు సందడి అంతా స్విమ్మింగ్‌ పూల్స్‌ దగ్గరే కనిపిస్తుంది. ఎండ వేడి నుంచి ఉపశమనానికి ఈత ఉత్తమ మార్గం కూడా. అయితే, ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా ప్రమాదం పొంచి ఉంటుంది. తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్ డాక్టర్లు చెబుతున్నారు. ఎందుకంటే కళ్లకు ఇన్‌ఫెక్షన్ కలిగించే ‘అకాంతమీబా’ అనే సూక్ష్మజీవికి స్విమ్మింగ్ పూల్స్‌ ఆవాసాలుగా మారుతున్నాయని హెచ్చరిస్తున్నారు. కలుషిత నీటి ద్వారా కార్నియల్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి పెరిగిందని పరిశోధనలో గుర్తించారు. కాంటాక్ట్ లెన్స్‌లతో ఈతకొట్టే వారికి ప్రమాదం మరింత ఎక్కువ ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అలాంటి సమయంలో గాగుల్స్ ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఇవి సౌకర్యం కోసం మాత్రమే కాదు ఇన్‌ఫెక్షన్ బారి నుంచి కూడా కాపాడుతాయి. దగ్గు, జలుబు, ముక్కుకారడం, కంటి నుంచి చీము కారడం వంటి లక్షణాలు ఉన్న వారిని ఈతకు తీసుకెళ్లవద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్‌లో ఎక్కువ సేపు ఉంటే పిల్లలకు కళ్లు దురద పెట్టే అవకాశం ఉందని, అలాంటి సందర్భాలలో కంటి చుక్కల మందును వేసుకోవచ్చని వైద్యులు సలహా ఇచ్చారు. ఇన్‌ఫెక్షన్ తగ్గించడానికి స్విమ్మింగ్ పూల్ యజమానులు క్లోరిన్ ఉపయోగిస్తారని, అది కంటిలోని సహజ రక్షణ పొర అయిన కన్నీటి పొరను బలహీనపరుస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అధిక క్లోరిన్ తో కంటి ఇన్‌ఫెక్షన్, కండ్ల కలక, తీవ్రమైన కళ్ల మంట, దృష్టి మసకబారడం వంటి వ్యాధులు రావచ్చు. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టిన వెంటనే శుభ్రమైన నీటితో కళ్లు కడుక్కోవడం ద్వారా రసాయనాలు, వ్యాధికారక క్రిముల నుంచి రక్షణ పొందవచ్చు. ఎండ తీవ్రత చర్మంపై పడకుండా ఉండటానికి వాటర్‌ ప్రూఫ్‌ సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాయాలి. ముఖ్యంగా నీటిలో ఉన్నప్పుడు దాహం వేయదని అనుకుంటారు, కానీ డీహైడ్రేషన్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మధ్యలో మంచినీళ్లు లేదా పండ్ల రసాలు తాగుతుండాలి. అంతేకాదు, ఈతకు వెళ్లే ముందు, వచ్చిన తర్వాత తప్పనిసరిగా షవర్‌ చేయాలి. దీనివల్ల పూల్‌లోని క్లోరిన్‌ ప్రభావం చర్మంపై పడకుండా ఉంటుంది. పిల్లల వెంట వచ్చే తల్లిదండ్రులు.. ప్రాథమిక చికిత్స, సీపీఆర్‌పై అవగాహన కలిగి ఉండటం మంచిది. పూల్‌ దగ్గర అత్యవసర ఫోన్‌ నంబర్లు సిద్ధంగా ఉంచుకోవాలి. వేసవి వినోదం ప్రమాదంగా మారకుండా ఉండాలంటే ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటించాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Khammam: అనాథ కుక్కపిల్లకు తల్లిగా మారిన కోతి.. వైరల్ అవుతున్న వీడియో

వామ్మో.. ఎంత పెద్ద కెంపో.. ధర ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా ??

రూ.10 కోట్లకి ఇంత చిన్న ఇల్లా.. ఆకాశానంటుతున్న ధరలు

బంగారం లేకుండానే పెళ్లి.. యువత కొత్త ట్రెండ్‌

Weather Update: తెలంగాణలో బండలు పగిలే ఎండలు.. అల్పపీడనంతో ఏపీలో వర్షాలు

Follow Us